కౌన్సెలింగ్‌.... కంటికి చలువ కావాలా?

30-10-2017: డాక్టర్‌ గారూ! నేను రోజు మొత్తంలో దాదాపు 8 గంటలపాట కంప్యూటర్‌ వర్క్‌ చేస్తాను. గత వారం రోజులుగా కళ్లు మంటలు, నీరు కారటం, కంట్లో గుచ్చుకుంటున్నట్టు నొప్పి సమస్యలతో బాధ పడుతున్నాను. ఈ బాధలకు ఆయుర్వేద పరిష్కారాలు సూచిస్తారా?

- రాణి, మంచికొల్లు
మీ కంటి సమస్యలకు ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలున్నాయి. అయితే కంప్యూటర్‌ ముందు నిరవధికంగా పని చేయకుండా, ప్రతి రెండు గంటలకు ఒకసారి కనీసం 10 నిమిషాలపాటు కళ్లకు విశ్రాంతినిస్తూ ఉండండి. ఈ జాగ్రత్తతోపాటు ఈ కింది చిట్కాలు పాటించండి.
ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే ఉసిరి కాయను దంచి, 20 మిల్లీ లీటర్ల రసాన్ని పరగడుపునే తాగండి.
భృంగరాజం ఉపయోగకరమైన మూలిక. ఈ నూనె లేదా పేస్ట్‌ను కనురెప్పల మీద పూసుకున్నా ఫలితం ఉంటుంది.
త్రిఫలానికి నేత్ర రసాయన అని ఆయుర్వేదంలో పేరు. దీన్ని సమపాళ్లలో తేనె, తాజా నెయ్యితో కలిపి తీసుకోవాలి. ఇలా రాత్రి పడుకోబోయే ముందు చేస్తే రెండు రోజుల్లోనే సమస్య అదుపులోకొస్తుంది. ఇలా కాకపోతే ఒక టీస్పూన్‌ త్రిఫల చూర్ణాన్ని గ్లాసు నీళ్లలో కలిపి రాత్రంతా కదల్చకుండా ఉంచాలి. మరుసటి ఉదయం ఈ నీళ్లను వడగట్టి ఆ నీటితో కళ్లను కడగాలి.
డాక్టర్‌ చలపతి, ఆయుర్వేద వైద్యులు, సికింద్రాబాద్‌.