మారిన అంధత్వ లెక్కలు

10 అడుగుల దూరంలో ఉన్నది కనపడకుంటేనే అంధత్వం
ఇన్నాళ్లుగా ఆ లెక్క 20 అడుగులు!
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా మార్పు

 

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19: దేశంలో అంధత్వ నిర్వచనాన్ని మారుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు కొత్త నిర్వచనాన్ని ప్రకటించింది. దాని ప్రకారం.. 3 మీటర్ల (దాదాపు 10 అడుగులు) దూరంలో ఉన్న వ్యక్తి చేతివేళ్లను మాత్రమే గుర్తించగలిగేవారిని ఇకపై అంధులుగా పరిగణించనుంది. 1976లో జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమం ప్రారంభమైన సమయంలో ఏర్పరచుకున్న ప్రమాణాల ప్రకారం ఇది 6 మీటర్లుగా ఉండేది. ఈ నిర్ణయం వల్ల.. దేశంలో ఇన్నాళ్లుగా ప్రభుత్వం అంధులుగా పరిగణిస్తున్న 1.2 కోట్ల మందిలో 40 లక్షల మంది అంధుల కేటగిరీలోకి రాకుండా పోతారు!! సాధారణ కంటి చూపు ఉన్న ఒక వ్యక్తి 60 మీటర్ల దూరం (200 అడుగులు) నుంచి చూడగలిగిన అక్షరాలను/లెక్కపెట్టగలిగిన వేళ్లను 6 మీటర్ల లోపు దూరం (దాదాపు 20 అడుగుల) నుంచి చూసినప్పుడు మాత్రమే గుర్తించగలిగేవారిని ఇన్నాళ్లూ అంధులుగా పరిగణించేవారు. దృష్టిలోపం కేటగిరీలో దీన్ని 6/60 గా వ్యవహరిస్తారు. ఈ ప్రమాణం ప్రకారం.. 2007లో జాతీయ అంధత్వ సర్వే నిర్వహించగా దేశంలో 1.2 కోట్ల మంది అంధులున్నట్టు తేలింది. అయితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం దృష్టిలోపం కేటగిరీలో 3/60 చూపు ఉన్నవారు మాత్రమే అంధులు. అంటే సాధారణ కంటిచూపున్న వ్యక్తి 60 మీటర్ల దూరం నుంచి సైతం చూడగలిగినదాన్ని కేవలం 3 మీటర్లు, అంతలోపు దూరం నుంచి మాత్రమే గుర్తించగలిగేంత బలహీనమైన చూపున్నవారు అంధుల కింద లెక్క. దూరం ఇలా ఒకేసారి 6 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించడంతో.. దేశంలో అంధుల సంఖ్య 80 లక్షలకు తగ్గిపోయింది.

ఇప్పుడెందుకు మార్చారు?
మనదేశమేమో 1976లో ఏర్పరచుకున్న ప్రమాణాల ప్రకారం అంధులను లెక్కిస్తుంటే.. ప్రపంచంలోని పలు దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం అంధత్వాన్ని నిర్వచిస్తున్నాయి. దీంతో ఆయా దేశాలతో పోలిస్తే మన అంధుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇది మనదేశాన్ని ఆయా దేశాల ముందు తక్కువ చేసి చూపుతోంది. దీనికితోడు.. 2020 నాటికి దేశ జనాభాలో అంధుల సంఖ్యను 0.3 శాతానికి పరిమితం చేయాలన్న డబ్ల్యూహెచ్‌వో లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆ సంస్థ ప్రమాణాలను పాటించడమే మార్గమన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.