కళ్ల కింద నలుపు పోవాలంటే...

ముఖం ఎంత కాంతివంతంగా ఉన్నా కళ్ల కింద నల్లని వలయాలుంటే కళావిహీనంగా కనిపిస్తారు. కళ్ల కింది నలుపుకు పోషకాహారలోపం, నిద్రలేమిలాంటి కారణాలనేకం.
మిగతా చర్మంతో పోలిస్తే కళ్ల చుట్టూ ఉండే చర్మం పలుచగా, సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మధ్యవయస్కులతోపాటు ఈమధ్య కాలంలో యువతుల్లో కూడా కళ్ల కింద నల్లని వలయాలు ఉంటున్నాయి. తాజా పళ్లు, కూరగాయలు, పెరుగు, పనీర్‌, పాలు, చిక్కుళ్లు మొదలైన పదార్థాలను తీసుకుంటూ రోజుకి కనీసం 8 గంటలు నిద్రపోవాలి. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించే శ్వాస వ్యాయామాలు చేస్తే ఫలితం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే తయారుచేసుకునే సౌందర్య చికిత్సలు అనుసరించాలి. 
 
  • రోజూ రాత్రి పడుకునే ముందు దోస రసాన్ని కళ్ల కింద రాసుకుని 15 నిమిషాలాగి కడిగేసుకోవాలి. 
  • సమ పాళ్లలో దోస, బంగాళాదుంప రసాలను కలిపి రాయాలి. 15 నిమిషాలాగి కడిగితే కళ్ల కింద నలుపు, వాపు తగ్గుతాయి.
  • టమోటా రసం పూసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది. 
  • చల్లని పాలు లేదా నీళ్లలో ముంచిన దూదిని కళ్ల మీద కొద్ది నిమిషాలపాటు ఉంచాలి. 
  • చల్లని టీ బ్యాగ్స్‌ను కనురెప్పలపై ఉంచితే కళ్లు సేదతీరతాయి. 
  • బాదం పేస్ట్‌కు కొద్దిగా పాలు కలిపి కళ్ల చుట్టూ రాసుకుని రాత్రంతా ఉంచుకుని ఉదయం కడిగేస్తే కళ్ల కింది చర్మం తేటగా తయారవుతుంది. 
  • పుదీనా ఆకుల్ని నలిపి కళ్ల చుట్టూ పూసుకుని 20 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి. 
  • ఆరెంజ్‌ జ్యూస్‌, గ్లిజరిన్‌లను కలిపి కళ్ల చుట్టూ పూసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే కళ్ల చుట్టూ ఉండే చర్మం తేటగా తయారవుతుంది.