కళ్ల కింద నలుపు వదలాలంటే...

ముఖం ఎంత కాంతివంతంగా ఉన్నా కళ్ల కింద నల్లని వలయాలుంటే కళావిహీనంగా కనిపిస్తాం. కళ్ల కింది నలుపుకు పోషకాహారలోపం, నిద్రలేమిలాంటి కారణాలు అనేకం. అందుకే ఈ సమస్యలను పరిష్కరించటంతోపాటు నలుపును తగ్గించే చిట్కాలు కూడా పాటించాలి.

 
చర్మం మీది మిగతా చర్మంతో పోలిస్తే కళ్ల చుట్టూ ఉండే చర్మం ఎంతో పలుచగా, సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మధ్యవయస్కులతోపాటు ఈమధ్య కాలంలో యువతుల్లో కూడా కళ్ల కింద నల్లని వలయాలు చోటుచేసుకుంటున్నాయి. తాజా పళ్లు, కూరగాయలు, పెరుగు, పనీర్‌, పాలు, చిక్కుళ్లు మొదలైన పదార్థాలను తీసకుంటూ రోజుకి కనీసం 8 గంటలపాటు నిద్రపోవాలి. క్రమం తప్పక వ్యాయామం చేయాలి. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించే శ్వాశ వ్యాయామాలు కూడా చేస్తే ఫలితం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ తేలికగా ఇంట్లోనే తయారుచేసుకోగల ఈ సౌందర్య చికిత్సలను అనుసరించాలి.
 
  • ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దోస రసాన్ని కళ్ల కింద అప్లై చేసి 15 నిమిషాలాగి కడిగేసుకోవాలి. 
  • సమ పాళ్లలో దోస, బంగాళాదుంప రసాలను కలిపి అప్లై చేసి 15 నిమిషాలాగి కడిగేసుకుంటే కళ్ల కింద నలుపుతోపాటు వాపు కూడా తగ్గుతుంది. 
  • టమేటా రసం పూసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. 
  • చల్లని పాలు లేదా నీళ్లలో ముంచిన దూదిని కళ్ల మీద కొద్ది నిమిషాలపాటు ఉంచుకోవాలి. 
  • చల్లని టీ బ్యాగ్స్‌ను మూసిన కనురెప్పలపై ఉంచుకుంటే కళ్లు సేదతీరి నలుపు అదుపులోకొస్తుంది. 
  • బాదం పేస్ట్‌కు కొద్దిగా పాలు కలిపి కళ్ల చుట్టూ రాసుకోవాలి. ఇలా రాత్రంతా ఉంచుకుని ఉదయం కడిగేసుకుంటే కళ్ల కింది చర్మం తేటగా తయారవుతుంది. 
  • పుదీనా ఆకుల్ని నలిపి కళ్ల చుట్టూ పూసుకుని 20 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి. 
  • ఆరెంజ్‌ జ్యూస్‌, గ్లిజరిన్‌లను కలిపి కళ్ల చుట్టూ పూసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే కళ్ల చుట్టూ ఉండే చర్మం తేటగా తయారవుతుంది.
ఐ కేర్‌ 
  • కళ్ల చుట్టూ ఉండే చర్మం సున్నితమైనది కాబట్టి ఆ ప్రదేశంలో అప్లై చేసే మేకప్‌ మొదలు మసాజ్‌ వరకూ ఎంతో మృదువుగా వ్యవహరించాలి. 
  • మేకప్‌ తీసేటప్పుడు మృదువైన దూదిని, మేలురకం క్లీన్సర్‌ను ఉపయోగించాలి. 
  • సున్నితంగా తాకుతూ నెమ్మదిగా మేకప్‌ తొలగించాలి. 
  • అలాగే కళ్ల చుట్టూ క్రీమ్‌ అప్లై చేసేటప్పుడు కూడా సున్నితంగానే వ్యవహరించాలి. 
  • కళ్ల చుట్టూ ఏదైనా ఫార్ములేటెడ్‌ క్రీమ్‌ అప్లై చేసి నీళ్లతో తడిపిన దూదితోనే సున్నితంగా తొలగించాలి. 
  • బాదం కలిగిన అండర్‌ ఐక్రీమ్‌ ప్రతి రోజూ నిద్రకు ముందు అప్లై చేయాలి. 
  • ఫేస్‌ మాస్క్‌ వేసుకునేటప్పుడు కంటి చుట్టూ ఉండే చర్మానికి తగలనివ్వకూడదు. 
  • కళ్లను ముందు గోరువెచ్చని నీళ్లతో తర్వాత చల్లని నీళ్లతో కడిగితే రక్త ప్రసరన మెరుగై కళ్లు తేజోవంతంగా ఉంటాయి.