నొప్పి మాత్రలతో మహిళలకు వినికిడి లోపం

బోస్టన్‌: తల నొప్పి, కడుపు నొప్పి పేరుతో అదేపనిగా నొప్పి మాత్రలు మింగుతున్నారా.. అయితే కాస్త జాగ్రత్త! ఐబ్రూఫెన్‌ లాంటి మాత్రలను ఆరేళ్లకు పైగా తీసుకుంటే వినికిడి లోపం తలెత్తే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ముఖ్యంగా ఈ ముప్పు మహిళలకే ఎక్కువని బ్రిగ్‌హాం అండ్‌ ఉమెన్స్‌ కాలేజీ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ కారణం వల్లే అమెరికాలో వినికిడి లోపం సాధారణంగా మారిందని గ్యారీ కుర్హాన్‌ వివరించారు. వినికిడి లోపానికి దారితీసే కారణాలు తెలుసుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించి, ముప్పును తప్పించడమో లేక నెమ్మదింపజేయడమో చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు 54 వేల మంది మహిళలను పరీక్షించి, సేకరించిన డాటాను విశ్లేషించి ఈ విషయాన్ని కనుగొన్నట్లు కుర్హాన్‌ వివరించారు. కాగా, ఆస్పిరిన్‌ మాత్రలతో ఈ ముప్పు పెద్దగా కనిపించలేదన్నారు.