వాటిలో ఏది బెటర్‌?

21-04-2018: డయాబెటిస్‌ (మధుమేహం) వున్నవాళ్లు పంచదార బదులు బ్రౌన్‌ షుగర్‌ తీసుకోవచ్చా? తేనె, బెల్లం... వీటిలో ఏది మంచిది? ఏ పండ్లు తినొచ్చు? అప్పుడప్పుడు స్వీట్స్‌ తినొచ్చా?

మీకు స్వీట్స్‌ బాగా ఇష్టమని అర్థమవుతోంది. అయితే పండ్లే మీకు బెస్ట్‌ స్వీట్స్‌. ఏ పండయినా తినొచ్చు. డయాబెటిస్‌ ఉన్నవారు ఏ ఆహారాన్నైనా మితంగా తీసుకోవాలి. మరీ ఎక్కువగా, మరీ తక్కువగా కాకుండా, ఒక కొలమానం మేరకు తీసుకోవాలి. మీ పొట్టలోకి వెళ్ళే ప్రతి ఆహారం కొంత గ్లూకోజ్‌ అందిస్తుంది. కాబట్టి ఏ ఆహారాలు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారో బేరీజు వేసుకోవడమే కొలత. అయితే ‘ప్రతి రోజూ ఇలా చెయ్యాలా? ఎంతో ఒత్తిడికి గురవుతాం కదా!’ అనుకుంటున్నారా. నిజానికి ప్రతి రోజూ ఏం తినాలో మనకి ఒక వివరమైన ప్రణాళిక ఉంటుంది. దానికి అనుగుణంగా నడుచుకుంటే సరిపోతుంది.
 
పండ్లలో తియ్యదనంతో పాటు పీచు పదార్ధం, యాంటీఆక్సిడెంట్లు (జీవక్రియ రక్షకాలు), ఫైటో కెమికల్స్‌ లేదా స్వస్థత చేకూర్చే పోషకాలూ ఉంటాయి. అవి బోనస్‌ కదా! అయితే ఎప్పుడైనా పండగకో, పబ్బానికో స్వీట్స్‌ తినాల్సి వచ్చినప్పుడు, దానికి ముందు వెజిటబుల్‌ సలాడ్‌ తీసుకోవాలి. దీనివల్ల అచ్చమైన (ప్యూర్‌) చక్కెర తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాన్ని కొంత వరకు తగ్గించవచ్చు. చక్కెర, బ్రౌన్‌ షుగర్‌, బెల్లం, తేనె... దాదాపు ఇవన్నీ 340 నుండి 500 వరకు కెలొరీలు అందిస్తాయి. ఒకే ఒక్క తేడా ఏమిటంటే, బెల్లంలో క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం ఉంటాయి. తేనెలో రెండు, మూడు రకాల షుగర్స్‌ మిళితమై వుంటాయి. కాబట్టి వీటిలో ఏది తీసుకున్నా సరే, ప్రతి ఒక్కరూ మితం పాటించాలి.