మధుమేహంతో కీళ్లనొప్పులు వస్తాయా?

21-06-2017:నా వయసు 46. నాకు గత ఆరేళ్లుగా మధుమేహం ఉంది. ఇది చాలదన్నట్లు రెండేళ్ల క్రితం నుంచి మోకాళ్ల నొప్పులు కూడా మొదలయ్యాయి. నాకు అర్థం కానిదేమిటంటే ఈ రెండూ వేరు వేరు సమస్యలా? లేక ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయా? ఈ సమస్యల్ని సమర్థవంతంగా నియంత్రించే మార్గం చెప్పండి.
- ఆర్‌. వెంకటేశ్‌, ఆదిలాబాద్‌
 
మధుమేహం, మీకున్న కీళ్ల నొప్పులు వేరు వేరు విషయాలేమీ కాదు. ఈ రెండూ పరస్పర సంబంధం ఉన్న సమస్యలే. సహజంగా మన శరీరంలోని ఏ అవయవం పనిచేయడానికైనా శక్తి కావాలి. ఆ శక్తి అనేది గ్లూకోజ్‌నుంచి వస్తుంది. మధుమేహం కారణంగా ఎవరిలోనైనా గ్లూకోజ్‌ మెటబాలిజం దెబ్బతిన్నప్పుడు శరీరంలో గ్లూకోజ్‌ నిల్వలు పెరుగుతాయి. అయితే, పెరిగిన ఆ నిల్వలను నియంత్రించడం కూడా వెనువెంటనే జరగాలి. మనకు అవసరమైన శక్తి వినియోగంలోకి రావాలంటే, అందుకు అనుగుణంగా గ్లూకోజ్‌ బ్రేక్‌డౌన్‌ కావాలి. అలా బ్రేక్‌డౌన్‌ అయినప్పుడే శక్తి విడుదల అవుతుంది. అలా శ క్తి విడుదల కావల్సిన సమయంలో గ్లూకోజ్‌ వినియోగం జరగకపోతే, శక్తి విడుదలకాదు. గ్లూకోజ్‌ వినియోగం కావాలంటేనేమో, క్లోమగ్రంధినుంచి ఇన్సులిన్‌ విడుదల కావలసి ఉంటుంది. మధుమేహుల్లో ఉన్న సమస్యే ఇది. వీరిలో అవసరమైన మోతాదులో ఇన్సులిన్‌ ఉత్పనం కాదు కాబట్ట్లి గ్లూకోజ్‌ బ్రేక్‌డౌన్‌ కావడమూ ఉండదు. శక్తి విడుదల కావడమూ ఉండదు. శక్తి విడుదల కానప్పుడు సహజంగానే కండరాలు, ఎముకలు, కీళ్లూ బలహీనపడతాయి. అయినా అదేమీ పట్టించుకోకుండా, యదావిధిగా రోజువారీ పనులన్నీ చేసుకుంటూ వెళతాం. కీళ్లకు అది శక్తిని మించిన భారమవుతుంది. అందుకే కీళ్లు అరిగిపోవడం, విరిగిపోవడం జరుగుతుంది. మధుమేహానికీ, కీళ్ల నొప్పులకూ ఉన్న సంబంధమే ఇది. శక్తి వినియోగంలోకి రానప్పుడు మరో సమస్య ఏమిటంటే, శరీరంలో సమాంతరంగా జరిగే రిపేరింగ్‌ ప్రక్రియ కూడా ఉండదు. రిపేరింగ్‌ కానప్పుడు గాయాలు మానకుండా దీర్ఘకాలికంగా అలా కొనసాగుతూనే ఉంటాయి. ఫలితంగా గాయం ద్వారా వచ్చే కీళ్ల నొప్పులు కూడా ఎక్కువ కాలం కొనసాగుతూనే ఉంటాయి అందుకే మధుమేహాన్ని పూర్తి నియంత్రణలోకి తెచ్చుకుంటూ అదే సమయంలో మోకాళ్ల నొప్పులకు కూడా వైద్య చికిత్సలు తీసుకుంటేనే మీరు మోకాళ్లనొప్పులనుంచి పూర్తి విముక్తి పొందగలుగుతారు.
- డాక్టర్‌ చంద్రశేఖర్‌, జనరల్‌ ఫిజీషియన్‌