షుగర్‌ కాయం తగ్గిద్దాం!

అక్టోబరు 11 ‘వరల్డ్‌ యాంటీ ఒబేసిటీ డే’

09-10-2018:ఊబకాయం, మధుమేహం... ఈ రెండింటిదీ అవినాభావ సంబంధం! శరీర బరువుతోపాటు మధుమేహం కూడా పైపైకి ఎగబాకుతుంది! చాపకింద నీరులా నిశ్శబ్దంగా శరీరంలో తిష్ఠ వేసి గుల్ల చేస్తుంది! కాబట్టి, తేనె పూసిన ఈ కత్తి నుంచి తప్పించుకోవాలంటే... కొంత అప్రమత్తత, మరికొంత ముందు జాగ్రత్త అత్యవసరం!

ఉరుకులు పరుగుల జీవితం. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ హడావిడి, ఆందోళన, ఒత్తిడి! బడికెళ్లే పిల్లలు మొదలు ఆఫీసులకు పరుగులెత్తే ఉద్యోగుల వరకూ నెలకొని ఉన్న పరిస్థితి ఇది! ఏం తింటున్నాం? ఎలా ఉంటున్నాం? ఎలా జీవితాన్ని గడుపుతున్నాం? అనే స్పృహ క్రమేపీ తగ్గుతోంది! రుచిగా అనిపిస్తే తినేయడం, తోచినప్పుడు నిద్రపోవడం, గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయి పని చేయడం... స్థూలంగా ఎక్కువ శాతం మంది అనుసరించే జీవనశైలి ఇది. ఫలితం... ఊబకాయం! దాని వెంటే మధుమేహం! ఈ చట్రం నుంచి తప్పించుకోవడం కష్టమే! అయినా స్థూలకాయం, దానికి అనుబంధంగా మధుమేహం రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు.
 
అధిక బరువు, మధుమేహం అన్నదమ్ములు!
వంశపారంపర్యం: తల్లితండ్రులు ఊబకాయులైతే పిల్లలూ ఊబకాయులయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగని తల్లితండ్రులు ఐడియల్‌ వెయిట్‌లో ఉన్నంత మాత్రాన వారి పిల్లలు స్థూలకాయులు కాలేరనీ చెప్పలేం! పిల్లల ఆహారపుటలవాట్లు, జీవనశైలి.. ఇలా ఎన్నో అంశాలు ఊబకాయాన్నీ, ఫలితంగా మధుమేహాన్నీ ప్రభావితం చేస్తాయి.
 
డిప్రెషన్‌: నిరాశా నిస్పృహలు కొందరిలో ఆకలిని పెంచుతాయి. మానసిక సంతృప్తి, సాంత్వన పొందడం కోసం ఆహారం మీద ఆధారపడతారు. మరీ ముఖ్యంగా ఆకలి తీర్చుకోవడానికి తీపి పదార్థాలను ఎంచుకుంటారు. ఇలాంటి ఎమోషనల్‌ ఈటింగ్‌ డిజార్డర్‌ కారణంగా శరీరంలోకి ఎక్కువ కేలరీలు చేరి, స్థూలకాయులవుతారు. అంతిమంగా మధుమేహానికి గురవుతారు.
 
అస్తవ్యస్త జీవనశైలి: శరీర బరువు నియంత్రణకు...ఎనిమిది గంటల నిద్ర, సమతులాహారం, వ్యాయామం... ఈ మూడూ ప్రధానమైన అంశాలు. వీటిలో ఏ ఒక్కటి కొరవడినా బరువు పెరిగే అవకాశాలను కొని తెచ్చుకున్నట్టే! ప్రాసెస్డ్‌ ఫుడ్‌, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు, తీపి పదార్థాలు, శీతల పానీయాలు, ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, సాల్టెడ్‌ బిస్కెట్లు, స్నాక్స్‌... ఇవన్నీ స్థూలకాయానికి స్నేహితులు. పగలంతా పనులతో అలసిన శరీరం మరుసటి రోజుకి సరిపడా శక్తిని సంపాదించుకోవాలంటే సరిపడా విశ్రాంతినివ్వాలి. అలా జరగనప్పుడు మెటబాలిజం కుంటుపడి శరీర బరువు పెరుగుతుంది. వ్యాయామం దినచర్యలో భాగంగా ఉండాలి. కానీ అందుకు సమయం కేటాయించలేకపోతే, కేలరీలు ఖర్చయ్యే మార్గాన్ని చేతులారా మనమే మూసేసినట్టై, ఖర్చవని కేలరీలు శరీరంలో కొవ్వును జమ చేస్తాయి.
 
బయలాజికల్‌ క్లాక్‌: ఏ సమయానికి జరగవలసినది ఆ సమయానికి జరిగిపోవాలి. శరీరం సమర్థంగా పని చేయాలంటే ప్రకృతి సహజమైన జీవనశైలిని అనుసరించాలి. పగలు నిద్రపోయి రాత్రుళ్లు మేలుకుంటున్నా, భోజన వేళలు సక్రమంగా పాటించకపోయినా శరీర జీవక్రియలు క్రమం తప్పుతాయి. ఇదే పరిస్థితి దీర్ఘకాలంపాటు కొనసాగితే శరీరం బరువు పెరుగుతుంది. ఫలితంగా మధుమేహం వేధిస్తుంది.
 
బరువు అదుపు తేలికే!
శరీరం బరువును అదుపులో ఉంచుకోవాలంటే, నోరు ఒక్కటీ అదుపులో ఉంచుకుంటే సరిపోదు. ఆహారంతోపాటు, తినే పద్ధతీ, వేళలూ, పరిమాణాలూ అన్నిటి మీదా దృష్టి పెట్టాలి.
కొవ్వులు, పిండిపదార్థాలు తక్కువగా... మాంసకృత్తులు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే సమతులాహారం అలవాటు చేసుకోవాలి. చక్కెర వీలైనంత తగ్గించాలి.
నియమిత భోజన వేళలు పాటించాలి. భోజనానికి భోజనానికి మధ్య కనీసం నాలుగు గంటల వ్యవధి కేటాయించాలి.
ఉదయం అల్పాహారం మానకూడదు. ఆ అల్పాహారంలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మధ్యాహ్న భోజనం మితంగా, రాత్రి మరింత మితంగా తినాలి.
మైదా, చక్కెరలతో తయారైన వంటకాలు సాధ్యమైనంత తగ్గించాలి.
ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలపాటైనా వ్యాయామం చేయాలి. నడక, ఈత, సైక్లింగ్‌... లాంటి తేలికపాటి వ్యాయామాలు చేసినా ఫలితం ఉంటుంది.
అన్నిటికంటే ముఖ్యంగా ఎంత రుచిగా ఉన్నా, ఎంత ఆకలిగా ఉన్నా మితంగా తినడం అలవాటు చేసుకోవాలి.
జంక్‌ ఫుడ్‌, నెయ్యి, నూనెలు, చీజ్‌, పన్నీర్‌లతో తయారైన వంటకాలను పూర్తిగా మానలేకపోతే, వారంలో ఒక రోజు మాత్రం వాటిని మితంగా రుచి చూడవచ్చు.

పెరిగే బరువుతో టైప్‌2 డయాబెటిస్‌!

శరీర బరువును అదుపులో ఉంచుకోగలిగితే మధుమేహం కూడా అదుపులోకొస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది వీలు కాకపోవచ్చు. ఎన్ని నియమాలు పాటించినా శరీర బరువు అదుపులోకి రాకపోవచ్చు. దాంతోపాటే మధుమేహమూ నియంత్రణ లేకుండా పెరిగిపోనూవచ్చు. మరీ ముఖ్యంగా టైప్‌2 డయాబెటి్‌సలో రక్తంలో చక్కెర స్థాయులు అపరిమితంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇన్సులిన్‌ సహాయంతో చక్కెరలను శక్తిగా మలుచుకునే సామర్ధ్యాన్ని కణాలు కోల్పోతాయి. దాంతో పిత్తాశయం మరింత ఇన్సులిన్‌ను విడుదల చేస్తూ ఉంటుంది. ఒక దశలో ఇక ఇన్సులిన్‌ను తయారు చేసే సామర్ధ్యాన్ని పిత్తాశయం పూర్తిగా కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితే ‘టైప్‌2 మధుమేహం’. ఈ పరిస్థితి స్థూలకాయం చేకూరకముందు నుంచే శరీరంలో నెలకొని ఉంటుంది. పెరిగే బరువుతో పాటు అంతర్గతంగా సమస్య పెరుగుతూ చివరికి మధుమేహం రూపంలో బయట పడుతుంది.
  
డయబేసిటీ ఊబకాయం, మధుమేహం... ఇవి పరస్పరం ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. కాబట్టే అధిక బరువుతో కూడిన మధుమేహానికి ‘డయబేసిటీ’ అనే పేరొచ్చింది. శరీర బరువుతో మధుమేహం ఎందుకొస్తుందంటే?.... బరువెక్కిన శరీరం రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచే ఇన్సులిన్‌ను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. శరీరంలో తగినంత ఇన్సులిన్‌ తయారవుతున్నా, దాన్ని పీల్చుకునే శక్తిని శరీర కణజాలం కోల్పోతుంది. ఫలితంగా స్థూలకాయులు మధుమేహం బారిన పడతారు.
 
బరువు తగ్గించే సర్జరీ
ఊబకాయం, దాని అనుబంధ మధుమేహం.. ఈ రెండూ అదుపు చేయలేని పరిస్థితుల్లో అక్కరకొచ్చే సర్జరీ ఇది. సాధారణంగా ఊబకాయాన్ని తగ్గించడం కోసం ‘బేరియాట్రిక్‌ సర్జరీ’ని అనుసరిస్తూ ఉంటారు. కానీ ఈ సర్జరీ తదనంతరం దీర్ఘకాలంపాటు దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్లు, మధుమేహం అదుపు తప్పడం.. బేరియాట్రిక్‌ సర్జరీకి చెందిన ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలనుకుంటే ‘ఐలియల్‌ ఇంటర్‌పొజిషన్‌ సర్జరీ’ని ఎంచుకోవచ్చు. బేరియాట్రిక్‌ సర్జరీలో జీర్ణాశయం, చిన్నపేగుల పరిమాణాన్ని కుదించడం ద్వారా, తీసుకునే ఆహార పరిమాణాన్ని కుదిస్తారు. ఫలితంగా శక్తి కోసం కొవ్వు కరగడం మొదలై శరీరం బరువు కోల్పోతుంది. అయితే రక్తంలోని చక్కెర స్థాయులను ప్రభావితం చేసే, ఇన్సులిన్‌ స్రావాన్ని ప్రేరేపించడానికి ఉపయోగపడే జీర్ణవ్యవస్థలోని కీలక అవయవం ‘ఐలియం’ కేంద్రంగా ‘ఐలియల్‌ ఇంటర్‌పొజిషన్‌ సర్జరీ’ సాగుతుంది.
 
ఆహారం తిన్న వెంటనే ప్రేరణ చెందడం కోసం చిన్న పేగులకు దూరంగా ఉండే ‘ఐలియం’ను మరే ఇతర జీర్ణసంబంధ అవయవాలను కదిలించకుండా, చిన్నపేగు ప్రారంభ ప్రదేశానికి తెచ్చి అమరుస్తారు. ఇలా ఐలియం స్థానాన్ని మార్చడం వల్ల, తిన్న ఆహారం చిన్న పేగుల్లో ఎక్కువ సమయంపాటు ప్రయాణించి చివరికెప్పుడో ఐలియంను చేరే పరిస్థితి తప్పుతుంది. తిన్న వెంటనే ఐలియంను చేరడం వల్ల దీన్నుంచి జిఎల్‌పి-1 అనే స్రావం విడుదలై, ఆ స్రావం ప్రేరణతో ఇన్సులిన్‌ విడుదలవుతుంది. ఫలితంగా రక్తంలోని చక్కెర స్థాయులు గాడిలో పడతాయి. పేగుల్లో ఆహారం ప్రయాణించే దూరం కూడా తగ్గుతుంది కాబట్టి కొద్దిపాటి ఆహారానికే ఆకలి తీరుతుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా శరీరంలోకి చేరే కేలరీల సంఖ్య తగ్గి శరీర బరువు అదుపులోకి వస్తుంది.
 
 
 
డాక్టర్‌ సురేంద్ర ఉగాలే,
ఒబేసిటీ అండ్‌ డయాబెటిస్‌
మెటబాలిక్‌ సర్జన్‌,
విరించి హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌,
హైదరాబాద్‌.