షుగర్‌ ఉంటే... ఇది తినండి!

22-12-2017: మా అమ్మగారికి 55 ఏళ్ళు. పరగడుపున, అలాగే ఏదైనా తిన్న తరువాత... రెండుసార్లూ షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. పాదాలు నొప్పిగా ఉన్నాయి. పెరిఫెరల్‌ న్యూరోపతీ ఉందన్నారు డాక్టర్స్‌. దాంతో పాటు రక్తం తక్కువ ఉంది. బి-12 విటమిన్‌ తక్కువగా ఉంది. ఎలాంటి ఆహారం తీసుకుంటే నార్మల్‌గా ఉంటుందో చెప్పండి.

డయాబెటిస్‌ ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా జీవించాలంటే అతి ముఖ్యమైనది... గ్లూకోజ్‌ కంట్రోల్‌. గ్లూకోజ్‌ లెవల్స్‌ నార్మల్‌గా ఉంటేనే యితర కాంప్లికేషన్స్‌ రాకుండా చూసుకోవచ్చు. అందువల్ల మొట్టమొదటిగా మీ అమ్మగారి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. రోజూ కొంత వ్యాయామం కూడా అవసరం. తరువాత తగినట్లుగా మందులు వాడాలి. అలాగే, సమయానికి ఆహారం తీసుకోవడం మరీ ముఖ్యం.
 
న్యూరోపతీ తగ్గడానికి ప్రారంభంలో మందులు వాడాల్సి ఉంటుంది. ఆహరంలో లిపోయిక్‌ యాసిడ్‌ ఉన్న ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. పాలకూర, లివర్‌, ఆర్గాన్‌ మీట్స్‌, క్యారెట్లు, బంగాళా దుంప, టొమాటో, గ్రీన్‌ పీస్‌లో లిపోయిక్‌ యాసిడ్‌ ఉంటుంది. లిపోయిక్‌ యాసిడ్‌ ఇటు న్యూరోపతీని తగ్గించడమే కాక, కొలెస్ట్రాల్‌ నియంత్రణకు ఉపయోగపడుతుంది. ఇన్సులిన్‌ సెన్సిటివిటీని పెంచి, షుగర్‌ కంట్రోల్‌ను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. షుగర్‌ కంట్రోల్‌ అవ్వడానికి భోజనానికి ముందు వెజిటబుల్‌ సలాడ్‌ తినాలి. భోజనం అంటే... బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం మూడూ అని అర్థం. ఈ మూడు పూటలూ వెజిటబుల్‌ సలాడ్‌ తప్పనిసరి.

మధుమేహం ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా చేసుకొని తినాల్సిన వెజిటబుల్‌ సలాడ్‌

అర కప్పు కీరా ముక్కలు,
పావు కప్పు టొమాటో ముక్కలు
పావు కప్పు క్యారట్‌ ముక్కలు
కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పౌడర్‌
వెల్లుల్లి రెండు (సన్నగా తరిగినవి), చిటికెడు మెంతి పౌడర్‌, చిటికెడు అవిసె గింజల పౌడర్‌
 

తయారు చేసే విధానం

వీటన్నిటిని కలిపి ప్రతిసారీ భోజనానికి ముందు తీసుకుంటే గ్లూకోజ్‌ లెవల్స్‌ నార్మల్‌గా ఉంటాయి. విటమిన్‌ లోపం తగ్గుతుంది. మీ అమ్మగారు ప్రతి రోజూ ఈ విధంగా ఆహార నియమాలు పాటిస్తూ, బ్రేక్‌ఫాస్ట్‌ టైమ్‌లో ఒక పూర్తి గుడ్డు, బత్తాయిరసం తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది. అలాగే, వారానికి రెండు సార్లు నాన్‌వెజ్‌ తీసుకోవడం వల్ల బి-12 లోపం పోతుంది. కొంతకాలం ప్రోబయాటిక్‌ సప్లిమెంట్‌ తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది.

డాక్టర్‌ జానకి
న్యూట్రిషనిస్ట్‌
drjanakibadugu@gmail.com