మధుమేహ బాధితులకు శుభవార్త!

ఇన్సులిన్‌ విడుదల చేసే కృత్రిమ క్లోమం
ఐఐటీ ముంబాయి శాస్త్రవేత్తల ఘనత
 
ఆంధ్రజ్యోతి, 03-05-2018: దీర్ఘకాలిక వ్యాధుల్లో మధుమేహం చాలా సంక్లిష్టమైనది. క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ను ఉపయోగించకపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇన్సులిన్‌ను ప్రతి రోజూ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండే ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐఐటీ ముంబైకిచెందిన శాస్త్రవేత్తలూ చాలాకాలంగా పరిశోధనలు చేస్తూ కృత్రిమ క్లోమాన్ని తయారు చేశారు. దానితో ఎలుకలలో, పందుల్లో చేసిన పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ పరిశోధన వల్ల మధుమేహ నిర్వహణ పద్ధతుల్లో భారత్‌ మరో ముందడుగు వేసినట్లయింది.
 
ఐఐటీ ముంబైలోని కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ జయేష్‌ బిలేర్‌, ఆయన బృందం 2008 నుంచి కృత్రిమ క్లోమాన్ని తయారుచేయటానికి పరిశోధనలు చేస్తున్నారు. రకరకాల పదార్థాలపై ప్రయోగాలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం ఫైబర్‌ను రూపొందించి దాని ద్వారా కృత్రిమ క్లోమాన్ని అభివృద్ధి చేశారు. ‘కృత్రిమ క్లోమాన్ని తయారుచేయటానికి అవసరమైన ఫైబర్‌ను ఎంపిక చేయటానికే ఎక్కువ సమయం పట్టింది. ఎందుకంటే ఈ ఫైబర్‌ తనతంత తాను అభివృద్ధి చెందేలా ఉండాలి. చుట్టూ ఉన్న కణజాలానికి హాని చేయకూడదు. అదే సమయంలో నిర్దేశించిన మోతాదులో ఇన్సులిన్‌ను విడుదల చేయాలి’ అంటారు ప్రొఫెసర్‌ జయేష్‌. వారు రూపొందించిన కృత్రిమ క్లోమం ఒక మిల్లీమీటర్‌ వైశాల్యం ఉండి.. ట్యూబ్‌ ఆకారంలో ఉంటుంది. ‘మన కడుపులోపలి పొరలు చిరిగిపోకుండా ఉండటానికి కొన్ని రకాల ద్రవాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ ద్రవాలున్న ప్రాంతంలో కీహోల్‌ సర్జరీ ద్వారా కృత్రిమ క్లోమాన్ని అమరుస్తాము’’ అని జయేష్‌ వివరించారు. ‘మానవ శరీరం కానీ మరే ఇతర జంతువుల శరీరం కానీ కృత్రిమ అవయవాలను అంత త్వరగా తమలో ఇముడ్చుకోవు. ఏదైనా కృత్రిమ అవయవాన్ని అమరిస్తే- మన శరీరంలోని తెల్ల రక్తకణాలు వాటిపై దాడి చేస్తాయి. దీని వల్ల కృత్రిమ అవయవాల సామర్థ్యం తగ్గిపోతుంది. మేము తొలి సారి ఈ పరికరాన్ని మధుమేహం ఉన్న ఎలుకలలో అమర్చి చూశాము. 30 రోజుల తర్వాత కూడా ఆ ఎలుకలలో ఎటువంటి సమస్యలూ రాలేదు. అంటే వాటిలో రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నట్లే. అంతేకాక ఈ కృత్రిమ అవయవం చుట్టూ రక్తనాళాల ఎదుగుదలలో కూడా ఎటువంటి సమస్యలూ ఏర్పడలేదు’ అని జయేష్‌ తమ పరిశోధనా పద్ధతులను వివరించారు. దీనిని తర్వాత పందులపై కూడా పరీక్షించి చూశారు. ఈ ప్రయోగాలు కూడా విజయవంతం కావడంతో మనుషులపై పరీక్షించాలని యోచిస్తున్నారు. ‘మనుషులలో దీనిని అమరిస్తే వచ్చే రకరకాల సమస్యలను అధ్యయనం చేస్తున్నాం. వీటన్నింటిపైన పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మానవ శరీరంలో ఇమిడే కృత్రిమ క్లోమాన్ని రూపొందిస్తాం’’ అని ఆయన వెల్లడించారు.
 
కడుపులో అమర్చే తొలి కృత్రిమ క్లోమం
ఇప్పటి దాకా కడుపు లోపల ప్రవేశపెట్టే కృత్రిమ క్లోమాన్ని ఎవరూ తయారుచేయలేదు. ఇటీవలే అమెరికాకు చెందిన ఒక కంపెనీ తాము కృత్రిమ క్లోమం రీతిలో పనిచేసే ఒక పరికరాన్ని 2019లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ దానికి సంబంధించిన ట్యూబ్‌ను శరీరం లోపల అమరుస్తారు. పరికరం మాత్రం శరీరం బయటే ఉంటుంది.