వెన్న తింటే మధుమేహం

బోస్టన్‌, ఫిబ్రవరి 17: ప్రతిరోజూ వెన్న తింటే టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. తక్కువలో తక్కువగా 12 గ్రాములు తిన్నా ఈ ముప్పు తప్పట్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వెన్నలోని ఫ్యాటీ యాసిడ్లే దీనికి కారణమని అన్నారు. ఈమేరకు హార్వర్డ్‌ టీ హెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు సుమారు 3.4 వేల మందిపై జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా.. వలంటీర్లకు రోజూవారీ ఆహారంలో 12 గ్రాముల వెన్న అందించారు. అనంతరం జరిపిన విశ్లేషణలో ఇలా నాలుగేళ్ల పాటు తింటే మధుమేహ ముప్పు రెండు రెట్లు పెరుగుతుందని తేలిందని చెప్పారు. కాగా, వెన్నతో పోలిస్తే యోగర్ట్‌(పెరుగు) తీసుకోవడంవల్ల మధుమేహం వచ్చే ముప్పు తక్కువని వారు వివరించారు.