కీటోన్ డ్రింక్‌తో అదుపులో మధుమేహం!

ఇన్సులిన్, మెడిసిన్ తగ్గించే దిశగా పరీక్షలు

16-02-2018: మధుమేహంతో బాధపడుతున్నారా? షుగర్ వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారా? అలాంటివారికి ఒక శుభవార్త చెబుతున్నారు పరిశోధకులు. కీటోన్ పానియాలు, చక్కెర వ్యాధిని నియంత్రణలో పెడతాయని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, కెనడాకు చెందిన బ్రిటిష్ కొలంబియా వర్సిటీ ప్రతినిధులు సంయుక్తంగా చేసిన పరిశోధనలో వెల్లడైంది. వీటి వివరాలను జర్నల్ ఆఫ్ ఫిజియాలజీలో ప్రచురించారు. ప్రస్తుతం వారి పరిశోధనలన్నీ ఆరోగ్యంగా ఉన్నవారిపై మాత్రమే చేశారు. కీటోన్ డ్రింక్స్ తాగిన వారికి బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడంతోపాటు మధుమేహ నియంత్రణ కూడా సాధ్యమైందని చెబుతున్నారు. 10 గంటల ఉపవాసం తరువాత 20 మంది ఆరోగ్యవంతులకు రెండు సందర్భాలలో కీటోన్ మోనోఈస్టర్ ఇచ్చారు. ఓరల్ గ్లూకోజ్ పరీక్ష కోసం 30 నిమిషాల తర్వాత 75 గ్రాముల చెక్కెర కలిగిన పానీయం తాగించారు. ప్రతీ పావుగంట, అరగంటకు రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. కీటోన్ డ్రింగ్ తాగిన రోజున వారి రక్తంలో చక్కెర స్థాయి తక్కువగానే ఉందని గుర్తించారు. రానున్న రోజుల్లో ఇన్సులిన్ చేసుకోకుండా, మందుల బారి నుంచి రోగులను రక్షించేందుకు తమ పరిశోధనలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్లు వర్సిటీ ప్రతినిధి జొనాథన్ లిటిల్ తెలిపారు. అయితే టైప్ టు మధుమేహం, ఒబెసిటీలతో బాధపడేవారిపై కీటోన్ డ్రింక్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మరిన్ని పరీక్షలు అవసరమని చెప్పారు.