ఆసియా మధుమేహుల్లో కేన్సర్‌ మరణాలు హెచ్చు

 

న్యూయార్క్‌, మార్చి 8: ఆసియాలో టైప్‌-2 మధుమేహంతో బాధపడుతున్న వారు కేన్సర్‌ కారణంగా మరణించే ముప్పు అధికమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆసియన్ల శరీర బరువు సూచీ (బీఎంఐ) ఎంత ఉన్నా సరే... వీరిలో ఇన్సులిన్‌ నిరోధకత పెరిగే అవకాశం యూరోపియన్ల కన్నా చాలా ఎక్కువని గతంలో కొన్ని ఆధ్యయనాలు వెల్లడించాయి. దీని కారణంగానే ఆసియా దేశాల్లోని ప్రజలు ఎక్కువగా మధుమేహం బారిన పడుతున్నట్లుగా అవి పేర్కొన్నాయి. ఈ ఫలితాలను మరింత లోతుగా పరిశీలించేందుకు అమెరికాలోని న్యూయార్క్‌ యూనివర్సిటీ పరిశోధకులు భారత, చైనా, బంగ్లాదేశ్‌, జపాన్‌ సహా 19 ఆసియా దేశాల్లో దాదాపు 7.7 లక్షల మందిపై అధ్యయనం చేశారు. 12.7 ఏళ్ల పాటు జరిగిన అధ్యయనం కొనసాగింది. ఈ సమయంలో అధ్యయనంలో పాల్గొన్న వారిలో 37,343 మంది కేన్సర్‌తో మరణించారు. వయసు, బీఎంఐ, మద్యపానం, ధూమపానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోగా.. టైప్‌-2 మధుమేహంతో బాధపడుతున్న వారిలో 26 రెట్లు ఎక్కువగా కేన్సర్‌ మరణాలు కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆసియా దేశాల్లో మధుమేహుల్లో అధిక కేన్సర్‌ మరణాలు కనిపించగా.. పాశ్చాత్య దేశాల్లో కాలేయ, థైరాయిడ్‌, మూత్రపిండ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు కేన్సర్‌తో ఎక్కువగా మరణిస్తున్నారని పేర్కొన్నారు.