దంతాల ఆరోగ్యం వెనుక

ఆంధ్రజ్యోతి, 12/09/2014: రాత్రి నిద్రకు ముందు పళ్లు తింటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయా? అన్ని మౌత్‌వాష్‌లు ఒకే రకంగా దంతాలను శుభ్రం చేస్తాయా? మనం గుడ్డిగా నమ్మి ఆచరించే ఇలాంటి దంతాల ఆరోగ్య సూత్రాలన్నీ ఒట్టి అపోహలే! వాస్తవాలేవో తెలుసుకుని ఆచరిద్దామా!
 
అపోహ : నిద్రకు ముందు పండు తింటే దంతాలు శుభ్రపడతాయి. 
వాస్తవం : పళ్లలో పోషకాలతోపాటు షుగర్‌ కూడా ఉంటుంది. కాబట్టి రాత్రి పడుకునేముందు పళ్లు తింటే బ్యాక్టీరియా మనుగడకు అవసరమైన షుగర్‌, ఎసిడిక్‌ వాతావరణాన్ని దంతాల్లో కల్పించినట్టవుతుంది. అలాగే షుగర్‌ కంటెంట్‌ వల్ల రాత్రిపూట దంతాలకు రక్షణనిచ్చే లాలాజలం ఉత్పత్తి కూడా తగ్గి దంతాల సమస్యలు వృద్ధిచెందే పరిస్థితి నెలకొంటుంది.

అపోహ : టూత్‌బ్రష్‌లు షేర్‌ చేసుకోవటం హానికరం కాదు. 
వాస్తవం : టూత్‌ బ్రష్‌లను షేర్‌ చేసుకోకూడదు. దంతాల మీద ఉండే బ్యాక్టీరియా పళ్లు తోముకున్నప్పుడు బ్రష్‌ను అంటుకుంటుకుని ఉండిపోతుంది. అదే బ్రష్‌ను ఇతరులు ఉపయోగిస్తే బ్యాక్టీరియా వారి దంతాల పైకి చేరి హాని కలిగిస్తుంది.
 
అపోహ : అన్ని మౌత్‌వాష్‌లూ ఒకేలా పనిచేస్తాయి. 
వాస్తవం : టూత్‌పేస్ట్‌ల్లోలాగే మౌత్‌వాష్‌ల్లోనూ పలురకాల ఫ్రబావాలు కలిగించే ఇంగ్రిడియంట్స్‌ ఉంటాయి. వీటిల్లోని కొన్ని ఇంగ్రిడియెంట్స్‌ అందరికీ సూటవ్వవు. నోరు పొడిగా ఉండి మౌత్‌ అల్సర్లతో బాధపడేవారు, సెన్సిటివ్‌ దంతాలు కలిగి ఉండేవారు ఆల్కహాల్‌ కలిగి ఉండే మౌత్‌వాష్‌లు వాడకూడదు.
 
అపోహ : దంతాలు శభ్రంగా ఉండాలంటే గట్టిగా తోమాలి. 
వాస్తవం : రోజుకి రెండుసార్లు, రెండు నిమిషాలపాటు మెత్తని బ్రిసిల్స్‌ ఉన్న టూత్‌ బ్రష్‌తో వలయాకారంలో సున్నితంగా రుద్దుతూ దంతాలను శుభ్రపరచాలి. ఇందుకోసం ఫ్లోరైడ్‌ ఉండే టూత్‌పేస్ట్‌ ఉపయోగించాలి. ఇంటర్‌డెంటల్‌ బ్రష్‌ లేదా ఫ్లాస్‌ సహాయంతో దంతాల మధ్య ఖాళీలను శుభ్రం చేయటం అవసరమే! దంతాలను బ్రష్‌తో గట్టిగా తోమటం వల్ల ఉపయోగం లేకపోగా ఎనామిల్‌ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి దంతాల శుభ్రత సున్నితంగా ఉండాలి.