దుర్వాసనను అరికడదాం

ఆంధ్రజ్యోతి(27-02-2017): మీ టూత్‌పేస్ట్‌లో ఎన్ని ఉన్నా.. నోరు దుర్వాసన వస్తోందా..! ఎవరికీ దగ్గరగా వెళ్లలేకపోతున్నారా! నోటిలో మూలమూలలో దాక్కున్న బ్యాక్టీరియా అందుకు కారణం కావచ్చు. ఆహారపు అలవాట్లు, హాబీలు కూడా ఒక్కోసారి నోటికి తాళం వేయొచ్చు. ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఇలా చేసి చూడండి. 

ప్రతి రోజూ ఉదయం, రాత్రి రెండు పూటలా బ్రష్‌ చేసుకోవాలి.
టంగ్‌ క్లీనర్‌ తప్పనిసరిగా వాడాలి. నాలుకపై పేరుకుపోయిన పాచి నుంచే బ్యాక్టీరియా తయారై నోటి దుర్వాసన కారణమవుతుంది.
ఆహారం తీసుకున్న వెంటనే నోటిని శుభ్రం చేసుకోవాలి. పళ్ల మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాల్ని జాగ్రత్తగా తొలగించుకోవాలి.
ఎక్కువ సేపు మాట్లాడకుండా ఉంటే నోరు డ్రైగా అయిపోయి దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటప్పుడు తరచూ గుక్కెడు నీళ్లు తాగుతూ ఉండాలి. అప్పుడప్పుడు నీటిని పుక్కిలిస్తుండాలి.
దంతస్రావం వల్ల కూడా నోటి దుర్వాసన తలెత్తుతుంది. దంతాలు ఇన్‌ఫెక్షన్లకు గురైతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. లేనిపక్షంలో బ్యాక్టీరియా గొంతులోకి, ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంది.
మద్యపానం, ధూమపానం దంతక్షయానికి కారణం అవుతాయి. చిగుళ్లు బలహీనపడటం వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. అందుకే ఈ దురలవాట్లకు దూరంగా ఉండాలి.
టీ, కాఫీలు అతిగా సేవించడం వల్ల కూడా ఈ ఇబ్బంది తలెత్తుతుంది.
దంతాల పటుత్వంతోనే నోటి దుర్వాసనను అరికట్ట వచ్చు. పోషకాహారం తీసుకోవాలి. డైట్‌లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆరునెలలకు ఒకసారి దంత వైద్యుడ్ని సంప్రదించడం మరచిపోవద్దు.