ఈ జ్వరాలకు మందు.. ఇంట్లోనే చేసుకోవచ్చు

ఆంధ్రజ్యోతి (10-09-2019): ఒళ్లు కాలిపోయేంత జ్వరం! భరించలేని కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు! ఇంతలా బాధించే డెంగ్యూ, చికున్‌గున్యాలకు ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో అద్భుతమైన నివారణ చికిత్సలు ఉన్నాయి!

 
ఇంట్లోనే చేసుకోవచ్చు...
ఈ జ్వరం బారిన పడితే, జీర్ణాశయం పాడైపోతుంది. ఫలితంగా శరీరంలో ఆమం పెరుగుతుంది. ఇది రక్తంలో, కీళ్లల్లో, శరీరంలోని సమస్త కణజాలంలో పేరుకుపోతుంది. దాని ఫలితమే జ్వరం, ఒంటి నొప్పులు. సాధారణ జ్వరానికీ, డెంగీ జ్వరానికీ మధ్య లక్షణాల పరంగా పెద్ద తేడాలేవీ ఉండవు. సునిశితంగా గమనిస్తే తప్ప ఆ తేడా బోధపడదు. ఆ తేడాలు తెలియకపోతే అది డెంగీ జర్వమని గానీ, దానికి సంబంధిత ప్రత్యేక చికిత్సలు అవసరమని గానీ గుర్తించలేకపోయే ప్రమాదం ఉంది.
 
డెంగీ లక్షణాలు
తలనొప్పితో పాటు కళ్లు లాగడం, కళ్లనొప్పి ఉంటాయి. వీటితో పాటు ఒంటి నొప్పులు, కండరాల నొప్పులు, ఎముకలు విరిచేస్తున్న నొప్పి కూడా ఉంటాయి.
 వాంతులు కావడం లేదా వికారం ఉంటాయి.
చర్మం మీద అక్కడక్కడా దద్దుర్లలా కాకుండా శరీరంలో అత్యధిక భాగం ఎర్రబారుతుంది. మౌలికంగా డెంగీ బాధితుల్లో కనిపించే లక్షణాలు ఈ మూడే. అయితే, అందరిలోనూ మొత్తం మూడూ కాకపోయినా వీటిలోని ఏ రెండు లక్షణాలైనా తప్పనిసరిగా ఉంటాయి. ఈ లక్ష ణాలతో పాటు చర్మాన్ని ఎక్కడైనా నొక్కితే అప్పటిదాకా ఎర్రగా ఉన్న చర్మం కాసేపు తెల్లగా కనిపిస్తుంది. డెంగీ వైరస్‌ ఎముక మజ్జను దెబ్బ తీయడం వల్ల క్రమ క్రమంగా రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. ఫలితంగా గడ్డకట్టే సహజ లక్షణాన్ని రక్తం కోల్పోతుంది. అందుకే ఒక దశలో రక్తస్రావం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. డెంగీలో కనిపించే ఒంటి నొప్పులు, తలనొప్పి, వాంతులు అనేవి వాత లక్షణాలు. చర్మం ఎర్రబారడం అనేది పిత్త లక్షణం. ఈ రెండు లక్షణాలూ ఉండడం వల్ల ఆయుర్వేదం డెంగీని ‘వాతపిత్త జ్వరం’గా పిలుస్తారు.
డెంగీని ఎదుర్కోండిలా...
 
చికిత్స సులువే!
శరీరం అస్వస్థతకు గురికావడానికి కారణమైన ఆమాన్ని తొలగించడం చాలా ముఖ్యం. ఆమం తగ్గితేనే నొప్పి తగ్గుతుంది. అయితే, ఆమం సమస్త కణజాలాన్ని పట్టుకుని ఉంటుంది కాబట్టి దాన్ని వేరు చేసి బయటికి పంపడం కష్టం. అందువల్ల దాన్ని దహించడం ద్వారా మాత్రమే దాన్ని హరించగలం. శొంఠి, తిప్పతీగ (గుడూచి), పిప్పళ్లు, తుంగ ముస్తలు ఇవన్నీ ఆమాన్ని హరించే ఔషధ అంశాలు. ఇవి కాకుండా అమృతాది గుగ్గుళ్లు. ముస్తకారిష్టం వంటివి ముఖ్యమైనవి. కాకపోతే, ఆమం ఏ స్థాయిలో ఉంది, కణజాలంలో ఏ మేరకు వాపు ఉంది? ఏ మందులు ఇవ్వాలి అనేది ఆయుర్వేద వైద్యులు నిర్ణయిస్తారు.
 
వ్యాధినిరోధకశక్తి పెంచుకోవడం కోసం గుడూచి (తిప్ప తీగ) మాత్రలు బాగా ఉపయోగపడతాయి. వాటిని ఉదయం ఒకటి, రాత్రికి ఒకటి తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. డెంగీ, చికున్‌గున్యాల సమస్య ఏదీ లేనప్పుడు మామూలుగా ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకుంటే రోజుకు ఒక మాత్ర వేసుకున్నా చాలు. జీర్ణశక్తి బాగా ఉన్నవాళ్లయితే, రోజుకు ఒక స్పూన్‌ చవన్‌ప్రాశ్‌ తీసుకున్నా సరిపోతుంది.
 
డెంగీని వదిలించే కషాయాలు!
ఇమ్మూనిటీ పెంచడంతో పాటు యాంటీ వైరల్‌గా పనిచేసే కొన్ని కషాయాలను మనం ఇంట్లోనే తయారుచేసుకుని అన్ని వయసుల వారూ సేవించవచ్చు.
 
అందుకు.... సుమారుగా గుప్పెడు తులసి ఆకులు, గుప్పెడు తమలపాకులు, గుప్పెడు వాము ఆకులు (దొరకకపోయినా ఫరవాలేదు) మరీ లేతవీ, మరీ ముదురువీ కాకుండా అర గుప్పెడు వేప ఆకులు వీటన్నింటినీ తుంచేసి, అందులో మూడు వెల్లుల్లి పాయలు, అర స్పూన్‌ మిరియాలు, పావు స్పూన్‌ అతి మధురంతో పాటు 400 మి. లీటర్ల నీళ్లలో వేసి 150 మి.లీ నుంచి 200 మి.లీ. అయ్యేదాకా మరిగించాలి. ఈ కషాయాన్ని వడగట్టి ఈ ద్రావణాన్ని నాలుగు భాగాలు చేసి, రోజుకు సుమారు అరకప్పు నాలుగు పూటలా తాగాలి. కుదురకపోతే, కనీసం మూడు పూటలైనా తాగాలి. అవసరమనుకుంటే అందులో కొంత బెల్లం కలుపుకోవచ్చు. చిన్న పిల్లలకైతే ఐదారు చుక్కలు తాగించినా చాలు. ఇలా చేస్తే యాంటీ వైరల్‌గానూ పనిచేస్తుంది. జ్వరాన్నీ, ఒంటినొప్పులనూ తగ్గిస్తుంది.
 
ప్లేట్‌లెట్లు పడిపోతే?
బొప్పాయి లేత ఆకుల గుజ్జు డెంగీ నివారణకు బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయి లేత ఆకులను నూరి ముద్దలా చేసి, ఒక స్పూన్‌ ముద్ద ఉదయం, ఒక స్పూన్‌ సాయంత్రం తీసుకుంటే రెండు రోజుల్లో ప్లేట్‌లెట్ల పెరుగుదల కనిపిస్తుంది.
 
ఒక్క రోజులోనే అదుపులోకి...
పగటి వేళ కుట్టే దోమతో డెంగీ సోకుతుంది. కండరాల నొప్పులు, కీళ్లనొప్పులతో పాటు ఎముకలు విరిగిపోతున్నట్లు నొప్పి ఉంటుంది. ప్లేట్‌లెట్లు పడిపోవడంతో చర్మం అడుగున రక్తస్రావం అవుతుంది. పంటి చిగుళ్ల్లలో నుంచి, శ్వాసకోశాల్లో కూడా రక్తస్రావం కావచ్చు. వైద్య చికిత్సలేవీ తీసుకోకపోతే ఒక్కోసారి ప్లేట్‌లెట్లు బాగా పడిపోయి, ప్రాణహాని ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే హోమియోపతి మందులతో డెంగీ సమస్య ఒక్క రోజులోనే అదుపులోకి వస్తుంది. 3 నుంచి 5 రోజుల్లో రోగి నూటికి నూరు శాతం డెంగీ నుంచి బయటపడతాడు.
 
హోమియో వైద్య చికిత్సగా.....
తీవ్రమైన ఒంటి నొప్పులు, భరించరాని బాధతో అటూ ఇటూ దొర్లుతూ ఉంటే, ‘రూస్టాక్స్‌ - 200’ మందు వేయవచ్చు. దీనితో చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.
ఎముకలు విరిగిపోతున్నట్లు ఉంటే ‘ఇపటోరియం పర్ఫ్‌ - 200’ అనే మందును వేయవచ్చు.
లోలోపల రక్తస్రావం అవుతూ, ప్లేట్‌లెట్లు పడిపోతున్నప్పుడు ‘ఆర్నికా - 200’, ‘ఫాస్ఫరస్‌ - 200’ మందులను ఇస్తే రక్తస్రావం ఆగిపోవడంతో పాటు ప్లేట్‌లెట్స్‌ పెరగడం మొదలవుతుంది. అయితే ఈ మందును హోమియో వైద్యుని పర్యవేక్షణలోనే తీసుకోవడం మేలు. ఎందుకంటే సమస్య తీవ్రతను అనుసరించి వారు మందుల మోతాదును సూచిస్తారు.
-డాక్టర్‌ జి. జనార్థన్‌రెడ్డి

రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ హోమియో కళాశాల, హైదరాబాద్‌

 

చికున్‌గున్యాకు చెక్‌
 
ఆయుర్వేదంలో...
కీళ్లనొప్పులుతో, ఒళ్లు నొప్పులతో చికున్‌గున్యా నిలువెల్లా ఛిద్రం చేస్తుంది. భరించరాని నొప్పులకు మారుపేరుగా నిలిచే ఈ వ్యాధి అదే పేరుగల వైరస్‌ సోకడం ద్వారా సంక్రమించే సమస్య.
 
ఎందుకొస్తుంది?
ఎక్కువగా 50 ఏళ్లకు పైబడిన వారిలో, వ్యాఽధి నిరోధక శక్తి తగ్గిపోయిన వారిలోనే చికున్‌గున్యా వైరస్‌ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. జీర్ణశక్తి లోపించినవారిలో, జీవ క్రియలు కుంటుపడిన వారిలోనే ఈ వైరస్‌ తీవ్రత కనిపిస్తుంది.
 
ఏం తినాలి?
జ్వరంతో పాటు జీర్ణక్రియ మందగించడంతో ఆహార పదార్థాలు, ‘ఆమవిషం’ గా మారతాయి. ఈ స్థితిలో జీర్ణవ్యవస్థ పైన మరింత భారం పడకుండా, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి.

ద్రవాహారమైతే మరీ మేలు. ముఖ్యంగా జావ, అంబలి, పండ్లు, పండ్ల రసాలు, పలుచని పాలు, మజ్జిగ, పలుచని పప్పు, ఉడికించిన కూరగాయల రసం, కొబ్బరి నీళ్లు, గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి.

గృహ వైద్యం!
ధనియాలు లేదా శొంఠి కషాయాన్ని అరకప్పు మోతాదులో రోజుకు నాలుగు సార్లు సేవిస్తే, జ్వరంతో పాటు నొప్పులూ తగ్గుతాయి.
శొంఠి కషాయంలో ఒక చెంచా ఆముదం కలిపి తీసుకుంటే, నొప్పులు తగ్గడంతో పాటు పేగులు శుభ్రపడి జీర్ణశక్తి పెరుగుతుంది.
తిప్పతీగ రసం గానీ, కషాయం గానీ తాగితే జ్వరం తగ్గడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఉసిరి, నిమ్మరసాలను నిత్యం తాగాలి. వీటితో పాటు నీళ్లు కలపకుండా తీసిన తిప్పతీగ రసం, రోజూ ఒక స్పూను చొప్పున పరగడుపున తీసుకోవాలి.
ఒక కప్పు పాలు, 8 కప్పుల నీళ్లు కలిసిన ద్రావణంలో 5 గ్రాముల వెల్లుల్లిపాయల గుజ్జును కలిపి మరిగించాలి. కప్పు పాలు మాత్రమే మిగిలేదాకా మరిగించి ఆ తర్వాత చల్లార్చి పరగడుపున రోజుకోసారి తాగాలి.

బొప్పాయి ఆకు రసాన్ని ఒక స్పూను తేనెతో కలిపి సేవిస్తే రోగనిరోధానికీ, వ్యాధినిరోధకశక్తికీ తోడ్పడుతుంది.

చికిత్సా విధానం!
ఆకలిని సంరక్షించడం, శరీరంలోని ఆమ్ల, విష ఘటకాలను (ధాతుగత అమం) నిర్వీర్యం చేయడం, నొప్పులు, జ్వరానికి ఉపశమన మందులు వాడటం, రోగ నిరోధకంగా పని చేసే రసాయన మందులను శక్తికారక మందులను ఇవ్వడం ద్వారా చికున్‌గున్యాను తగ్గించే వీలుంది.
 
-డాక్టర్ డి. ప్రశాంత్ కుమార్ 
ఆయుర్వేద వైద్య నిపుణులు
గురు ఆయుర్వేద క్లినిక్, హైదరాబాద్
 

హోమియోలో...
చికున్‌గున్యా వైరస్‌ వల్ల కీళ్లనొప్పులతో పాటు జ్వరం, తలనొప్పి ఉంటాయి. ఈ సమస్యలు కొద్ది రోజుల్లోనే తగ్గినా, కీళ్ల నొప్పులు మాత్రం కొందరిలో 6 నుంచి 18 మాసాల పాటు కొనసాగుతూనే ఉంటాయి.
 
చికిత్స ఇదే!
వైరస్‌ సోకిన తొలిదశలో తీవ్ర మైన జ్వరం, భరించరాని తలనొప్పి, కీళ్లనొప్పులు, చర్మమంతా దద్దుర్ల వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలా కనిపించగానే, హోమియో వైద్యులు ‘బెల్లడోనా-200’ మందు ఇస్తారు. జ్వరం కాస్త తగ్గగానే ‘ఇపటోరియం- పర్ఫోలియేటం’ అనే మందు సూచిస్తారు. రోజుకు రెండు సార్ల చొప్పున నాలుగు రోజుల పాటు వేసుకుంటే చికున్‌గున్యా లక్షణాలు బాగా తగ్గుతాయి. ఆ తర్వాత ‘రూస్టాక్స్‌-200’ మందు ఇవ్వడంతో అన్ని రకాలుగా ఉపశమనం లభిస్తుంది. కొంత మందికి సమస్య తగ్గినట్లే తగ్గి వారానికి ఒకసారో, నెలకొకసారో మళ్లీ మళ్లీ కీళ్లనొప్పులు వస్తుంటాయి. అలాంటి వారికి ‘జెల్సీమియం -200’ మందు ఇస్తారు. దీన్ని రోజుకు 3 సార్ల చొప్పున రెండు మూడు రోజుల పాటు వేసుకుంటే తిరిగి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.
 
అంతకాలం ఎందుకు?
చికున్‌గున్యా తాలూకు కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు కొందరిలో ఎక్కువ కాలం కొనసాగడానికి, ఆ వైరస్‌ విడుదల చేసే విషం అంత తీవ్రమైనది కావడం ఒక ప్రధాన కారణం. దీనికి తోడు వ్యక్తుల్లో వ్యాధినిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడం కూడా కారణమే. అల్లోపతితో పోలిస్తే ఎలాంటి దుష్ప్రభావాలేవీ లేకుండా ఈ నొప్పులను తగ్గించే మందులు హోమియోలో ఉన్నాయి.
 
ఏ వ్యాధైనా తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ వస్తోందీ అంటే, వారిలో వ్యాధినిరోధక శక్తి బాగా తగ్గిపోయిందని అర్థం. ‘ట్యుబర్‌కులమ్‌’ అనే మందును అప్పుడప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది.

నిరంతరమైన మానసిక ఒత్తిళ్ల వల్ల సహజంగానే, మెదడు నుంచి వచ్చే ఆదేశాలేవీ శరీర భాగాలకు అందవు. దీనివల్ల జీవక్రియలు కుంటుపడి ఇది కూడా వ్యాధినిరోధక శక్తి తగ్గడానికి కారణమవుతుంది. దీనికి నివారణగా అర్జెంటమ్‌ నైట్రికమ్‌, నేట్రమ్‌ మూర్‌, ఇగ్నీషియా వంటి మందులు ఉపయోగపడతాయి. ఈ తరహా హోమియో చికిత్సల వల్ల చికున్‌గున్యా తాలూకు బాధలు మూడు నాలుగు వారాల్లోనే సమూలంగా తగ్గిపోతాయి.

ఈ వైరస్‌ బారిన పడకుండా, ‘ఇపటోరియం పర్‌ఫోలియేటం - 200’ మందును ఒక రోజు మూడు పూటలా వేస్తే సరిపోతుంది. అయితే, ఒకవేళ ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ఈ వైరస్‌ బారిన పడుతూ ఉంటే, ఓ వారం తర్వాత మళ్లీ ఒక రోజు మూడు పూటలా వేసుకోవాలి. ఆ తర్వాత వారానికి ‘ట్యుబర్‌కులమ్‌-200’ మందును ఒక డోసు వేసుకుంటే చాలు. చికున్‌గున్యా వైరస్‌ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చు.