బెర్లిన్, ఫిబ్రవరి 16: మలేరియా బారిన పడకుండా నూటికి నూరు శాతం అడ్డుకునే సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను జర్మనీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. సనారియా పీఎఫ్ఎస్ పీజేడ్-సీవీ గా వ్యవహరించే ఈ వ్యాక్సిన్‌పై జరిపిన క్లినికల్ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైందని వారు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు మలేరియా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించడంలేదని యూనివర్సిటీ ఆఫ్ టూబింజెన్ పరిశోధకులు పేర్కొన్నారు. రోగకారక క్రిమిలోని సూక్ష్మకణాలపై ఆధారపడి పనిచేయడంవల్ల ఇవి వంద శాతం ఫలితాన్నివ్వడంలో విఫలమవుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ల ప్రభావాన్ని మరింత మెరుగు పరిచే దిశగా చేసిన కృషి ఫలితమే ఈ తాజా వ్యాక్సిన్ అని చెప్పారు.
దీని తయారీలో సనారియా బయోటెక్ కంపెనీ సహకారం తీసుకున్నట్లు తెలిపారు. మలేరియా రోగ కారక క్రిములను కాలేయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం ద్వారా వ్యాధి రాకను నిరోధించవచ్చని ప్రొఫెసర్ పీటర్ క్రెమ్సనర్ వివరించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సనారియా వ్యాక్సిన్‌ను తయారుచేశామని ఆయన చెప్పారు. కాగా, ఈ వ్యాక్సిన్‌ను 67 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు పీటర్ వివరించారు.