స్త్రీలలో జ్ఞాపక శక్తి ఎక్కువే!

ఆంధ్రజ్యోతి,28-3-2017: స్త్రీల కన్నా పురుషులు తెలివి కలవారనీ, జ్ఞాపకశక్తి ఎక్కువ కలిగి ఉంటారన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే ఇది తప్పు అని అంటున్నారు పరిశోధకులు. వాస్తవానికి స్త్రీలలోనే జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందన్న విషయం ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. మెనోపాజ్‌ దశలో ఉన్న స్త్రీలలో కొంత జ్ఞాపకశక్తి మందగించినా, పురుషులతో పోలిస్తే అది వారిలో మెరుగ్గా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు గానూ 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కల స్త్రీ పురుషుల జ్ఞాపకశక్తిని పరిశీలించారు. స్త్రీలలో కొందరు మెనోపాజ్‌ దశకు చేరుకున్నవారు ఉన్నారు. ఆ దశలో సహజంగా కలిగే మతిమరుపు వారిలో కనపడినా, కొత్త విషయాలు నేర్చుకోవడానికీ, నేర్చుకున్న విషయాలు గుర్తు పెట్టుకోవడానికీ ఉత్సాహం చూపడాన్ని పరిశోధకులు గుర్తించారు. పురుషులలో కొందరు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ కొత్త విషయాలు నేర్చుకోవడానికీ, నేర్చుకున్న వాటిని గుర్తు పెట్టుకునే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదు. కొన్ని రోజుల అనంతరం వీరికి పరీక్ష పెట్టగా విషయ గ్రహణలో స్త్రీలే ముందు నిలిచారు. చదువులలో ఆడపిల్లలు ముందుండడానికి కూడా వారిలో ఉండే జ్ఞాపకశక్తే కారణమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.