మంచి భార్యలం...అమ్మలం కూడా!

ఆంధ్రజ్యోతి, 11-07-2017: కెరీర్‌ మైండెడ్‌ అమ్మాయిలు మంచి భార్యలుగానే కాదు మంచి తల్లులుగా కూడా ఉంటారట. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆన్‌లైన్‌ మ్యాచ్‌ మేకింగ్‌ బ్రాండ్‌ ఈ సర్వేని నిర్వహించింది. కెరీర్‌ ఓరియంటెడ్‌ గర్ల్స్‌ సమస్యలపై ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో 1100 మంది స్పందించారు. ఇందులో తేలిందేమిటంటే ఉద్యోగాలు చేస్తున్నంత మాత్రాన కుటుంబంపై దృష్టి పెట్టలేమన్నది సరికాదని చాలామంది అమ్మాయిలు అభిప్రాయపడ్డారు. కెరీర్‌ విమెన్‌ మంచి భార్యలుగానే కాదు మంచి తల్లులుగా కూడా ఉండగలరన్నారు. ఈ సర్వేలో వారెదుర్కొంటున్న కొన్ని సమస్యలను కూడా అమ్మాయిలు తెలిపారు. తమ కెరీర్‌ను అర్థంచేసుకుని తోడుగా నిలిచే సహచరుడు దొరకడం కష్టమవుతోందని చాలమంది అభిప్రాయపడ్డారు. అంతేకాదు అత్తమామల సహకారం అపురూమవుతోందన్నారు. వ్యక్తిగతమైన, ఉద్యోగ పరమైన బాధ్యతల నిర్వహణలో సమతుల్యతను సాధించడం సవాలుగా నిలుస్తోందన్నారు. తమకున్న సామాజిక స్పృహతో పిల్లలను, ఇంటిని నడపడం కష్టంగా భావించడం లేదని చెప్పారు. పిల్లలు స్వతంత్రంగా వ్యవహరించేలా పెంచడంతోపాటు వారి కెరీర్‌, చదువుకు సంబంధించిన నిర్ణయాల్లో సహాయపడుతున్నామన్నారు. పెళ్లి తర్వాత కొంతమంది మహిళలు తమ కెరీర్‌ను వదులుకున్నట్టు కూడా చెప్పారు. కానీ ఎక్కువమంది అమ్మాయిలు కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు ఆర్థికంగా భర్తపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నారుట. అమ్మాయిలు కెరీర్‌కు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం ద్వారా సర్వతంత్ర స్వతంత్రంగా బతకాలని కోరుకుంటున్నారు. ఆత్మవిశ్వాసంతో నిలవాలని ఆశిస్తున్నారు. మొత్తానికి ఈ సర్వే కెరీర్‌ విమెన్‌ అమ్మలుగా, భార్యలుగా కూడా బెస్ట్‌గా ఉంటారని తేల్చింది.