మూడు నుంచి ఆరు దాకా!...గర్భిణుల ఆరోగ్యం

గర్భిణిగా అతి కీలక దశ... అత్యంత అనుకూలమైన దశ... మూడో నెల నుంచి ఆరో నెల దాకా! కడుపులో బిడ్డ... పెరుగుతూ, కదిలే... ఆ మూడు నెలల్లో...ఏం చేయాలి? ఎలా ఉండాలి? అనే అంశాల సమాహారమే ఈ కథనం..

 
పిగ్మెంటేషన్‌
గర్భిణుల చర్మం సున్నితంగా మారుతుంది. దాంతో సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగా ఉండి చెక్కిళ్ల మీద సీతాకోకచిలుక ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. ఇవి ప్రసవం తర్వాత పోవచ్చు లేదా అలాగే కొన్నేళ్లపాటు ఉండిపోవచ్చు. కాబట్టి ఈ మచ్చలు రాకుండా చూసుకుంటే మేలు. ఇందుకోసం తప్పనిసరిగా గర్భిణులు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ వాడాల్సి ఉంటుంది. ఈ లోషన్‌ వాడటం వల్ల గర్భంలో ఉన్న బిడ్డకు ఎలాంటి ప్రమాదమూ ఉండదు.
 
మూడేసి నెలలతో కూడిన మూడు దశలుగా (ట్రైమెస్టర్‌) విభజిస్తే గర్భం రెండవ దశ, అంటే..సెకండ్‌ ట్రైమెస్టర్‌ గర్భిణులకు ఎంతో అనుకూలమైనది. 3వ నెల నుంచి 6వ నెల...గర్భిణిగా సంపూర్ణ సంతృప్తి పొందే దశ ఇది. మూడవ నెల వరకూ వేవిళ్లు వేధిస్తే, ఎనిమిదో నెల నుంచీ పెరిగిన పొట్టతో కదలికలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి ఇబ్బందులేవీ ఉండనిది రెండవ ట్రైమెస్టర్‌. కాబట్టి ఈ దశను గర్భిణులు మనసారా ఆస్వాదించాలంటే ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవీ లేకుండా చూసుకుంటూ, అర్థం లేని అపోహలకు దూరంగా ఉండాలి.
 
గర్భిణిలో వచ్చే మార్పులివే!
రెండవ ట్రైమెస్టర్‌లో గర్భిణుల్లో కొన్ని స్పష్టమైన మార్పులు మొదలవుతాయి. అవన్నీ సాధారణమైనవే! అవేంటంటే...
పొట్టలో కదలికలు మొదలవుతాయి.
రొమ్ములు పెద్దవి అవుతాయి.
చర్మం సాగటంతో చారికలుగా మొదలవుతాయి.

పొట్ట, రొమ్ముల పైన చర్మం దురద పెడుతూ ఉంటుంది.

చెక్కిళ్ల మీద నల్ల మచ్చలు (పిగ్మెంటేషన్‌) ఏర్పడతాయి.
రాత్రి వేళ కాళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. గర్భాశయం ఒత్తిడి రక్తనాళాలు, నాడుల మీద పడటం వల్ల ఈ ఇబ్బంది తలెత్తుతుంది.

కాలి గిలకలు, చేతులు, ముఖంలో కొంత వాపు కనిపిస్తుంది.

నడుము, పిరుదుల్లో నొప్పి, పొట్టలో ఏదో గుచ్చుకుంటున్నట్టు అనిపించటం కూడా ఈ దశలో సహజమే! గర్భాశయంలో ఉన్న బిడ్డ పరిమాణం పెరగటం వల్ల కలిగే మార్పులివి. గర్భాశయంతో సంబంధం ఉన్న లిగమెంట్స్‌ సాగటం వల్ల తలెత్తే నొప్పులివి. వీటికి భయపడాల్సిన పని లేదు.

కొంతమందికి దంతాలు వదులవుతాయి. బ్రష్‌ చేసుకునేటప్పుడు రక్తస్రావం కనిపిస్తుంది. ముక్కు నుంచి కూడా కొద్దిగా బ్లీడింగ్‌ కావొచ్చు. ఇదంతా ముఖంలో వచ్చే వాపు వల్ల కణజాలం లావై ఈ మార్పులు కనిపిస్తాయి.

గర్భాశయం వల్ల జీర్ణాశయంపై ఒత్తిడి పడి గుండెల్లో మంట (అసిడిటీ) రావొచ్చు.

కొందరికి ఐదు లేదా ఆరవ నెల చివర్లో లాగి వదిలినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. నొప్పి, బ్లీడింగ్‌ లేకుండా ఇలాంటి కదలికలు కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ముందు జరగబోయే ప్రసవానికి సన్నద్ధమయ్యే క్రమంలో గర్భాశయంలో చోటు చేసుకునే మార్పులివి.

ఈ సమస్యలను అలక్ష్యం చేయొద్దు!

గర్భస్రావం
మూడు నుంచి ఆరు నెలల గర్భం. ఈ దశలో గర్భస్రావం జరగటం చాలా అరుదు. అయినా ఒక్కోసారి అయ్యే అవకాశాలు ఉంటాయి.
అకారణంగా రక్తస్రావం అవుతున్నా, స్పాటింగ్‌తో మొదలై బ్లీడింగ్‌లా మారినా వెంటనే వైద్యుల్ని కలవాలి.
గర్భాశయం ఆకారం సరిగా లేకపోయినా, ప్లాసెంటా (మాయ) కిందకు జారినా బ్లీడింగ్‌ జరగొచ్చు.

విపరీతంగా యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి చికిత్స తీసుకోకపోయినా, మధుమేహాన్ని అదుపులో పెట్టుకోకపోయినా, మూత్ర పిండాల సమస్యలుండి చికిత్స తీసుకోకపోయినా గర్భస్రావం కావొచ్చు.

కవల పిల్లలతో గర్భం దాల్చిన గర్భిణులకు రెండవ ట్రైమెస్టర్‌ చాలా కీలకం. ఈ దశలో వీళ్ల గర్భాశయం తొమ్మిది నెలల గర్భం పరిమాణానికి చేరుకుంటుంది. దాంతో శరీరం ప్రసవానికి సమయం వచ్చిందనుకుని, అందుకు తగ్గట్టు స్పందించటం మూలంగా గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గర్భాశయ ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా గర్భస్రావం కావొచ్చు.

కొంతమందికి గర్భాశయ ముఖ ద్వారం వదులుగా ఉండి లేదా అంతకముందు ప్రసవ సమయంలో వేసిన కుట్ల వల్ల ఆ ప్రదేశం సాగినా గర్భస్రావం జరిగే అవకాశాలుంటాయి.

నెగిటివ్‌ బ్లడ్‌గ్రూప్‌: రక్త గ్రూపు పాజిటివ్‌ ఉండటమనేది సహజం. సాధారణంగా 90 శాతం మంది పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ కలిగి ఉంటారు. ఒకవేళ గర్భిణి నెగిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ కలిగి, గర్భంలో ఉన్న బిడ్డ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ అయి ఉంటే బిడ్డకు రియాక్షన్‌ రావొచ్చు. గర్భంలో ఉన్న బిడ్డ రక్త గ్రూపు తెలుసుకునే వీలుండదు కాబట్టి గర్భిణి నెగిటివ్‌ గ్రూపుకు చెందితే, శరీరంలో యాంటీబాడీలు తలెత్తకుండా ‘యాంటీ- డి’ ఇంజెక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో ఎప్పుడైనా రక్తమార్పిడి జరిగితే తల్లికీ, బిడ్డకూ ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి నెగిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌కు చెందిన గర్భిణులు ఆ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. లోపలి బిడ్డ కూడా నెగిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ అయితే ఫర్వాలేదు. అయినా గర్భిణికి ఇంజెక్షన్‌ ఇవ్వటం వల్ల గర్భంలోకి బిడ్డకు ఏ ప్రమాదమూ ఉండదు. కాబట్టి నిక్షేపంగా ఇంజెక్షన్‌ చేయించుకోవచ్చు.

ఉమ్మనీరు పోవటం: కొందరికి గర్భాశయ ఇన్‌ఫెక్షన్ల మూలంగా లేదా ప్రమాదవశాత్తూ పొట్ట ఒత్తుకుపోవటం వల్ల ఉమ్మనీరు కారిపోవచ్చు. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

ప్రిక్లాంప్సియా: గర్భం మూలంగా రక్తపోటు పెరిగే స్థితి ఇది. ఈ పరిస్థితి మొదటిసారి గర్భం దాల్చిన వారికి, ఆరవ నెలలో తలెత్తుతుంది. ఒళ్లు వాచిపోయి, తలనొప్పితో పాటు కళ్ల ముందు మెరుపులు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

జెస్టేషనల్‌ డయాబెటిస్‌

అప్పటిదాకా మధుమేహం లేకపోయినా తల్లితండ్రులు, తోబుట్టువులు మధుమేహులైతే గర్భిణులకు ఈ దశలో మధుమేహం వచ్చే వీలుంటుంది. కాబట్టి తప్పనిసరిగా పరీక్ష చేయుంచుకుని షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంచుకోవాలి.

వంశంలో ఎవరికీ మధుమేహం లేకపోయినా గర్భం దాల్చే సమయంలో అధిక బరువుతో బాధపడే మహిళలు, మొదటి ప్రసవంలో బిడ్డ నాలుగున్నర కిలోల కంటే ఎక్కువ బరువుతో పుట్టినా, ఆ గర్భిణులకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ.

విపరీతమైన దాహం ఉన్నా, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయవలసి వస్తున్నా, నోరు ఎండిపోవటం, అలసట, నీరసం ఉన్నా మధుమేహం లక్షణాలుగా భావించి చికిత్స మొదలుపెట్టాలి.

హైపో థైరాయిడిజం: ఇప్పుడు మన దేశంలో హైపోథైరాయిడిజం సర్వసాధారమైపోయింది. ఈ సమస్య ఉన్న గర్భిణులు ఈ హార్మోన్‌ మాత్రలు వేసుకోకపోతే, పుట్టిన బిడ్డ మానసిక, శరీరక ఎదుగుదల కుంటుపడే అవకాశాలు ఉంటాయి. ఈ పిల్లల ఐక్యులు కూడా తక్కువగా ఉంటాయి.

గర్భం దాల్చక ముందు నుంచే థైరాయిడ్‌ సమస్య ఉన్నవాళ్లు బిడ్డకు ప్రమాదమనుకుని ఆ మందులు ఆపేస్తూ ఉంటారు. ఇది మరింత ప్రమాదకరం.

నిజానికి గర్భం దాల్చిన తర్వాత శరీర బరువు పెరుగుతుంది కాబట్టి అంతకు ముందు వేసుకునే మందుల మోతాదు సరిపోదు. కాబట్టి వైద్యుల సలహా మేరకు మోతాదు పెంచి తీసుకోవలసి ఉంటుంది.

హైపోథైరాయిడిజం ఉన్న గర్భిణులు ప్రతి రెండు నెలలకొకసారి టిఎ్‌సహెచ్‌ పరీక్ష చేయించుకుని మందులు వాడుతూ ఉండాలి.

స్ట్రెచ్‌ మార్క్స్‌ను ఆపే వైద్యం లేదు
మూడవ నెల నుంచి పొట్ట పెద్దదవుతూ ఉంటుంది కాబట్టి చర్మం అడుగున ఉన్న ఎలాస్టిక్‌ లేయర్‌లో చిన్న చిన్న చిరుగులు ఏర్పడతాయి. అవే స్ట్రెచ్‌ మార్క్స్‌గా చర్మంపై కనిపిస్తాయి. ఇవి అందరికీ రావాలని లేదు. కొందరికి రావొచ్చు. ఇంకొందరికి రాకపోవచ్చు. ఇదంతా చర్మ తత్వం మీద ఆధారపడి ఉంటుంది. క్రీమ్స్‌ వాడినా, వాడకపోయినా చర్మ తత్వం ఆధారంగా ఈ చారికలు ఏర్పడతాయి. క్రీమ్స్‌ వాడటం వల్ల సాగిన చర్మం వల్ల మొదలయ్యే దురద తగ్గుతుందేమోగానీ గుర్తులు పడకుండా ఆగిపోవు. గర్భిణి బరువు ఎక్కువ పెరిగినా స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడతాయి.
 
వ్యాయామంతో సుఖ ప్రసవం

గర్భిణులు ఎటువంటి సంకోచం లేకుండా వ్యాయామం చేయొచ్చు. వ్యాయామం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ప్రసవ సమయంలో శరీరం ఎన్నో ఒడుదొడుకులకు లోనవుతుంది కాబట్టి అందుకు శరీరాన్ని సిద్ధం చేయటం కోసం ముందు నుంచే శరీరానికి వ్యాయామాన్ని అలవాటు చేయాలి. ఇక వ్యాయామం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి.

ఎలాంటి వ్యాయామం చేసినా, బ్లీడింగ్‌, పొట్టలో నొప్పి, కళ్లు తిరగటం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని కలవాలి.

కింద పడిపోయే అవకాశం ఉన్న యోగాసనాలు వేయకూడదు, వ్యాయామాలు చేయకూడదు.

గర్భిణులకు అత్యుత్తమ వ్యాయామం నడకే! ప్రసవానికి ముందు రోజు వరకూ కూడా వాకింగ్‌ చేయొచ్చు. అలాగే నడిచేటప్పుడు చేతులు కూడా కదిలిస్తూ నడిస్తే మంచిది.

మరీ నెమ్మదిగా కాకుండా కొద్దిగా గుండె వేగం పెరిగి, చమటలు పట్టేంత వేగంగా వాకింగ్‌ చేయాలి.

వారానికి 3 నుంచి 5 సార్లు అరగంటపాటు నడక మంచిది.

అప్పటివరకూ నడక అలవాటు లేనివాళ్లు మొదట 10 నిమిషాలతో మొదలుపెట్టి క్రమంగా పెంచుతూ పోవాలి.

యోగాలో ఊపిరి పీల్చుకుని, వదిలే వ్యాయామాలు ఉంటాయి. ఇవి ఊపిరి పీల్చి వదిలే ఈ పద్ధతే పురిటి నొప్పులు వచ్చినప్పుడు తేలిక ప్రసవమయ్యేందుకు ఉపయోగపడుతుంది.

యోగా వల్ల రక్తపోటు, నడుము నొప్పి తగ్గుతుంది.

యోగా కూడా ప్రసవం ముందు రోజు వరకూ చేయవచ్చు.

కాళ్లు పైన, తల కింద ఉంచి చేసే ఆసనాలు వేయకూడదు.

నీటిలో యోగా, ఈత కూడా మంచి వ్యాయామాలే!

ఏవి తినాలి? ఏవి తినకూడదు?

కారం, ఉప్పు, మసాలాలు బాగా తగ్గించాలి.
రోజుకి మూడు సార్లు కాకుండా ఆరు సార్లు తక్కువ పరిమాణాల్లో తినాలి.
నిద్రకు మూడు గంటల ముందే భోజనం ముగించాలి.

ఇద్దరి కోసం తినొద్దు!

పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు సమంగా ఉండే పౌష్టికాహారం తినాలి.

మలబద్ధకం లేకుండా ఉండటం కోసం పీచుపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం తొక్కు తీయని కూరగాయలు తినాలి. పొట్టుతో కూడిన గోధుమ బియ్యం, గోధుమలు వాడాలి. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు, తాజా పళ్ల రసాలు తాగాలి. శరీర తత్వం వల్ల కొందరికి ఎన్ని ఆహార నియమాలు పాటించినా మలబద్ధకం వదలదు.

అలాంటివాళ్లు వైద్యులు సూచించే మందులు వాడాలి. వీటి వల్ల బిడ్డ మీద ఏ ప్రభావం ఉండదు. అనవసరమైన అనుమానాలతో మలబద్ధకాన్ని అలాగే వదిలేస్తే, పెద్ద పేగుల కదలికల ప్రభావం గర్భాశయం మీద పడి గర్భస్రావం జరగొచ్చు.

శాకాహారులు తాజా కూరగాయలు, పళ్లు, మాంసాహారులు...గుడ్లు, మాంసం తినొచ్చు.
రోజుకి 100 గ్రాముల బొప్పాయి తినొచ్చు.

పెరగాల్సిన బరువుకూ పరిమితులున్నాయి!

‘నువ్విప్పుడు వట్టి మనిషివి కాదమ్మా! ఒకరికి సరిపడా తింటే సరిపోదు, ఇద్దరు మనుషులకు సరిపడా తినాలి’...సర్వసాధారణంగా గర్భిణులందరికీ ఈ రకమైన మాటలు సుపరిచితమే! కానీ ఇలా చెప్పేవాళ్లు గర్భంలో ఉన్నది మనిషి కాదు, కొన్ని సెంటీమీటర్ల మేర పొడవుండే చిన్న పిండమేననే వాస్తవాన్ని గ్రహించరు.

మూడు నుంచి ఆరు నెలల గర్భంలో బిడ్డ గరిష్ఠంగా అర కిలో నుంచి 2 కిలోల బరువు మాత్రమే పెరుగుతుంది. కాబట్టి ఆ పెరుగుదలకు సరిపడా తింటే సరిపోతుంది.

అంతకు మించి అదనంగా తినేదంతా గర్భిణుల్లో కొవ్వులా పేరుకుని ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

గర్భం దాల్చిన మహిళ తొమ్మిది నెలల కాలంలో పెరగాల్సిన శరీర బరువు ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండదు. గర్భం దాల్చినప్పుడు ఆ మహిళ ఎంత బరువుందనే లెక్కను బట్టి పెరగాల్సిన శరీర బరువులో తేడాలుంటాయి.

 ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడిసిన్‌ 2009’ గర్భిణులు పెరగాల్సిన బరువు గురించి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ఇప్పటికీ ప్రపంచదేశాలన్నీ వీటినే అనుసరిస్తున్నాయి. ఆ ప్రమాణాలు ఏంటంటే....

అవసరాని కంటే తక్కువ బరువు ఉన్నవాళ్లు (అండర్‌ వెయిట్‌) వాళ్లు 12 నుంచి 18 కిలోల బరువు పెరగాలి.

బిఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) నార్మల్‌గా ఉన్నవాళ్లు 11 నుంచి 16 కిలోల బరువు పెరగాలి.

బిఎమ్‌ఐ 20 నుంచి 30 ఉండి, అధిక బరువు ఉన్నవాళ్లు 7 నుంచి 11 కిలోల బరువు పెరిగితే చాలు.

బిఎమ్‌ఐ 30 దాటి, ఒబేసిటీ ఉన్నవాళ్లు 5 నుంచి 9 కిలోల బరువే పెరగాలి.

కవలలతో గర్భం దాల్చినవాళ్లు పైన చెప్పిన కోవను బట్టి సూచించిన బరువు కంటే అదనంగా మరో 3 నుంచి 5 కిలోలు పెరగొచ్చు.

పరిమిత ఆహారం చాలు!

బరువు పెరగకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం తగ్గించాలి కదా! అలా తగ్గిస్తే బిడ్డ ఎదుగుదల మందగించదా? అని గర్భిణులు భయపడాల్సిన అవసరం లేదు.

పరిమిత ఆహారం తీసుకున్నా బిడ్డ... తల్లి శరీరం నుంచి కొవ్వు, పోషకాలను గ్రహిస్తుంది. 

గర్భిణిగా నిర్ధారణ జరిగిన తర్వాత, తగినంత శరీర బరువు ఉండేవాళ్లు వారానికి అర కిలో చొప్పున బరువు పెరిగితే సరిపోతుంది. దీన్నిబట్టి మొదటి నెల నుంచి రెండు నెలలు దాటేవరకూ 0.5 నుంచి 2 కిలోల బరువు పెరగొచ్చు. కాబట్టి బిడ్డ ఎదుగుదల కోసం ప్రత్యేకంగా, అదనంగా తినాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నుంచి వారానికి అర కిలో చొప్పున పెరగాలి.

3 నుంచి 9 నెలల కాలంలో రోజుకి అదనంగా 340 క్యాలరీలుండే ఆహారం తింటే సరిపోతుంది. కవల పిల్లలతో గర్భం దాల్చిన వారు మరో 100 క్యాలరీలు ఎక్కువ తీసుకోవచ్చు.

గర్భిణులు శరీర బరువును అవసరానికి మించి పెరగకుండా చూసుకోవాలి. పరిధి మించితే రక్తపోటు పెరిగి, సిజేరియన్‌ సర్జరీ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

తల్లి బరువు పెరిగితే ఆమెతోపాటు బిడ్డా బరువు పెరుగుతుంది. దాంతో పెద్ద బిడ్డ ప్రసవం కష్టమై సర్జరీ చేయాల్సి రావొచ్చు. ఇలా అధిక బరువుండే తల్లి ప్రసవం తర్వాత బరువు తగ్గకుండా రెండోసారి గర్భం దాల్చితే, మధుమేహం, రక్తపోటు సమస్యలు పెరుగుతాయి.
 
డాక్టర్‌ శ్రీ లక్ష్మి దాయన,
కన్సల్టెంట్‌ ఇన్‌ గైనికాలజికల్‌ ఆంకాలజీ,
అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌,
జూబ్లీ హిల్స్‌,హైదరాబాద్‌