అమ్మ ఇచ్చే అమృతం

ఆంధ్రజ్యోతి, 11-07-2017:తల్లి పాలు పిల్లలకు అమృత సమానం. బిడ్డతో తల్లికి అనుబంధం ఏర్పడేదీ తల్లి పాలతోనే! అయితే పాలిచ్చే పద్ధతి, తాగించే విధానం మొదటిసారిగా బిడ్డకు జన్మనిచ్చిన చాలామంది తల్లులకు తెలియదు. లేనిపోని అపోహలు, అర్థం లేని నమ్మకాలు, తెలిసిన వాళ్లిచ్చే సలహాలు.. ఇవన్నీ కొత్తగా అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న స్త్రీలను అయోమయానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి తల్లుల కోసం కొన్ని ముఖ్యమైన సలహాలు, సూచనలు...

 
తల్లిపాలలో ‘కొలస్ట్రమ్‌’ అనే పదార్ధం ఉంటుంది. దీన్లోనే బిడ్డ ఎదుగుదల, రోగనిరోధకశక్తి పెంపు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలు, ఇమ్యునోగ్లోబ్యులిన్స్‌ ఉంటాయి. ఈ కొలస్ట్రమ్‌ ప్రసవమైన వారం, పది రోజుల వరకూ తల్లి పాలల్లో ఎక్కువగా ఉంటాయి. ప్రసవం సహజమైనదైనా, సిజేరియన్‌ అయినా బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలివ్వాలి. అప్పుడే పాల తయారీ మొదలై పాలు బాగా వస్తాయి.
 
తల్లిపాలలో ఏముంటాయి?
ప్రసవమైన తర్వాత వారం రోజులపాటు పాలు చుక్కలుగా మాత్రమే వస్తాయి. అది చూసి ధారలాగా రావట్లేదు కాబట్టి తల్లి దగ్గర తగినన్ని పాలు లేవేమో అనుకుంటారు. బయట పాలు పట్టిద్దామని కూడా అనుకుంటారు. కానీ పసికందుకు తల్లిపాలు కొన్ని చుక్కలైనా సరిపోతాయి. పుట్టింది మొదలు ప్రతి రెండు గంటలకోసారి తల్లి పాలను పట్టిస్తూ ఉండాలి.
సాధారణంగా పిల్లలు పుట్టిన వారంలో శరీర బరువులో 10 శాతం కోల్పోతారు. ఇది సహజం. బరువు తగ్గటం చూసి తల్లిపాలు సరిపోవట్లేదేమోనని అనుకుంటారు. కానీ పిల్లలు ఈ మాత్రం బరువు కోల్పోవటం అత్యంత సహజం. పాలు తాగేకొద్దీ నెమ్మదిగా బరువు పెరగటం మొదలుపెడతారు. తల్లిపాలలో బిడ్డకు తేలికగా జీర్ణమె, శక్తినిచ్చి, వ్యాధుల నుంచి రక్షణ కల్పించే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, ఐరన్‌, ఫ్యాట్స్‌, కార్బోహైడ్రేట్స్‌ ఉంటాయి. తల్లిపాలు పలచగా ఉండటం కూడా సహజమే! చిక్కగా లేవు కాబట్టి వాటిలో బలం లేదని అనుకోకూడదు. చనుబాలలో 80 శాతం నీరే ఉంటుంది. ఆ నీరే బిడ్డ దాహార్తినీ తీరుస్తుంది. కామెర్లు రాకుండా కాపాడుతుంది. తల్లిపాలలో కొవ్వు, మాంసకృత్తులు, పిండి పదార్థాలు తగు పాళ్లలో ఉంటాయి. ఆవు లేదా గేదె పాలలో, ఫార్ములా ఫీడ్స్‌లో ఈ కొలతలు సక్రమంగా ఉండవు కాబట్టి పలుచగా ఉన్నా తల్లి పాలనే బిడ్డకు పట్టించాలి. ఆస్తమా, ఎగ్జిమా, మధుమేహం, చెవి ఇన్‌ఫెక్షన్లు, పొట్టలో నొప్పి పసి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి రాకుండా ఉండాలంటే బిడ్డకు తల్లిపాలే పట్టించాలి.
 
పాలిచ్చే పద్ధతి ఇది!
ఒళ్లో పడుకోబెట్టుకుని ముందుకు వంగి పాలివ్వాలా? లేక పక్కలో పడుకోబెట్టుకుని పాలివ్వాలా? అసలు బిడ్డకూ, తల్లికీ...ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉండాలంటే పాలు ఎలా ఇవ్వాలి? ఈ విషయంలో తల్లులకు అవగాహన తక్కువ. రొమ్ము బిడ్డ నోట్లోకి వెళ్తే చాలు...తనంతట తానే పాలు తాగేస్తాడు అనుకుంటారు తల్లులు. కానీ బిడ్డ నోట్లోకి పాలు పీల్చుకోవాలంటే చనుమొన, దాని చుట్టూ ఉండే ‘ఏరియోలా’ అనే నల్లని గుండ్రటి భాగం కూడా బిడ్డ నోట్లోకి వెళ్లాలి. దీన్నే ‘లాచింగ్‌’ అంటారు. ఇందుకోసం చనుమొనను మాత్రమే బిడ్డ నోట్లో ఇరికించకుండా బిడ్డ నోటిని పూర్తిగా తెరిచి రొమ్ముకు ఆనించాలి. అప్పుడే చనుమొన ఏరియోలాతో సహా బిడ్డ నోట్లో ఇమిడిపోయి బిడ్డ శ్రమ పడకుండా పాలు తాగగలుగుతాడు. సాధారణంగా బిడ్డ పాలు తాగేటప్పుడు రొమ్ము వల్ల బిడ్డ ముక్కు మూసుకుపోయి గాలి ఆడదేమోనని భయపడుతుంటారు తల్లలు. కానీ లాచింగ్‌ టెక్నిక్‌ పాటిస్తే బిడ్డ ఆ పద్ధతికి అలవాటు పడటంతోపాటు పాలు తాగుతూనే గాలి పీల్చుకోగలిగే టెక్నిక్‌నూ నేర్చుకుంటాడు.
 
ఎలా కూర్చుని పాలివ్వాలి?
బిడ్డకు తల్లి పాలివ్వడంలో ఓ నియమం పాటించాలి. తల్లి చెవులు, భుజాలు, పిరుదులు నిలువుగా ఒకే కోణంలో ఉండేలా కూర్చోవాలి. ఎటువైపైతే పాలిస్తున్నారో ఆ వైపు ఈ నియమం తప్పకుండా పాటించాలి. బిడ్డ మీదకు వంగకుండా బిడ్డను తన రొమ్ముల దగ్గరకు తల్లి తెచ్చుకోవాలి. ఈ భంగిమ తల్లి, బిడ్డలిద్దరికీ ఎంతో సౌకర్యవంతమైనది. తల్లికి ఎప్పుడూ వెన్నుకు సపోర్ట్‌ ఉండాలి. ఇందుకోసం మంచాన్ని ఆసరాగా చేసుకుని రెండు దిండ్లు వీపు వెనక ఉంచుకుని నిటారుగా కూర్చోవాలి. పాలిచ్చే భంగిమల్లో క్రేడిల్‌, క్రాస్‌ క్రేడిల్‌, ఫుట్‌బాల్‌, ఫుట్‌బాల్‌ హోల్డ్‌ అనే రకాలుంటాయి. ప్రసవం జరిగిన తీరును బట్టి ఈ భంగిమలను అనుసరించాలి. సిజేరియన్‌ అయిన తల్లులైతే ‘ఫుట్‌ బాల్‌ పొజిషన్‌’ పాటించాలి. ఈ భంగిమలో తల్లి దిండ్లకు ఆనుకుని కూర్చుని బిడ్డ తలను చేత్తో పట్టుకుని పాలు పట్టించాలి. ఇలా చేయటం వల్ల బిడ్డ బరువు తల్లి పొట్ట మీద పడకుండా ఉంటుంది. అలాగే పాలు పట్టించిన తర్వాత తప్పనిసరిగా బిడ్డకు త్రేన్పులు వచ్చేవరకూ భుజం మీద పడుకోబెట్టుకోవాలి. ఇక సాధారణ ప్రసవమైతే ఒళ్లో పడుకోబెట్టుకుని బిడ్డ తలను లేపి రొమ్ముకు ఆనించుకుని పాలు పట్టించాలి.
 
చనుమొనల సమస్యలు
చనుమొనల పగుళ్లు, నొప్పులు, పొడిబారటం లాంటి సమస్యలు తల్లుల్లో కనిపిస్తుంటాయి. వీటికి కారణం పాలిచ్చే పద్ధతులను తల్లులు సరిగా పాటించకపోవటమే! లాచింగ్‌ సరిగా లేక బిడ్డ చనుమొనల్నే పట్టుకుని పాలు తాగుతుంటే వాటి పక్క నుండే చర్మం సాగి, పొడిబారుతుంది. కొన్నిసార్లు బీటలు వారుతుంది.
 
సోర్‌ నిపుల్స్‌: తల్లిది పొడి చర్మమైతే, పాలిచ్చే పద్ధతిలో తప్పు ఉంటే...చనుమొనలు మరింత పొడిబారి, పగిలి, రక్తస్రావం కూడా కనిపించొచ్చు. ఈ సమస్యను ‘సోర్‌ నిపుల్స్‌’ అంటారు.
ఇన్‌వర్టెడ్‌ నిపుల్స్‌: కొందరికి చనుమొనలు బయటికి రాకుండా రొమ్ము లోపలికి ముడుచుకుని ఉంటాయి. ఈ లక్షణాన్ని వైద్యుల దృష్టికి తెస్తే తొమ్మిదో నెల గర్భంతో ఉండగానే చనుమొనలు బయటికి రావటానికి ఉపయోగపడే క్రీములను వైద్యులు సూచిస్తారు. అలాగే మరీ లోపలికి ముడుచుకుపోయిన ఇన్‌వర్టెడ్‌ నిపుల్‌ను సిరంజ్‌ మెథడ్‌ ద్వారా వైద్యులు బయటికి తీస్తారు.
క్రాక్‌డ్‌ నిపుల్స్‌: కొందరికి చనుమొనలు పొడిబారి వాటి మీద పగుళ్లు ఏర్పడతాయి. ఈ సమస్య ప్రసవమైన రెండు నెలల్లో తల్లికి ఎప్పుడైనా ఎదురవ్వొచ్చు. ఈ సమస్యతో పాలిచ్చేటప్పుడు చెప్పలేనంత అసౌకర్యం కలుగుతుంది. ఇలాంటప్పుడు గాయం మానేవరకూ ‘నిపుల్‌ షీల్డ్‌’ను వాడాలి. దీన్ని చనుమొనకు అంటించుకుని పాలు పట్టాలి.
 
ఈ సమస్యలేవీ రాకుండా ఉండాలంటే...
1. చనుమొనను ఏరియోలాతో సహా కలిపి బిడ్డ నోట్లో పెట్టాలి.
2. బిడ్డ నోరు రొమ్ముతో లాచింగ్‌ అయిందో లేదో చూసుకోవాలి.
3. చనుపాలతోనే రొమ్మును, చనుమొనలను రుద్దుకుంటే పగుళ్లు తగ్గుతాయి.
4. పాలిచ్చే ముందు చనుమొనను నొక్కి కొన్ని చుక్కల పాలు బయటికి వచ్చిన తర్వాత పాలు పట్టిస్తే లాచింగ్‌ తేలికగా జరుగుతుంది.
5. చనుమొనల మంట తగ్గటం కోసం హాట్‌ బ్యాగ్‌ పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే పాలు తేలికగా చనుమొనల నుంచి బయటకొచ్చి బిడ్డ పాలుతాగటం తేలికవుతుంది. చనుమొనలు చిట్లకుండా ఉంటాయి.
 
రొమ్ముల శుభ్రత ఇలా...
స్నానం చేస్తున్నప్పుడే రొమ్ములను సబ్బుతో రుద్ది ఎక్కువ నీళ్లతో కడగాలి. అంతేతప్ప పాలిచ్చే ప్రతిసారీ రొమ్ములను ప్రత్యేకంగా శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. ప్రసవమైన తర్వాత మొట్టమొదటిసారి పాలిచ్చేటప్పుడు మాత్రం హార్మోన్ల ప్రభావం వల్ల ఏరియోలా నల్లగా మారి పొరలు లేస్తుంది కాబట్టి మెత్తని దూదితో ఆ ప్రదేశాన్ని తుడిచి పాలివ్వాల్సి ఉంటుంది. పాలు పట్టడం పూర్తయిన ప్రతిసారీ నిపుల్‌ క్రాక్స్‌ రాకుండా ఉండటం కోసం చనుపాలతోనే చనుమొన, ఏరియోలాలను రుద్దుకోవాలి. పాలు పట్టించిన తర్వాత తుడవకపోవటం వల్లే బిడ్డ పెదవులు నల్లగా మారుతున్నాయని అనుకుంటారు. కానీ బిడ్డకు రక్తం తక్కువగా ఉన్నా, కామెర్లు ఉన్నా పెదవులు నల్లగా మారతాయి.
 
పాలిచ్చే తల్లులు ఏం తినాలి?
పిల్లలకు సరిపడా పాలు ఉండాలంటే సాధారణంగా సమకూరే క్యాలరీలకంటే అదనంగా మరో 500 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. గర్భం దాల్చింది మొదలు ప్రసవమైన సంవత్సరం వరకూ మహిళలు డైటింగ్‌ లాంటి ఎలాంటి ఆరోగ్య నియమాలూ పాటించకూడదు. ప్రసవమైన తర్వాత పాల ఎక్కువవడం కోసం ఈ కింది ఆహారం తీసుకోవాలి. 
మిరియాల రసం
మెంతులతో తయారైన పదార్థాలు
ఆకు కూరలు
తీపి మొక్కజొన్న
ఓట్స్‌
బాదం పప్పు
వాల్‌నట్స్‌
పాలిచ్చే తల్లులు ఎక్కువ ఆహారం తీసుకోవాలి.
ఎసిడిటీ తలెత్తకుండా కారం, మసాలాలు తగ్గించాలి.
రోజుకి కనీసం 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి.
మాంసకృత్తులుండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
పాలు, పెరుగు, మజ్జిగ, డ్రైఫ్రూట్స్‌ తినాలి.
పిల్లలకు కామెర్లుంటే తల్లి మాంసాహారం, గుడ్లు తగ్గించటం మంచిది.
చేపలు, కీమా, ఎగ్‌ వైట్స్‌ ఎక్కువగా తినాలి.
పాలు ఇచ్చే ముందు, ఇచ్చిన తర్వాత ఒక గ్లాసుడు పళ్ల రసం తప్పకుండా తీసుకోవాలి.
ఎన్ని సార్లు పాలివ్వాలి?
బిడ్డకు పాలిచ్చే ప్రతిసారీ తల్లి తన రెండు రొమ్ముల నుంచీ పట్టించాలి. పుట్టిన నెల రోజుల వరకూ చెరొక రొమ్ము నుంచి 15 నిమిషాలపాటు పాలు తాగనివ్వాలి. అయితే పసికందులందరి ఆకలీ ఒకేలా ఉండదు. కొందరికి రోజుకి 8 సార్లు పాలిస్తే సరిపోతుంది. ఇంకొంతమంది పిల్లలకు అంతకంటే ఎక్కువసార్లు అవసరం పడొచ్చు. బిడ్డ ఏడ్చిన ప్రతిసారీ ఆకలితోనే ఏడ్చాడని అనుకుని పాలిచ్చే ప్రయత్నం చేస్తుంటారు తల్లులు. పాలివ్వబోతే తోసేస్తున్నాడంటే ఆ ఏడుపుకు అర్థం ఆకలి కాదని గ్రహించాలి. మలమూత్ర విసర్జన చేసినా, పక్క తడిగా లేదా వేడిగా ఉన్నా, పొట్టలో నొప్పి ఉన్నా పిల్లలు ఏడుస్తారు. కాబట్టి ఏడుపుకు కారణం తెలుసుకోవాలి. పాలు పట్టించిన ప్రతిసారీ చక్కగా తాగి నిద్రపోతూ మల,మూత్ర విసర్జన సక్రమంగా జరుగుతూ, బిడ్డ క్రమంగా బరువు పెరుగుతున్నంత కాలం బిడ్డకు పట్టిస్తున్న పాలు సరిపోతున్నాయనే అర్థం చేసుకోవాలి. అలాగే పిల్లలకు 6 నెలలొచ్చిన తర్వాత ఘనాహారం మొదలుపెట్టినా ఏడాది, ఏడాదిన్నర పాటు తల్లి పాలు ఇస్తూనే ఉండాలి.
 
పాలివ్వటం తల్లికీ ఆరోగ్యమే!
కొంతమంది తల్లులు పిల్లలకు పాలివ్వటానికి ఇష్టపడరు. తల్లిపాలే ఇవ్వాల్సిన అవసరం ఏముంది? బయటి పాలైనా పాలే కదా? అనుకుంటారు. ఇక ఉద్యోగినులకైతే బిడ్డలకు పాలిచ్చేంత సమయం ఉండదు. దాంతో ఇంట్లో ఉన్నప్పుడు తప్ప బిడ్డకు పాలివ్వలేకపోతుంటారు. కానీ తల్లిపాల వల్ల బిడ్డకు ఎంత ఉప యోగమో, తల్లికీ అంతే ఉపయోగం. చనుబాలిచ్చే స్త్రీలకు భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. శరీరంలో పాల ఉత్పత్తి వల్ల హార్మోన్ల పనితీరు మెరుగై ఎముకలు పటిష్ఠమవుతాయి. ఎముకలు, మరీ ముఖ్యంగా తుంటి ఎముకలు విరిగే అవకాశాలు తగ్గుతాయి. అలాగే బిడ్డకు పాలివ్వటం వల్ల గర్భంతో ఉన్నప్పుడు పెరిగిన శరీర బరువు అదుపులోకొస్తుంది. ఫార్ములా ఫీడ్‌తో పోల్చుకుంటే బ్రెస్ట్‌ మిల్క్‌ ఎంతో మేలైనవి, ఉచితంగా, సహజసిద్ధంగా లభించేవి. కుటుంబంపై ఆర్థిక భారం కూడా పడదు.
 
తల్లి పక్కలోనే చంటి బిడ్డ..
పాలు పట్టించేటప్పుడే కాకుండా మిగతా సమయంలోనూ బిడ్డ తల్లిని ఆనుకుని ఉండాలి. తల్లికి అసౌకర్యంగా ఉంటుందని ఉయ్యాలలో పడుకోబెట్టటం సరికాదు. తల్లిని బిడ్డ హత్తుకుని ఉండటం వల్ల తల్లి శరీరంలో హార్మోన్లు పెరిగి పాల ఉత్పత్తి అధికమవుతుంది. దాంతో బిడ్డకు సరిపడా పాలు నిరంతరంగా తయారువుతూ ఉంటాయి. ఇలా తల్లికి బిడ్డ దగ్గరగా ఉండటం వల్ల ఇద్దరి మఽధ్యా చక్కని అనుబంధం కూడా ఏర్పడుతుంది.
 

అపో హలు - వాస్తవాలు

ప్రసూతి మహిళ నీళ్లు తాగితే పొట్ట పెరుగుతుంది!

ఇది అపోహ మాత్రమే! నిజానికి ఎక్కువ నీళ్లు తాగటం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. ప్రసవం తర్వాత 6 వారాలపాటు జరిగే ఆన్‌ అండ్‌ ఆఫ్‌ బ్లీడింగ్‌ వల్ల వెజినా పొడిబారుతుంది. దాంతో యూరినరీ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. ఈ సమస్యలేవీ రాకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగే సిజేరియన్‌ సర్జరీ కోసం ఇచ్చిన అనస్థీషియా బయటికి వెళ్లిపోవాలన్నా కూడా ఎక్కువ నీరు తాగాలి.
 
తల్లి పాలు సరిపోవట్లేదు!
ఇది సాధారణంగా పెద్దలందరూ అనే మాట. పాలు సరిపోవట్లేదు..అందుకే బిడ్డ ఏడుస్తోంది అనుకుంటారు. కానీ పాలు సరిపోకపోవటమనేది ఉండదు. బిడ్డకు నాలుగు నెలల వయసొచ్చేవరకూ తల్లి పాలే చక్కగా సరిపోతాయి.
 
ఇలా తినండి!
ఏం తింటున్నామన్న దానితో పాటు ఏ వేళకు తింటున్నామనేదీ కూడా చాలా ముఖ్యం. ఆరోగ్య నిపుణుల సూచన ఏమిటంటే...
 
బ్రేక్‌ఫాస్ట్‌
ఉదయం లేవగానే అరగంట కల్లా అల్పాహారం తినేయాలి. అంటే ఉదయం ఏడు, ఎనిమిది మధ్య టిఫిన్‌ తినేయడం బెస్ట్‌. ఎట్టి పరిస్థితుల్లోనూ పది దాటకూడదు.
లంచ్‌
బ్రేక్‌ఫాస్ట్‌ లంచ్‌కీ మధ్య దాదాపు నాలుగు గంటల విరామం ఉంటే మంచిది. మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండు గంటల మధ్య భోజనం చేస్తే బెస్ట్‌. సాయంత్రం నాలుగు దాటిన తర్వాత లంచ్‌ చేయొద్దు.
డిన్నర్‌
నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందే రాత్రి భోజనం ముగించేయాలి. సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో డిన్నర్‌ ముగించేస్తే బెస్ట్‌. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి పది గంటల తరువాత భోజనం చేయొద్దు.
 
ఫ్రిజ్‌లో... తల్లిపాలు
తల్లులైన ఉద్యోగినులకు బిడ్డకు పాలిచ్చే సమయం ఉండదు. పాలివ్వకపోవటం వల్ల అటు బిడ్డకూ ఇటు తల్లికీ ఇద్దరికీ అసౌకర్యమే! ఇలాంటప్పుడు పాలను సేకరించే ‘సక్షన్‌ పంప్‌’ ఉపయోగించి పాలను తీసి నిల్వ చేసుకోవచ్చు. ఇలా తీసిన పాలను ఫ్రిజ్‌లో 4 గంటలపాటు నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. అయితే వాడేముందు గది ఉష్ణోగ్రతకి చేరుకునే వరకూ ఆగి ఆ తర్వాతే బిడ్డకు పట్టించాలి. ఉదయం ఆఫీసుకి వెళ్లేముందు పాలను ఈ పద్ధతిలో తీసి ఫ్రిజ్‌లో ఉంచి బిడ్డను చూసుకునే పెద్దవారికి పాలు పట్టించే బాధ్యత అప్పగించాలి. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చి పాలిచ్చేవరకూ ఈ పాలు సరిపోతాయి. ఒకవేళ ఆఫీసులో ఫ్రిజ్‌ సౌకర్యం ఉన్నా సక్షన్‌ పంప్‌ తీసుకెళ్లి పాలను సేకరించి, నిల్వ చేసుకుని, వెంట తీసుకురావొచ్చు.
డాక్టర్‌ భావన కాసు,
అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజీ,
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హాస్పిటల్స్‌,
సికింద్రాబాద్‌