గర్భిణీలకు పారాసిటమాల్‌తో సమస్య

ఆంధ్రజ్యోతి(2-6-15): సాధారణంగా తలనొప్పి వచ్చినా... జ్వరం వచ్చినా ఎవరైనా ఆశ్రయించేది పారాసిటమాల్‌ టాబ్లెట్స్‌నే.  ఒక్కోసారి డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండానే వీటిని వాడుతుంటారు. డాక్టర్లు కూడా జ్వరం, తలనొప్పి వంటి రోగాలకు వీటినే వాడమని చెప్తుంటారు. మామూలు సమయాల్లో వీటిని వాడితే ఏ బాధా లేదు కానీ, గర్భంతో ఉన్నప్పుడు వాడితే మాత్రం పుట్టబోయే అబ్బాయికి సమస్యలు వస్తాయని పరిశీలకులు చెబుతున్నారు. గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా పారాసిటమాల్‌ టాబ్లెట్స్‌ను వాడితే పుట్టబోయే అబ్బాయికి టెస్టోస్టిరాన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం తక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. టెస్టోస్టిరాన్‌ అనేది అండోత్పత్తికి మూల కారకం. పురుషుల్లో ఇది లోపిస్తే వారికి పిల్లలు పుట్టకపోయే ప్రమాదం ఉంది. ప్రాథమికంగా ఈ పరిశోధనను ఎలుకలపై చేశారు.  వాటికి ఈ టాబ్లెట్స్‌ను వరుసగా ఇస్తూ వచ్చారు. ఈ టాబ్లెట్స్‌ను ఇచ్చిన 24 గంటల వరకూ వాటికి ఎటువంటి ఎఫెక్ట్‌ రాలేదు. కానీ వారం రోజుల తర్వాత ఎలుకలు ఉత్పత్తి చేసే టెస్టోస్టిరాన్‌ శాతం 45 శాతానికి తగ్గిందట. ఈ టాబ్లెట్స్‌ మనుషులపై కూడా అదే రకమైన ప్రభావం చూపుతుందట. గర్భంతో ఉన్నవారు ఈ టాబ్లెట్స్‌ను వాడకపోవడమే మంచిదని పరిశీలకులు చెబుతున్నారు. ఈ టాబ్లెట్స్‌కు బదులు వేరే ఏదైనా పెయిన్‌ కిల్లర్‌ను అతి తక్కువ మోతాదులో డాక్టర్ల సూచనతో వాడితే మంచిదని వారు సూచిస్తున్నారు.