ఆ సమస్యపై చైతన్యం తీసుకొస్తా!

28-06-2017:‘‘ప్రతి స్త్రీకి ప్రకృతి ప్రసాదితం రుతుక్రమం. అయితే చాలా దేశాల్లో అవగాహన లేక వ్యక్తిగత పరిశుభ్రత కొరవడుతోంది. ఎప్పుడైతే రుతుక్రమ సంబంధిత పరిశుభ్రత లోపిస్తుందో.. అప్పుడు మహిళల్లో పలు జబ్బులు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆ సమస్య మరీ ఎక్కువ. అందుకే నేను ఒక మహిళగా, వైద్య విద్యార్థిగా మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ అంశం పట్ల చైతన్యం తీసుకొస్తున్నాను. ఇప్పటికే ‘శక్తి’ అనే పేరుతో ఒక ప్రాజెక్ట్‌ చేస్తున్నాను..’’ అన్నారు 54వ ఫెమీనా మిస్‌ ఇండియా వరల్డ్‌ టైటిల్‌ నెగ్గిన మానుషి ఛిల్లార్‌. హర్యానాకు చెందిన ఈ అందగత్తెకు తోటి మహిళల సమస్యల పట్ల స్పందించే గుణం ఎక్కువ. అందులోనూ ఇప్పుడు అందాల కిరీటాన్ని గెల్చుకోవడంతో తన పరిధి పెరిగింది కాబట్టి.. మరింత సామాజిక సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. ప్రస్తుతం హర్యానాలోని సోన్‌పట్‌లోనున్న- భాగట్‌ పూల్‌ సింగ్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్య చదువుతోందీ అమ్మాయి. అందాల పోటీల పట్ల అంత మోజు ఉండేది కాదట.

ఆ విషయాన్నే చెబుతూ ‘‘మా ఇంట్లో అందరూ ఉన్నతవిద్యావంతులు. నేను మెడిసిన్‌ చేస్తున్నా, మా సోదరి న్యాయవాది, ఇక, పెద్దన్నయ్య ఇప్పటికీ చదువుతున్నాడు. కాబట్టి ఎవరికీ అందాలపోటీల పట్ల ఆసక్తి లేదు. అయితే నేను అనుకోకుండా వచ్చాను. అయినా వాళ్లేమీ అభ్యంతరం చెప్పలేదు’’ అని చెప్పారు. మానుషికి అమీర్‌ఖాన్‌ అంటే ఇష్టమట! అయితే అతను బాలీవుడ్‌ హీరో కాబట్టి తను అభిమాని కాలేదు. అమీర్‌ సినిమాల్లో సామాజిక స్పృహ ఉంటుంది కాబట్టి ఆయన అభిమానిగా మారినట్లు చెప్పిందీ హర్యానా సుందరి. ‘‘ఫెమీనా మిస్‌ ఇండియా కిరీటాన్ని గెల్చుకున్నావు కదా! తదుపరి లక్ష్యం ఏమిటి?’’ అనడిగితే.. ‘‘మిస్‌ వరల్డ్‌ గెలవడం నా లక్ష్యం’’ అంది. ఎందుకంటే ‘‘పదిహేడేళ్ల కిందట ప్రియాంకా చోప్రా (2000) మిస్‌ వరల్డ్‌ గెల్చుకుంది. అంతకు మునుపు రీటాఫరియా (1966), ఐశ్వర్యారాయ్‌ (1994), డయానా హేడెన్‌ (1997), యుక్తాముఖి (1999) ఆ వరుసలో విజేతలు. ప్రియాంక తరువాత ఇండియాకు అందాల కిరీటం రాలేదు. అందుకని ఆ కొరతను భర్తీ చేస్తే బావుంటుంది అనిపిస్తోంది. ఇప్పుడు నా కళ్ల ముందున్న లక్ష్యం మిస్‌ వరల్డ్‌’’ అంటోందీ అమ్మాయి.