ఆ 3 రోజుల...క్లాత్‌ ఉద్యమం!

ఆంధ్రజ్యోతి, 17-07-2017:నెలసరి రోజుల్లో సంప్రదాయ పద్ధతి అయిన బట్ట వాడకమే బెటర్‌! - ఇదే నేటి నగర మహిళల సరికొత్త ట్రెండ్‌గా కనిపిస్తోంది. తిరిగి తిరిగి మళ్లీ తిరోగమనం ఏంటి అని అనుకుంటున్నారా? సంప్రదాయ పద్ధతుల నుంచి ఆధునిక డిస్పోజబుల్స్‌ వాడుతున్న వాళ్లు నేడు సంప్రదాయ పద్ధతులే సో బెటరు అని వాటిని ఆధునిక దృష్టితో చూస్తున్నారు. దాన్నే ఒక ఉద్యమంగా కూడా మొదలుపెట్టేశారు.

అదేంటి అంతా ఆధునికత వైపు పరుగులు తీస్తుంటే... ఈ ఉద్యమం ఏంటి వెనక్కి పరుగెడుతున్నట్టు ఉందే... అనిపిస్తోందా... దీని వెనక బోలెడు కారణాలున్నాయి. అందులో ప్రధానమైనవి పర్యావరణాన్ని, పచ్చదనాన్ని కాపాడుకోవడం, ఆరోగ్యానికి హాని కలగని పద్ధతులు అనుసరించడం. ‘‘వాస్తవానికి శానిటరీ ప్యాడ్స్‌ను బయోకెమికల్‌ (జీవరసాయన) వ్యర్థంగా డిస్పోజ్‌ చేయాలి. కాని అలా జరగడం లేదు. దానివల్ల పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్న వాళ్లం అవుతున్నాం. మనదేశంలో శానిటరీ వ్యర్థాలే మూడు శాతం అంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు’’ అంటున్నారు ప్రియాంక జైన్‌ లాంటి ఢిల్లీకి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు. శానిటరీ ప్యాడ్స్‌ను డిస్పోజ్‌ చేసే సమస్య ఒక్కటే కాకుండా మన దేశంలో లభిస్తున్న శానిటరీ ప్యాడ్స్‌ స్టాండర్డ్స్‌ కూడా అంత గొప్పగా ఏమీ లేవంటున్నారు నిపుణులు కూడా. వీటిపట్ల ఎంత నిర్లక్ష్యధోరణి కనపడుతుందంటే 1980 నుంచి శానిటరీ ప్యాడ్స్‌ తయారుచేసే ఫార్ములాను ఆయా కంపెనీలు అప్‌డేట్‌ చేసుకోనేలేదు. అసలు ప్యాడ్స్‌ నాణ్యతను ఎలా పరిశీలిస్తారనే సందేహం వస్తోంది కదా. అందుకు పలు పారామీటర్లు ఉంటాయి. వాటిలో పిహెచ్‌ బ్యాలెన్స్‌ - అంటే మానవ శరీర త్వచాలు, కణాలపై ఫలానా ప్యాడ్‌ వాడకం వల్ల ప్రభావం ఎంతమేరకు ఉంటుంది. ఇతరత్రా సురక్షిత అంశాలు ఏమిటి అనేవి పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విషయాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంతో పాటు మరికొన్ని పేద దేశాలకు తక్కువ నాణ్యత కలిగిన నాప్‌కిన్లను పంపిణీ చేస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఫలానా కంపెనీవి అయితే నాణ్యంగా ఉంటాయని మీరు కొనుక్కునే పాపులర్‌ బ్రాండ్‌ కంపెనీలే ఉన్నాయి. తక్కువ ధరకి బ్రాండెడ్‌ ఉత్పత్తులు వాడాలనే ధోరణి మనదేశ ప్రజల్లో ఉంటుందని, అందుకే తక్కువ నాణ్యత ఉన్న వాటిని ఇక్కడ పంపిణీ చేస్తున్నామని ఆ ప్రముఖ కంపెనీలే చెప్తున్నాయట.
 
వాళ్లకి బోలెడు మార్గాలు!
ఆ కంపెనీలే దేశీయ మార్కెట్‌లో చొచ్చుకుపోయేందుకు తమకు అనుకూలంగా మాట్లాడే కొన్ని సమూహాలను ఎంపిక చేసుకుంటున్నాయి. అది కూడా ప్రత్యేకంగా గ్రామీణ భారతాన్ని లక్ష్యంగా చేసుకుని వాళ్లకేదో ఉపకారం చేస్తున్నట్టు అడుగుపెడతాయి అంటున్నారు బహుళజాతి కంపెనీల ధోరణికి అభ్యంతరం చెప్తున్న వాళ్లు. ‘‘శానిటరీ నాప్‌కిన్‌ ప్రచారానికి బహుళజాతి కంపెనీలు తమకు అనుకూలంగా ఉన్న గ్రూపులను ప్రచారానికి వాడుకుంటున్నాయి. శానిటరీ ప్యాడ్స్‌ ఉత్పత్తిదారుల్లో విదేశీ కంపెనీలే ఎక్కువ కాబట్టి దేశీయ మార్కెట్‌లోకి చొచ్చుకుపోయేందుకు పలు రకాల మార్గాలు ఎన్నుకుంటాయి అవి. అదికూడా ప్రత్యేకించి గ్రామీణ భారతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు వాళ్లకేదో ఉపకారం చేస్తున్నట్టు అడుగుపెట్టి గ్రామీణ మార్కెట్‌లోకి సులభంగా ప్రవేశిస్తాయి. ఇందుకు నేనే నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో శానిటరీ నాప్‌కిన్స్‌ గురించి ప్రచారం చేయమని నాలుగు బహుళజాతి కంపెనీలు అడిగాయి నన్ను. నేనందుకు అంగీకరించలేదు. కాని మనదేశంలో నెలసరి పరిశుభ్రత గురించి పనిచేసే చాలా స్వచ్ఛందసంస్థలు అందుకు ఒప్పుకున్నాయి’’ అని చెప్పారు నెలసరి ఆరోగ్యం గురించి పనిచేస్తున్న ‘మైత్రీ స్పీక్స్‌ ట్రస్ట్‌’ మేనేజింగ్‌ ట్రస్టీ సిను జోసెఫ్‌.
 
ప్రారంభంలో తిరస్కారం ఎదురైనా...
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి శానిటరీ ప్యాడ్స్‌ కొనుగోలు శక్తి లేక వాడడం లేదనేది వందశాతం నిజం కాదు. చౌకధరల్లో ప్యాడ్స్‌ లభించినా పలు కారణాల వల్ల వాటిని వాడేందుకు ఇష్టపడరు. ‘‘గ్రామీణ మహిళలకి శానిటరీ ప్యాడ్స్‌ పట్ల మంచి అవగాహన ఉంది. వాళ్లు నాప్‌కిన్స్‌ కొనలేరనేది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే 22 రూపాయలకు ఎనిమిది ప్యాడ్స్‌ లభిస్తున్నాయి. అయినప్పటికీ వాటిని వాడరు. అందుకు గల కారణాల్లో కొన్ని ఇవి - బట్టని వాడేందుకే ఇష్టపడటం. గ్రామాల్లో చెత్తవేయకూడదనే నియమం వల్ల గిరిజన మహిళలు డిస్పోజబుల్‌ వాడకాన్ని ఇష్టపడరు’’ అని తమ పరిశీలనలో వెల్లడైందన్నారు ప్రియాంక. ఈమె ‘గ్రీన్‌ ది రెడ్‌’ అనే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా శానిటేషన్‌ కోసం ఉన్న ఎన్విరాన్‌మెంటల్‌ ఫ్రెండ్లీ మార్గాలను ప్రచారం చేస్తున్నారు. ‘హైజీన్‌ అండ్‌ యు’ అనే వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఆ ఉత్పత్తుల అమ్మకాలు కూడా చేస్తున్నారు. ‘‘ఈ ఉత్పత్తుల అమ్మకాలు ఉన్నాయా? అనే సందేహం కలగొచ్చు మీకు. కాని పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తే ప్రత్యామ్నాయ పద్ధతులకు మారుతున్న విషయం స్పష్టమవుతుంది. మొదట్లో మహిళలు సంప్రదాయ పద్ధతులను తిరస్కరించారు. ప్యాడ్స్‌ పరిశుభ్రతకి సంబంధించిన అంశమే కాకుండా స్టేటస్‌ సింబల్‌గా కూడా భావించడమే ఇందుకు కారణం. అయితే అదేపనిగా బట్ట నాప్‌కిన్‌ వల్ల లాభాలను చెప్పడం, దానిపట్ల ఉన్న అపోహలను తొలగించడంతో నెమ్మదిగా సంప్రదాయ పద్ధతులను ఎంపికచేసుకుంటున్నారు’’ అంటారు ప్రియాంక.
 
అడుగు పడింది...
ఇప్పటికే పర్యావరణహిత ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి ఎన్నో కంపెనీలు. గుజరాత్‌లో అరటి పీచుతో తయారుచేసే సాథీ ప్యాడ్స్‌ ఇందుకో ఉదాహరణ. ఇదొక్కటే కాకుండా ఇతరత్రా కూడా ఎన్నో సంస్థలు డిస్పోజబుల్స్‌కి మల్లే ఉండే బట్ట ప్యాడ్స్‌ను తయారుచేస్తున్నాయి. వీటి ఆకారం, సైజులే కాకుండా ఆకర్షణీయమైన ప్యాకేజీల్లో కూడా లభిస్తున్నాయి. మెనుస్ర్టువల్‌ కప్స్‌, మొక్కల పీచునుంచి తయారవుతున్న ప్యాడ్స్‌ కూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే పట్టణాల్లో ఉండే మహిళలు, విద్యావంతులు సంప్రదాయ శానిటరీ పద్ధతులను ఉపయోగించేందుకు ముందుకొస్తున్నారు. డిస్పోజబుల్స్‌ స్థానంలో క్లాత్‌ ప్యాడ్స్‌ వాడుతున్నారు.
 
ప్రత్యామ్నాయాలు ఉన్నాయి
విశ్వవ్యాప్తంగా రెండు దశాబ్దాలకు పైగా డిస్పోజబుల్‌ శానిటరీ నాప్‌కిన్స్‌ వాడకం చాలా మంచిదని చెవినిల్లు కట్టుకుని పోరుతున్నాయి ఆయా కంపెనీలు. అసలు వీటి తయారీ ఎప్పుడు మొదలైందో తెలుసా 19వ శతాబ్దం చివర్లో. యుఎ్‌సలో వాణిజ్యపరమైన శానిటరీ ప్యాడ్స్‌ను తయారుచేశారు. ఆ తరువాత ఆధునిక మహిళల అవసరార్థం అంటూ డిస్పోజబుల్స్‌ పెద్ద మొత్తంలోనే మార్కెట్లను ముంచెత్తాయి. పూర్వకాలంలో అయితే నెలసరి రోజుల్లో మహిళల్ని బయటికి రానిచ్చేవారు కాదు. ఇంట్లో కూడా వేరుగా కూర్చోపెట్టేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో వాళ్లే ఇంటిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. బయటికి అడుగు పెట్టాల్సి రావడంతో సంప్రదాయ పద్ధతులతో పోల్చినప్పుడు డిస్పోజబుల్స్‌ సౌకర్యంగా, శుభ్రంగా అనిపించడం సహజమే అంటున్నారు వీటిని సపోర్టు చేస్తున్నవాళ్లు. అయితే ఈ వాదనని వ్యతిరేకించే వాళ్లూ అదే సంఖ్యలో ఉన్నారు. సంప్రదాయ పద్ధతిలో వాడే బట్టను ఉపయోగించి ఆధునిక తరహాలో శానిటరీ ప్యాడ్స్‌ను తయారుచేసి వాడొచ్చు వాటికి ప్రత్యామ్నాయంగా అంటారు వీళ్లు.
 
మన జనాభాలో 70 శాతం మందికి శానిటరీ ప్యాడ్స్‌ కొనే స్థోమత లేదు.
తాజాగా జిఎస్‌టిలో కాటుక, బొట్టు, గాజులు, చివరకు కండోమ్స్‌ను కూడా జీరోట్యాక్స్‌ కిందకు తెచ్చారు. కానీ మహిళలకు నిత్యావసరమైన శానిటరీ ప్యాడ్స్‌పై మాత్రం 12 శాతం జిఎస్‌టి విధించడం విమర్శలకు దారితీసింది.