చిన్న పాపకు ‘పెద్ద’ సమస్య.. పదేళ్లు నిండకుండానే పుష్పవతి..!

 

మారుతున్న జీవన శైలి, వాతావరణ కాలుష్యమే కారణం: వైద్యులు
పాల అధిక ఉత్పత్తి కోసం గేదెలకు ఇచ్చే ఇంజక్షన్ల వల్ల చేటు 

 

08-11-2017: ఆడుతూ పాడుతూ బాల్యాన్ని ఆస్వాదించాల్సిన వయస్సులో అమ్మాయిలపై పెద్ద బాధ్యత పడుతోంది. పదేళ్లు కూడా నిండకుండానే పెద్ద మనుషులవుతున్నారు. మారుతున్న జీవనశైలి, కాలుష్యం కారణంగా అనేక శారీరక, మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో నగరంలో ఈ సమస్య ఎక్కువైందంటున్నారు ప్రముఖ వైద్యులు. ఈ నేపథ్యంపై ప్రత్యేక కథనం.
 
ఎనిమిదేళ్ల పాప నాల్గోతరగతి చదువుతోంది. పిల్లలతో కలిసి మెలిసి ఆడుకుంటున్న ఆ చిన్నారిని... ‘ఇది వరకులా నువ్వు చిన్న పిల్లవు కావు, కాస్త జాగ్రత్తగా ఉండు’ అని తల్లి మందలించింది. అమ్మ ఎందుకు అలా చెప్పిందో అర్థం కాలేదు ఆ అమ్మాయికి. తన శరీరంలో కొన్ని మార్పులు జరిగాయని మాత్రమే తెలుసు. అంతకుమించి మరేం తెలియదు. రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మాయి ఎత్తు పెరగడం ఆగిపోయింది. లావు అవుతోంది. పరిస్థితి గమనించిన తల్లి పాపను ఎండోక్రైనాలజీ స్పెషలిస్ట్‌ వద్దకు తీసుకెళ్లింది. పరీక్షించిన ఆయన హార్మోన్ల అసమతుల్యం వల్ల ఇలా జరిగిందని చెప్పారు.
 
ఇరవై ఏళ్ల క్రితం ఆడపిల్లల రజస్వల వయస్సు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలుండేది. ఆ తర్వాత పదమూడు నుంచి పదిహేను ఏళ్లకు తగ్గింది. ప్రస్తుత కాలంలో అమ్మాయిల మెచ్యూరిటీ వయస్సు పదేళ్లకే మొదలవుతోంది. ఆలోచనా విధానం పరిపక్వత చెందకుండానే శరీరం ఎదగడం వల్ల అనేక శారీరక, మానసిక సమస్యలకు గురికావాల్సి వస్తోంది. దీన్నే ఎర్లీ ప్యూబర్టీ కింద పరిగణించాల్సి ఉంటుందంటారు వైద్యులు. శరీరం బరువు సమతౌల్యంగా ఉండి, హోర్మోన్‌ గ్రంథులు సరిగ్గా పని చేసేటప్పుడు మెచ్యూరిటీ అయితే ఎలాంటి సమస్యలూ తలెత్తవు. కానీ ఎర్లీ ప్యూబర్టీతో అనేక సమస్యలకు గురవుతున్నారు.
 
అవే కారణాలు
హార్మోన్ల వ్యవస్థ గతి తప్పడానికి... పదేళ్లలోపే ఆడపిల్లలు పుష్పవతి కావడానికి ప్రధాన కారణం తినే ఆహారమే. ప్రస్తుత నగర జీవితంలో జంక్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌, ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరిగి అది హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. దీనితో పాటు వాతావరణ కాలుష్యం, హైడ్రో, కార్బన్‌ వాయువుల్లో జీన్‌ ఈస్ట్రోజన్స్‌ ఎక్కువగా ఉండటం శరీరంలోని కొన్ని మార్పులకు దారి తీస్తుందని చెబుతున్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్‌ డా. జయంతి రమేష్‌. రసాయన ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు, కల్తీ ఆహారంతో కూడా జీన్‌ ఈస్ట్రోజన్స్‌ శరీరంపై ఎక్కువ ప్రభావాన్ని చూపి ఈ సమస్యకు కారణమవుతోంది. అలాగే అధిక పాల ఉత్పత్తి కోసం గేదెలకు ఆక్సిట్రోసిన్‌ ఇంజక్షన్స్‌ ఇస్తున్నారు. ఆ పాలు తాగడం వల్ల కూడా ఆడపిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ రావడానికి ప్రధాన కారణమవుతోంది.
 
వారి సలహా మేరకు
రజస్వలతో శారీరక మార్పులు సహజం. వారిలో హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఎత్తుపెరగడం ఆగిపోతారు. అంతేకాక ఎముకుల వృద్ధి ఆగిపోతుంది. నెలసరి క్రమంలో రక్తస్రావం కావడంతో రక్తహీనత సమస్య తలెత్తుతుంది. లావు పెరుగుతారు. అంతేకాక రుతుక్రమం గురించి ఆవగాహన లేకపోతే జననేంద్రియ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు గైనకాలజి్‌స్టలు. మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ సమస్య తలెత్తగానే ముందుగా ఎండోక్రైనాలజి్‌స్టను సంప్రదించడం అవసరం. వారు చాలా వరకూ ఎత్తు పెరిగేందుకు... కొన్నిసార్లు వీలైతే ఎర్లీ ప్యూబర్టీని ఆపేందుకు కూడా చికిత్స అందిస్తారు. వారి సలహా మేరకు ఐరన్‌, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువ గలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అలవాటుతో సమస్యను అధిగమించవచ్చు.
 
స్వేచ్ఛా వాతావరణం అవసరం
ప్రస్తుత సమాజంలో సినిమా, ఇంటర్నెట్‌ ప్రభావంతో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశముంటుంది. కొన్ని సార్లు చదువు, ర్యాంకులు అంటూ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. అలాంటి సమయంలో తల్లి అమ్మాయితో స్నేహితురాలిలా మెలగాలంటారు మానసిక వైద్యులు. ప్రతి విషయాన్ని స్వేచ్ఛగా తల్లితో చెప్పగలిగే వాతావరణం ఉండాలి. కొన్ని సార్లు ఈ అమ్మాయిలు లైంగిక హింసను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు సామాజిక వేత్తలు మమతా రఘువీర్‌. తప్పని సరిగ్గా అమ్మాయిలకు పాఠశాలలో, ఇంట్లో గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి అవగాహన కల్పించాలి అని వారు సూచిస్తున్నారు.
 
ఎర్లీ ప్యూబర్టీ అంటే..
పదేళ్లలోపు పుష్పావతి అయితే దాన్ని ఎర్లీ ప్యూబర్టీ అంటాం. ఈ సమస్య పేద, ధనిక లేకుండా అన్ని వర్గాల వారిలోనూ కనిపిస్తోంది. కారణం మారుతున్న జీవనశైలి. దీన్ని నియంత్రించలేం కానీ...కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూడొచ్చు. ఎర్లీ ప్యూబర్టీ వల్ల హార్మోన్‌ వ్యవస్థ గతితప్పి కొన్నిసార్లు మానసిక సమస్యలు తలెత్తడం, రకరకాల ఆకర్షలకు గురికావడం జరుగుతుంది. వారిలో మానసిక విచక్షణా జ్ఞానాన్ని పెంచే దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలి.
- డా. బాలాంబ, ప్రముఖ గైనకాలజిస్ట్‌
 
కల్తీని నిరోధించాలి..
ఇలాంటి సమస్యలకు ప్రధాన కారణమైన కల్తీని నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అమ్మాయి తన అభిప్రాయాలను, రోజూ వారీ విషయాలను స్వేచ్ఛగా చెప్పే వాతావరణం ఇంట్లోనూ, పాఠశాలలోనూ ఉండాలి. తల్లిదండ్రులు ఏది మంచి, ఏది చెడు వారికి వివరించాలి. మానసిక సామర్థ్యాన్ని అమ్మాయిల్లో పెంచగలగాలి. వ్యాయామం అలవాటు చేయాలి.
- డా. రమ, గైనకాలజిస్ట్‌, గాంధీ ఆసుపత్రి