ఒత్తిడి తగ్గిద్దాం ఇలా!

25-07-2017: బడులు తెరిచారంటే చాలు పిల్లలపై ఒత్తిడి తారస్థాయిలో ఉంటుంది. ఇటు హోంవర్కు, అటు ట్యూషన్లు, మరోవైపు స్కూలు, మధ్యలో తోటి క్లాస్‌మేట్స్‌తో గొడవలు... ఇవన్నీ చిన్నారుల్లో ఒత్తిడిని తీవ్రంగా పెంచుతాయి. చిన్నారుల్లో తలెత్తే ఈ రకమైన ఒత్తిడిని తగ్గించే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవి...
పిల్లలు ఏ విషయాలకు బాగా ఒత్తిడికి గురవుతున్నారో తల్లిదండ్రులు అడిగి తెలుసుకోవాలి. పిల్లలు ఎదుర్కొంటున్న రకరకాల సవాళ్లను పరిష్కరించడంలో పెద్దవాళ్లు సహాయపడాలి.
పిల్లలు చెప్పిన సమస్యలు విన్న వెంటనే ఇలా చేయండి....అలా చేయండి అంటూ వాళ్లకి సలహాలు ఇవ్వొద్దు. వారి మనసులోని బాధను, ఒత్తిడిని పూర్తిగా అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాలి. వాళ్ల మాటలను అమ్మానాన్నలు ఓర్పుగా వినాలి.
పిల్లలు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఎంతమేర మార్పుతేగలరో అంత మేర మాత్రం ప్రయత్నించమనాలి. అంతకు మించి వాటి గురించిన ఆలోచనలు దరిచేరనివ్వద్దని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి.
తాము ఇలాంటి ఒత్తిళ్లను గతంలో ఎలా ఎదుర్కొన్నారో కూడా పిల్లలతో పెద్దవాళ్లు ఓపెన్‌గా పంచుకోవాలి.
సమస్యను సులభంగా ఎదుర్కొనేలా ప్రణాళికలను పిల్లలు రూపొందించుకోవాలి. ఒక ప్లాన్‌ సక్సెస్‌ కాకపోయినంత మాత్రాన పిల్లలు డీలా పడొద్దు. రెండవ ప్లాన్‌తో తామెదుర్కొంటున్న సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా కాస్త ఓర్పుగా ప్రయత్నిస్తే ఎలాంటి సమస్యనైనా చిన్నారులు సులువుగా అధిగమించగలరు. ఒత్తిడిని ఢీ కొట్టగలరు.