వైదొలగడమే వైఫల్యం

25-06-2017:తమ పిల్లాడి తత్వాన్ని చూసి కొంత మంది తలిదండ్రులు ‘‘ఇవాళ ఇదంటాడు. రేపు అదంటాడు. వీడు ఏ ఒక్కదాని మీదా నిలకడగా ఉండడు ఏంచేయాలి?’’ అంటూ ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. ఏ తలిదండ్రులకైనా ఇది ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే ఎవరైనా ఏ ఒక్కదాని మీదా నిలకడగా ఉండడం లేదూ అంటే, వాళ్లు వరుస పరాజయాల్ని మూటగట్టుకోవడం ఖాయం. ఎవరినో ఉద్దరించడం మాట అలా ఉంచి ఇలాంటి వాళ్లు తమకు తామే కాకుండా పోతారు. ఎంతటి శక్తివంతుడివైనా కావచ్చు. కానీ, నిలకడగా లేకపోతే ఒక్క విజయమూ నీ చేతికి రాదు. సాటి మనుషుల మధ్య నిన్ను భిన్నంగా, ప్రత్యేకంగా నిలబెట్టేది స్థిరత్వమే. నీ పక్కనున్న వాళ్లు ఒక్కొక్కరే తమ లక్ష్యం నుంచి వైదొలగిపోతుంటే నువ్వు అలాగే నిలబడి ఉండడం ప్రత్యేకతగాక మరేమిటి?

నిజానికి లక్ష్యసాధనలో నిలకడగా ఉంటూ, నువ్వు ఓడిపోయినా అదేమీ సిగ్గుపడాల్సిన విషయం కాదు. ఎందుకంటే ఓటమి తర్వాత కూడా గెలుపు కోసం నీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ పోతే ఏదో ఒక రోజున గెలుస్తావు. ఓటమి ఇక్కడ తాత్కాలిమే. ఓటమిని ఒక సాకుగా తీసుకుని, లక్ష్యం నుంచే వైదొలగితే అది నిజమైన ఓటమి.
విషాదమేమిటంటే చాలా మంది సరిగ్గా విజయాన్ని చేజిక్కించుకునే అతి దగ్గర సమయంలోనే లక్ష్యంనుంచి పక్కకు జరిగిపోతారు. వాళ్లు అలా దగ్గరగా ఉన్నట్లు వారికప్పుడు తెలియకపోవడం కూడా అందుకు కారణం కావచ్చు. కారణమేదైనా పూర్తిగా వైదొలగిపోయాక అప్పుడెప్పుడో ఆ నిజం తెలిసినా ప్రయోజనమేమీ ఉండదు.
పోటీ సమాజంలో శారీరక, మానసికమైన శక్తుల్నీ ఒకే దాని మీద కేంద్రీకృతం చేసినప్పుడే విజయం వరిస్తుంది. అలా కాకుండా శరీరం ఒక చోట మనసు మరో చోట ఉంటే ఓటమే.
లక్ష్యం నుంచి ఎవరైనా వైదొలగుతున్నారంటే వారికి ఆ పని కష్టమనిపించవచ్చు. అయితే ఏ పనైనా అది సులభతరం కావడానికి ముందు కష్టంగా ఉంటుంది. ఆ స్థితిలో పక్కకు జరగకుండా ఉండిపోతే ఆ తర్వాత ఆ పనే ఎంతో తేలికనిపిస్తుంది. ఇష్టమనిపిస్తుంది. దాని మీద ప్రేమ కలుగుతుంది. అప్పుడింక ఆ పని నుంచి వైదొలగాలనుకున్నా మీకు సాధ్యం కాకుండా పోతుంది.న