బెడ్‌రూంలో టీవీతో...

ఆంధ్రజ్యోతి, 10-07-2017: పిల్లల బెడ్‌రూంలో టీవీ అమర్చుతున్నారా!. అయితే, మరోసారి ఆలోచించండి! బెడ్‌రూంలో టీవీ ఉంటే.. పిల్లలు టీవీ చూసే సమయం సహజంగానే పెరుగుతుంది. దీంతో భవిష్యత్తులో వారు ఊబకాయంతో బాధపడే ప్రమాదం ఉంటుంది. ఇది ఆషామాషీగా చెబుతున్నది కాదు. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ (యూసీఎల్‌) పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. ఏడేళ్ల వయసులో తమకంటూ ఓ గది, అందులో టీవీ ఉన్న పిల్లలు పదకొండేళ్లు వచ్చేసరికి ఊబకాయం బారిన పడతారని పరిశోధకులు అంటున్నారు. మిగతా పిల్లలతో పోలిస్తే వీరు అధిక బరువుతో బాధపడతారని పేర్కొంటున్నారు. పిల్లల బెడ్‌రూంలో టీవీ అమర్చడం వల్ల చిన్నారులు ఊబకాయులుగా మారే ముప్పు 20 శాతం పెరుగుతోందని పరిశోధనలో వెల్లడయింది. అందుకే పిల్లల గదిలో టీవీ అమర్చాలనే ఆలోచన ఉంటే మార్చుకోండి. రోజూ నిర్ణీత సమయంలోనే పిల్లలు టీవీ చూసేలా నిబంధన పెట్టండి. ఆడుకోవడానికి కూడా కొంత సమయం కేటాయించండి. అప్పుడే చిన్నారులు ఊబకాయం బారినపడకుండా ఉంటారు.