స్మార్ట్‌ బేబీ కేర్‌!

14-08-2017: హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూషా రెడ్డి - పసిబిడ్డల ఆరోగ్యానికి సంబంధించి ‘నిమో బేబీవేర్‌’ను రూపొందించారు. ‘నిమోకేర్‌’ అనే హెల్త్‌స్టార్టప్‌ ప్రారంభించిన ఆమె తాము తయారుచేసిన ఈ ‘స్మార్ట్‌’ పరికరం గురించి తన బృంద సభ్యులతో కలిసి ‘నవ్య’తో ఇలా పంచుకున్నారు.
 
‘‘నెలలు నిండకముందే పుట్టిన పిల్లలనూ, పలు ఆరోగ్య సమస్యలతో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉండే పసివాళ్లనూ ప్రతీ క్షణం మానిటర్‌ చేసే పరికరం ఇది. దీని గురించిన వివరాల్లోకి వెళ్లే ముందు నా గురించి కొంత చెప్పాలి. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. బేగంపేటలోని ‘హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌’లో చదివా. అమ్మానాన్న ఇద్దరూ డాక్టర్లు. అందుకే కాబోలు వాళ్లు నేను డాక్టర్‌ చదివితే బాగుండనుకునేవాళ్లు. నాకు మాత్రం ఇంజినీరింగ్‌ చదవాలనిపించింది. నా నిర్ణయానికి విలువనిచ్చి వాసవి కాలేజీలో ఇంజనీరింగ్‌ చదివించారు. ఆ తరువాత అహ్మదాబాద్‌లోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌’(ఎన్‌ఐడి)లో చేరాను. అది పూర్తయ్యాక కొన్నాళ్లు డిజైనింగ్‌ కన్సల్టింగ్‌ సంస్థల్లో పనిచేశాను. సొంతంగా ఓ డిజైనింగ్‌ కన్సల్టెన్సీ సంస్థ కూడా నడిపాను. బ్రిటన్‌లో పనిచేశాను. ఆ తరువాత హైదరాబాద్‌లోని ఐఐటిలో ‘సెంటర్‌ఫర్‌ హెల్త్‌కేర్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ’లో ఫెలోషిప్‌ ప్రోగ్రాంలో చేరాను.
 
పూర్వానుభవంతో...
గత సంవత్సరం నుంచి ఆ ప్రోగ్రాంకి సంబంధించిన పనిచేస్తున్నాను. నాతోపాటు ఈ ఫెలోషి్‌పలో ఉన్న మనోజ్‌ కూడా ఇదే విషయం మీద పనిచేస్తున్నాడు. అందులోభాగంగా మేమిద్దరం కలిసి ఆరునెలల పాటు హాస్పిటల్స్‌కి వెళ్లి డాక్టర్‌, పేషెంట్‌ల సమస్యలు, వాళ్ల అవసరాల గురించి లోతుగా విశ్లేషించాం. హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్స్‌, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ర్టో ఎంటరాలజీలతో పాటు మహబూబాబాద్‌, సంగారెడ్డి, వరంగల్‌లోని హాస్పిటల్స్‌కి వెళ్లి పరిశోధించాం. ఈ జర్నీలో 600 సమస్యల వరకు గుర్తించాం.
 
వీటన్నింటికీ ఇన్నోవేషన్‌ డివైస్‌లు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఆ సమస్యలన్నింటిలో నుంచి మాకున్న పరిధిలో నియో నేటల్‌, మెటర్నరీ వ్యవస్థలను ఎన్నుకున్నాం. అదీకాకుండా నాకు, మనోజ్‌కి మెటర్నల్‌ మానిటరింగ్‌ హెల్త్‌ విషయంలో పూర్వానుభవం ఉంది. అతను ఆటిస్టిక్‌ పిల్లల భావోద్వేగాలను ముందుగానే గుర్తించే పరికరాన్ని ఒకదాన్ని తయారుచేశాడు. నేను ఎన్‌ఐడిలో ఉండగా గ్రామాల్లో గర్భిణులకు నొప్పులు వచ్చినప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్లడంలో ఉన్న ఇబ్బందులు గమనించాను. వాళ్లకి ఉపయోగపడేలా ప్రత్యేకంగా స్ర్టెచర్‌ తయారుచేశాను. ఇప్పుడు నియో నేటల్‌ కేర్‌ ఎంపికచేసుకోవడంలో ఆ అనుభవాలు మాకు తోడయ్యాయి.
 
ఎలా పనిచేస్తుందంటే...
నియో బేబీకేర్‌ పరికరం తయారుచేయాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచీ దానికో రూపు తెచ్చేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది. మా ఫెలోషిప్‌ ప్రోగ్రాం జూలైలో పూర్తయ్యింది. అయినప్పటికీ ఐఐటి వాళ్లు టెక్నాలజీ పరంగా మాకు కావాల్సిన సాయం అందిస్తున్నారు. ఈ పరికరం పనితీరును పరిశీలించాం. ఫలితాలు తెలుసుకున్నాక పరికరాన్ని మెరుగుపరిచే పని నడుస్తోందిప్పుడు. ఈ పరికరంలో ఉండే చిప్‌ సైజ్‌ను ఇంకా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. అత్యవసర సేవలు అవసరమైన బేబీ పాదానికి ఈ పరికరాన్ని బ్యాండ్‌ ఎయిడ్‌లా అమర్చాలంతే... గుంపులు గుంపులుగా వైర్లు అమర్చక్కర్లేదు. నర్సింగ్‌ స్టేషన్‌లో ఉన్న నర్సులకి అక్కడున్న మానిటర్లలో బేబీ పరిస్థితి తెలిసిపోతుంది. పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించినా బేబీ పాదానికి ఉన్న డివైస్‌లో అలారమ్‌ మోగుతుంది. ఐసియుల్లో, వార్డుల్లో ఉండే పసివాళ్ల ఆరోగ్యావసరాలను తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
 
 
అప్పుడు మార్కెట్‌లోకి తెస్తాం
మా కుటుంబంలో అందరూ డాక్టర్లు కావడం వల్ల ఈ ఫెలోషిప్‌లో ఎంతో చేయూత లభించింది. మా సందేహాలు వెంటవెంటనే తీర్చుకోగలిగాం. నేను, మనోజ్‌ ఇద్దరం మెడికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌కి చెందిన వాళ్లం కాదు. ఇంజినీర్‌, మెడిసిన్‌ కలిపి పనిచేసేందుకు అవరోధాలు ఎరుదయ్యాయి. కాకపోతే పట్టుదలగా ముందుకెళ్లడం వల్ల అనుకున్నది సాధించగలుగుతున్నాం. ప్రారంభంలో చేయగలమా? లేదా? అని అనుమానం ఉండేది.
 
అంతెందుకు నెలక్రితం కూడా దీన్ని అంగీకరిస్తారా? మాన్యుఫాక్చరింగ్‌ చేయగలుగుతామా? నిధులు లభిస్తాయా? అనే అనుమానాలు ఉండేవి. అలా అనిపించినప్పుడల్లా మా టీంలో ఒకరికొకరం ప్రోత్సాహం ఇచ్చుకుంటూ ముందుకు కదిలాం. పూర్తిగా తయారయ్యాక క్లినికల్‌ ట్రయల్స్‌ చేయాలి. అది చేశాక డేటా అంత ఒక దగ్గర చేర్చి డాక్యుమెంటేషన్‌ చేసి అనుమతులు తీసుకోవాలి. 2020 ప్రారంభం కల్లా హాస్పిటల్స్‌లో దీన్ని అందుబాటులో తేవాలనేది మా లక్ష్యం’’ అంటోంది ప్రత్యూషా రెడ్డి.
 
‘‘నా గ్రాడ్యుయేషన్‌ తరువాత బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో కొన్నాళ్లు పనిచేశాను. ఆ తరువాత ఫెలోషిప్‌ ప్రోగాంలో చేరాను. నేను, ప్రత్యూష ఒకటే బ్యాచ్‌. ఈ పనిచేయడం ఎగ్జైటింగ్‌గా ఉంది. మార్కెట్‌లో పోటీదార్లను దృష్టిలో ఉంచుకుని వాటికంటే భిన్నంగా తయారుచేస్తున్నాం.’’
                                                                                                                                                                                                             - మనోజ్‌
 
‘‘నేను మెకానికల్‌ ఇంజనీర్‌. రెండు నెలల నుంచి నిమో బేబీకేర్‌ డివైస్‌ తయారీలో పనిచేస్తున్నా. ఇంతకు ముందు నేను మెషినరీ డిజైనింగ్‌కి సంబంధించిన వర్క్‌ చేశాను. ఇప్పుడు లైఫ్‌ సేవింగ్‌ డివైస్‌ తయారీలో భాగం కావడం ఆనందంగా ఉంది. ఆ డివైస్‌ ఎలా ఉండాలి? ఏ మెటీరియల్‌తో చేయాలి? ఏ మెటీరియల్‌తో చేస్తే బేబీ కాలి చర్మానికి ఏమీ కాకుండా ఉంటుంది? అనే విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను’’
                                                                                                                                                                                                                - శరత్‌
 
‘‘ఇంజనీరింగ్‌ చేశాక సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ రంగంలోకి వచ్చాను. ప్రొడక్ట్‌ డెవలప్‌ చేయాలంటే మొదట వినియోగదారుడిని అర్థం చేసుకోవాలి. ఆ పనిలో చాలా విషయాలు తెలుసుకుంటున్నాను.’’
                                                                                                                                                                                                                 - కీర్తన