బొడ్డు తాడు గురించి షాకింగ్ నిజాలు

మొండి రోగాల చికిత్సకు మూల కణాలే ఆధారం
21 సంవత్సరాలు, 75 సంవత్సరాలు నిల్వ చేసుకునే అవకాశం
ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్న కంపెనీలు
వరంగల్‌లోనూ ముందుకు వస్తున్న తల్లిదండ్రులు

ఒకప్పుడు ఎందుకూ పనికిరానిదిగా భావించిన బొడ్డు తాడు.. ఇప్పుడు అత్యంత జీవరహస్యాల నిధిగా గుర్తింపు పొందింది. పిల్లలకు భవిష్యత్తులో ప్రమాదకర జబ్బులను నయం చేసేందుకు అవసరమైన మూలకణాలు బొడ్డుతాడులో దాగి ఉన్నాయని వైద్యులు గుర్తించారు. దీంతో బొడ్డుతాడు నిల్వ చేసుకునేందుకు తల్లి దండ్రులు ముందుకు వస్తున్నారు. ఇందుకోసం నిల్వ చేసుకునే కంపెనీలు ప్రత్యేక ప్యాకేజీలను కూడా అందిస్తున్నాయి. 21 సంవత్సరాల వయస్సు వరకు ఒక ప్యాకేజీ, 75 సంవత్సరాల వయస్సు వరకు మరో ప్యాకేజీని అందిస్తున్నారు. మొదటి ప్యాకేజీలో రూ. 55 వేలు, 75 సంవత్సరాల ప్యాకేజీకి రూ. 71 వేలు తీసుకుంటున్నారు. వరంగల్‌ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే మూలకణాల నిల్వకు ఆదరణ పెరుగుతోంది.

 
వరంగల్‌ అర్బన్‌, 22-07-2018: ఆధునిక వైద్యవిధానంలో బొడ్డుతాడు అపురూప లక్షణాలున్న జీవరహస్య నిధి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎన్నో జబ్బుల చికిత్సకు బొడ్డుతాడు పాశుపతాస్త్రంగా మారుతోంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పసిపాపకు బొడ్డు తాడు ద్వారానే ఆహారం అందుతుంది. 9 నెలల వరకు ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుంది. తల్లి గర్భం నుంచి భూమి మీద పడినప్పుడు తల్లీబిడ్డల పేగు బంధం తెగిపోతుంది. మంత్రసానిల నుంచి వైద్యుల వరకు బొడ్డుతాడు ఎందుకు పనికి రాని పేగు ముక్కగా భావించి కత్తిరించి పారేసేవారు.
 
అయితే అనేక పరిశోధనల ఫలితంగా బొడ్డుతాడు ఎందుకు పనికి రాని మాంసపు ముక్క కానే కాదు.. జీవ రహస్యం దాగి ఉన్న అమృతభాండం అని తేలింది. పిల్లలకు భవిష్యత్తులో ప్రమాదకర జబ్బులను నయం చేసేందుకు అవసరమైన మూలకణాలు బొడ్డుతాడులో దాగి ఉన్నాయని గుర్తించారు. దీంతో బొడ్డుతాడు నిల్వ చేసుకునేందుకు తల్లి దండ్రులు ముందుకు వస్తున్నారు. ఇందుకోసం నిల్వ చేసుకునే కంపెనీలు ప్రత్యేక ప్యాకేజీలను కూడా అందిస్తోంది.
 
జీవరహస్యం..
బొడ్డు తాడు భవిష్యత్‌ తరాలకు అపూరూప ఔషధ గని అని తేలింది. ఎన్నో ఏళ్ళుగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో బొడ్డుతాడు విలువ తెలిసి వచ్చింది. ఎన్నో జబ్బులకు చికిత్స అందించేందుకు అపురూప కానుక అని వైద్యులు తెలుసుకున్నారు. బొడ్డు తాడులో రెండు రకాల మూల కణాలు ఉంటాయి. అవి మిసైన్‌కైమల్‌ స్టెమ్‌ సెల్స్‌, ఎపిథీలియల్‌ స్టెమ్‌ స్టెల్స్‌ గా ఉంటాయి. మిసైన్‌ కైమల్‌ స్టెమ్‌ సెల్స్‌ ద్వారా మూలుగ, ఎముకలు, గుండెనరాలు, కొవ్వు సంబంధిత జబ్బులను నయం చేసే మూల కణాలు ఉంటాయి. అదేవిధంగా లివర్‌, పాంక్రియాస్‌, జీర్ణవాహిక సంబంధ క్యాన్సర్‌ జబ్బులకు చికిత్సకు ఉపయోగించే మూలకణాలు ఉంటాయి. ఎపీథీలియల్‌ కణాల్లో మాత్రం చర్మ సంబంధిత జబ్బులు నయం చేసే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 81 రకాల జబ్బులకు ఈ మూలకణాల చికిత్స ద్వారా నయం చేయవచ్చని వైద్యనిపుణులు తేల్చారు. పెద్ద వయస్సులో వచ్చే పార్కిన్‌సన్‌, అల్జీమర్స్‌, మల్లిపుల్‌ సిలోయారిసిస్‌, మెదడు సంబంధిత జబ్బులు రెక్టమ్‌ క్యాన్సర్‌ లాంటి 19 రకాల జబ్బులకు చికిత్స మాత్రం క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది.
 
నిల్వ చేసుకునేదెట్లా..
బొడ్డుతాడులో దాగిన మూల కణాలు కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగపడుతాయి. మూలకణాలు నిల్వ చేసుకున్న వ్యక్తికే కాకుండా రక్తం పంచుకుని పుట్టిన కుటుంబ సభ్యులకు వచ్చిన జబ్బులకు కూడా ఈ మూలకణాల ద్వారా చికిత్స అందించే అవకాశాలు ఉన్నాయి. బొడ్డుతాడు నిల్వ చేసుకునే సంస్థలు అత్యాధునిక పరికరాలతో కోల్‌కతా, ముంబాయి, ఢిల్లీ లాంటి మహానగరాల్లో లాబోరేటరీలను ఏర్పాటు చేశాయి. దేశ వ్యాప్తంగా సేకరించిన బొడ్డుతాడు మూల కణాలను ఇక్కడ నిల్వ చేస్తారు. వరంగల్‌ జిల్లాలో కార్డ్‌ లైఫ్‌, క్రయోవివా, లైఫ్‌ సెల్‌ అనే మూడు సంస్థలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఈ సంస్థల ప్రతినిధులు వైద్యుల ద్వారా గర్భిణి ఆమె భర్త, కుటుంబ సభ్యులను కలిసి బొడ్డు తాడును నిల్వ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తారు.. చట్టబద్దమైన ఒప్పందం కుదుర్చుకుంటారు. ప్రసూతి సమయంలో ఈ సంస్థల ప్రతినిధులు అక్కడికి చేరుకుని బొడ్డుతాడును సేకరించేందుకు ప్రత్యేకమైన పరికరంలో సేకరిస్తారు. లేదంటే తమ వద్ద రిజిష్ట్రేషన్‌ చేసుకున్న వారికి ముందస్తుగా ప్రత్యేకమైన ఎమర్జెన్సీ కిట్‌ను అందిస్తారు. దీంతో వైద్యులు బొడ్డుతాడు అందులో నిల్వ చేస్తారు.
 
రెండు రకాల ప్యాకేజీ..
బొడ్డుతాడు మూలకణాల నిల్వ కోసం సంస్థలు రెండు రకాల ప్యాకేజీలను అందిస్తున్నాయి. 21 సంవత్సరాల వయస్సు వరకు ఒక ప్యాకేజీ, 75 సంవత్సరాల వయస్సు వరకు మరో ప్యాకేజీని అందిస్తున్నారు. మొదటి ప్యాకేజీలో రూ. 55 వేలు, 75 సంవత్సరాల ప్యాకేజీకి రూ. 71 వేలు తీసుకుంటున్నారు. ధరలకు సంబంధించి ఒక్కో కంపెనీ వారు ఒక్కో విధంగా తీసుకుంటున్నారు. ఈ ప్యాకేజీలకు దాదాపు రూ.45లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు.
 
ప్రజలు ముందుకు వస్తున్నారు
సంపన్న వర్గాలే కాదు.. మధ్య తరగతి ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు, విద్యావంతులైతే బొడ్డుతాడు నిల్వకు ముందుకు వస్తున్నారు. వరంగల్‌ నగరంలోనే కాదు, జనగామ, మహబూబాబాద్‌, భూపాలపల్లి, వరంగల్‌ రూరల్‌ జిల్లాల నుంచి కూడా ముందుకు వస్తున్నారు. గత నాలుగేళ్ళల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే దాదాపు 400 బొడ్డుతాడు మూలకణాలను సేకరించాం. ఆర్థిక భారం అనుకునే వారికి వాయిదాల సౌకర్యం కూడా ఉంది.
- జి.జగన్‌మోహన్‌, కార్డ్‌ లైఫ్‌ సంస్థ ప్రతినిధి, వరంగల్‌
 
స్టెమ్‌సెల్స్‌తో దీర్ఘకాలిక రోగాలకు చెక్‌

దీర్ఘకాలిక రోగాలను బొడ్డుతాడు మూలకణాలతో నయం చేసే అవకాశం ఉంది. బొడ్డుతాడు మూలకణాల సేకరణ వరంగల్‌లో కూడా కొనసాగుతోంది. చాలామంది స్టెమ్‌సెల్స్‌ బ్యాంకు కోసం అడుగుతున్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి వందకు పైగా బొడ్డుతాడు మూలకణాలను తీసి సంబంధిత బ్యాంకులకు తరలించాం. ఇది తల్లిదండ్రుల ఇష్టం మేరకు స్టెమ్‌సెల్స్‌ బ్యాంకుల్లో ముందుగా నమోదు చేసుకొని మమ్ములను సంప్రదిస్తున్నారు. ఇప్పుడు నెలకు ఒకటి రెండు చొప్పున డెలీవరిల సమయంలో స్టెమ్‌సెల్స్‌ను సేకరించి వారికి అప్పగిస్తున్నాం. 

- డాక్టర్‌ సంధ్యారాణి, గైనకాలజిస్టు, లక్ష్మీనర్సింహా హాస్పిటల్‌, నయీంనగర్‌