తల్లి బరువు బిడ్డకు చేటు

10-08-2017: నిజమే అంటున్నారు స్వీడన్‌ పరిశోధకులు. తల్లికాబోయే స్త్రీలు అధికబరువు ఉంటే పుట్టబోయే పిల్లల్లో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వీరు చెబుతున్నారు. ఎక్కువ బిఎంఐ కలిగి ఉండే గర్భవతులకు పుట్టే పిల్లల్లో 3.5 శాతం పుట్టుకతోనే ఆరోగ్యసమస్యలు రావచ్చన్న విషయం వీరి పరిశోధనలో వెల్లడైంది. దాదాపు పన్నెండులక్షల మంది గర్భవతుల మీద వీరు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. వీరిలో చాలా మంది గర్భవతులు ఉండవలసిన బరువు కన్నా అధికబరువుకలిగి ఉన్నారు. వీరికి పుట్టిన పిల్లలకు గుండె సంబంధిత సమస్యలు, కాళ్ళు, చేతుల్లో అవకరాలు, జీర్ణ వ్యవస్థ పూర్తిగా ఎదగకపోవడం వంటి సమస్యలను గుర్తించారు. తల్లి అధికబరువు కారణంగానే పిల్లల్లో ఈ సమస్యలు తలెత్తాయా? అన్న విషయం మీద వీరు ఇంకా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.