ఆ ఈడును పసిగట్టేదెలా?

19-06-2018: డాక్టర్‌ మా పాపకి 14 ఏళ్లు. ఇప్పటి వరకూ రజస్వల కాలేదు. అవయవాల్లో ఎదుగుదల కూడా కనిపించట్లేదు. బరువు కూడా పెరుగుతోంది. పాపకు హార్మోన్ల అసమతౌల్యం ఉండి ఉంటుందా?                                              

- వైదేహి, హైదరాబాద్‌.

 
సాధారణంగా 14 ఏళ్ల వయసు నుంచి పిల్లల్లో యువ లక్షణాలు కనిపించడం మొదలు పెడతాయి. ఈ వయసు నుంచే హార్మోన్ల స్రావాలు చురుకుగా విడుదలవుతూ ఉంటాయి. కాబట్టే టీనేజీ వయసుకు చేరుకున్న పిల్లల్లో శారీరక మార్పుల స్పష్టంగా కనిపించడం మొదలు పెడతాయి. మగ పిల్లల్లో గుప్తాంగాలు పెరగడం కనిపిస్తే, ఆడపిల్లల్లో ప్యూబిక్‌ హెయిర్‌ మొదలవుతుంది. అయితే ఇలాంటి లక్షణాలకు బదులు మగ పిల్లల్లో గుప్తాంగాలు ఎదగకుండా ఉండిపోయినా, రొమ్ములు పెరుగుతున్నట్టు కనిపించినా వాళ్లల్లో హార్మోన్ల లోపం ఉందని గ్రహించాలి. ఆడ పిల్లల్లో ముఖం మీద వెంట్రుకలు పెరుగుతున్నా, రొమ్ములు ఎదగకపోయినా, రజస్వల కాకపోయినా, అవసరానికి మించి బరువున్నా హార్మోన్ల లోపమనే అనుకోవాలి. ఇలాంటి పిల్లలు హుషారుగా ఉండరు. ఎక్కువ సమయంపాటు విశ్రాంతిలో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ బలవంతంగా ఆటలు ఆడించే ప్రయత్నం చేసినా ఆడడానికి ఇష్టపడరు. ఇలాంటి లక్షణాలు 14 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కుల్లో కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. వైద్య పరీక్షల్లో థైరాయిడ్‌, ఇతర యాండ్రోజెన్‌ హార్మోన్ల లోపం ఉందని తేలితే, వాటిని సరిదిద్దడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చు. అయితే హార్మోన్‌ సంబంధ సమస్యలను ఎంత త్వరగా గుర్తించి, చికిత్స చేస్తే పిల్లలు అంత త్వరగా కోలుకుని తోటి పిల్లల్లా ఆరోగ్యంగా ఎదుగుతారు. అలాకాకుండా హార్మోన్‌ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఎత్తు పెరగకపోవడం, మరీ ముఖ్యంగా ఆడ పిల్లలు రజస్వల కాకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
డాక్టర్‌. రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌, ఆండ్రో కేర్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.