పిల్లలతో సఖ్యంగా!

31-10-2017: పిల్లలతో నాణ్యమైన సమయం గడిపినప్పుడే వాళ్ల మనసుల్లో ముద్ర వేసుకోగలుగుతాం. ఆ సమయాన్ని ఎప్పుడు, ఎలా, ఎంత గడపానేది తల్లితండ్రులే నిర్ణయించుకోవాలి. అందరు తల్లితండ్రులూ ఈ కింది పద్ధతులు పాటిస్తే పిల్లలతో మెరుగైన అనుబంధాన్ని పెంపొందించుకోవచ్చు.

ప్రతి రాత్రి పడుకోబోయేముందు పిల్లలతో కొద్దిసేపైనా దగ్గరగా గడపాలి. ఎంతటి ముఖ్యమైన పనులున్నా, ఎన్ని చికాకులున్నా, ఎంత అలసిపోయి ఉన్నా, పిల్లల దగ్గరెళ్లి ఆప్యాయంగా హత్తుకోవాలి. నవ్వుతూ పలకరించాలి.
పసి పిల్లలైతే కథలు చదివి వినిపించాలి. పెద్ద పిల్లలైతే ఆ రోజు వాళ్ల రోజెలా గడిచిందో అడిగి తెలుసుకోవాలి. అలాగే మీ రోజులో జరిగిన ముఖ్య సంఘటనల గురించి పిల్లలతో చెప్పొచ్చు. అయితే చెప్పే విషయాలు పిల్లల్లో ఆందోళనను కలిగించేలా ఉండకూడదు. నవ్వు తెప్పించే విషయాలు, సంఘటనలు, సక్సెస్‌ల గురించి చెప్పొచ్చు.
ఎలాంటి అంశాల గురించి మాట్లాడినా, పిల్లల పట్ల మీరు ప్రేమ, ఆప్యాయతలు చూపించారనే భావనతో వాళ్లు నిద్రలోకి జారుకునేలా ఉండాలి.
 పిల్లల్ని దగ్గరకి తీసుకునే విషయంలో హద్దులు విధించుకోకూడదు. రోజులో కనీసం ఒక్కసారైనా ఆప్యాయంగా గుండెలకు హత్తుకోవటం, చేతులు చేతుల్లోకి తీసుకోవటం, భుజం మీద చేయి వేయటం లాంటి చిన్న చిన్న జెస్చర్స్‌ తప్పనిసరిగా అనుసరించాలి. మాటల్లో చెప్పటం కంటే ఇలాంటి చర్యల ద్వారా ప్రేమను వ్యక్తం చేయటాన్ని పిల్లలు ఇష్టపడతారు.