బేబీ వాకర్లు వద్దు

31-08-2017: పిల్లలకి నడక వచ్చే సమయంలో వారికి వాకరు అలవాటు చేస్తారు తల్లిదండ్రులు. వారు అందులో కూర్చుని ఇల్లంతా తిరుగుతుంటే చూసి మురిసిపోతారు. తల్లిదండ్లుకీ ఆనందాన్నీ పిల్లలకి సౌకర్యాన్ని అందించే ఈ వాకరు అంత మంచిది కాదు అంటున్నారు అధ్యయనకారులు. పిల్లలకి వాకరు అలవాటు చేయడం వలన వారిలో ఎదుగుదల తగ్గిపోతుందని వీరు చెబుతున్నారు ఇంగ్లాండ్‌ పరిశోధకులు. దాదాపు 190 మంది చిన్నారుల మీద వీరు అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరిని వాకరులో తిరగనిచ్చారు. మరికొందరికి వాకరు ఇవ్వలేదు. కొన్ని నెలల అనంతరం ఈ పిల్లల ఎదుగుదలను గమనించారు. వాకరు వాడని పిల్లలు త్వర త్వరగా కూచోవడం, నిలబడడం, నడవడం నేర్చుకుంటే వాకరు ఉపయోగించిన పిల్లలు పై మూడు విషయాల్లో వెనుకపడ్డారు. దీనికి కారణం వారిని వాకరులో కూచోపెట్టడమే అని అంటున్నారు అధ్యయనకారులు. పిల్లలు అన్ని విషయాలను స్వతాహాగా నేర్చుకున్నప్పుడే వారిలో ఎదుగుదల సక్రమంగా ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.