పొద్దుపొద్దున్నే అలా ఎందుకు?

ఆంధ్రజ్యోతి, 17-07-2018: ఉదయం వేళల్లో పసిమనసులు గాయపడకుండా అత్యంత సున్నితంగా వ్యవహరించాలి. నిద్రలేపడం వెనుక మంచి ఉద్దేశమే ఉండవచ్చు. కానీ, ఆ ఉద్దేశం వాళ్ల గుండెల మీద ఈటెలా దిగిపోకూడదు.
 
చల్లగాలి, ఆకుల గలగలలూ, పక్షుల కిలకిలా రావాలు.... పొద్దుపొద్దున్నే ఇవన్నీ ఆస్వాదించే అవకాశాలు ఈ రోజుల్లో ఎందరికి ఉన్నాయిలే గానీ, కనీసం ఆ వేళ ప్రేమగా పలకరించేవాళ్లయినా ఉండాలి. కానీ, జరుగుతున్నదేమిటి...? ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లల విషయంలో ఏం జరుగుతోంది? ‘‘స్కూలుకు టైమైపోతోంది. ఇంకెప్పుడు లేస్తావు? రోజూ లేపేదాకా లేవవా?’’ ఇలాంటి ఈసడింపు మాటలు అందరి చెవుల్లోకి జొరబడుతూ ఉంటాయి. అంతవరకే అయితే ఫరవాలేదు. కొందరు పేరెంట్స్‌ అయితే చాలా పరుషంగా మాట్లాడతారు. ‘‘ఒరే అడ్డగాడిదా! టైమెంత అవుతోంతో తెలుస్తోందా నీకు? ఇక లాభం లేదు. మాటలతో నువ్వు మారేలా లేవు. రేపటి నుంచి టైముకు లేవకపోతే ఇక తన్నులే!’’ ఇలా మాట్లాడేస్తూ ఉంటారు. పైకి ఇవి మాటలే గానీ, వాటిని వింటున్న పిల్లలకు కర్రతో బాదుతున్నట్లే అనిపిస్తుంది.
 
నిజానికి, ఉదయం అనేది ఎవరికైనా, ఎంతో కొంత హాయిగొలిపేదిగానే ఉండాలి. ఆ తర్వాత పగలంతా ఎలానైనా గడవనీ, ఆ పొద్దుటి వేళ మాత్రం ప్రశాంతంగా మొదలవ్వాలి. ఆ ఉద్దేశంగానే కొందరి నోట ‘ఆరంభం అందంగా ఉండాలి’ అనే మాట తరుచూ వినబడుతూ ఉంటుంది. అందంగా అంటే, ఆనందంగా, ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఇలా ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు. ఉదయం అలా మొదలైతే, మిగతా వేళల్లో పరిస్థితులు అందుకు భిన్నంగానే ఉన్నా, మనసు తట్టుకోగలుగుతుంది అనేది ఒక ఆలోచన. అలా కాకుండా పొద్దుపొద్దున్నే మనసు డిస్టర్బ్‌ అయిపోతే, ఆ తర్వాత ఆ విషయమే రోజంతా మనసును వెంటాడతూ ఉంటుంది. ఆ తర్వాత ఆహ్లాదకరమైన విషయాలను ఆస్వాదించే స్థితిలో మనసు ఉండదు. పిల్లల విషయాన్నే తీసుకుంటే, పొద్దుపొద్దున్నే హర్ట్‌ అయిన ఫలితంగా, క్లాసులో పాఠం వారి మనసుకు ఎక్కదు.
 
అందుకే ఉదయం వేళల్లో పసిమనసులు గాయపడకుండా అత్యంత సున్నితంగా వ్యవహరించాలి. నిద్రలేపడం వెనుక మంచి ఉద్దేశమే ఉండవచ్చు. కానీ, ఆ ఉద్దేశం వాళ్ల గుండెల మీద ఈటెలా దిగిపోకూడదు. ఏదైనా చెబితే వాళ్లకు అప్పటిదాకా తెలియని కొత్త విషయాలను వాళ్ల ముందు ఉంచాలి. అవి కనువిప్పు కలిగించేలా ఉండాలి. ఆలస్యంగా స్కూలుకు వెళితే కలిగే నష్టమేమిటో, సగం పాఠం చెప్పేసాక క్లాసులోకి వెళితే ఆ పాఠాన్ని అర్థం చేసుకోవడంలో ఎంత ఇబ్బంది ఎదురవుతుందో వారికి స్పష్టంగా బోధపడేలా చెప్పాలి. ఇలాంటి మాటల వల్ల ఆలస్యం ఎన్ని రకాల నష్టాలకు గురిచేస్తుందో బోధపడుతుంది. ఆ తర్వాత వాళ్లను ‘ఈ రోజు స్కూలు ఆలస్యంగా వెళ్లవచ్చులే!’ అని చెప్పినా, ‘ఈ రోజు స్కూలుకు వెళ్లడం మానేసెయ్‌’ అని చెప్పినా వారు ఆ పనిచేయరు. అందువల్ల ఉదయం వేళల్లో నిద్ర లేపేందుకు కసురుకోవాల్సిన అవసరం దాదాపు ఎప్పుడూ రాదు. ఏమైనా పిల్లల ఉదయాలు, ఆహ్లాదంగా, ప్రశాంతంగా మొదలయ్యేలా చూడటం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావించాలి.