ఎంత సున్నితమో తెలియాలి!

ఆంధ్రజ్యోతి, 10-07-2018: సున్నిత మనస్తత్వం ఉన్న పిల్లల విషయంలో కనిపించే పరిష్కారమల్లా తల్లితండ్రులు వారి సున్నితత్వాన్ని పసితనంలోనే గుర్తించడం. ఏదైనా తప్పు చేసినా, అందరు పిల్లల్లా వారిపట్ల కఠినంగా వ్యవహరించడం, చేయకూడదు.
 
పిల్లల్లో చాలావరకు ఏ విషయాన్నయినా ఇట్టే మరిచిపోయే స్వభావం ఉంటుంది. కొంత మంది పిల్లలు మాత్రం ఎవరైనా కొట్టడమో, తిట్టడమో చేస్తే, వారాలు, నెలలూ కాదు ఏళ్లు గడిచినా మరిచిపోరు. అదొక ట్రామాలా వారి మనసులో ఉండిపోతుంది. అదేదో బయటి వాళ్లు అయితేనే అని కాదు, తల్లితండ్రులు, తోబుట్టువుల విషయంలో కూడా అంతే పట్టింపుగా ఉంటారు. కొద్ది రోజుల దాకా కొంత మౌనంగానే ఉండి, ఆ తర్వాత మాట్లాడవచ్చు. మనసులో ఆ విషయం తాలూకు ఛాయలే లేనట్లు అనిపించవచ్చు. కానీ, ఆ గాయం వారిలో అలాగే ఉంటుంది. లోలోపల రగులుతూనే ఉంటుంది. దీనికి తోడు, అంతకు ముందులా ఎవరితోనూ కలుపుగోలుగా ఉండరు. ఏదో బిగదీసుకుపోయినట్లు ఉంటారు.
 
అయితే నిశితంగా గమనించే వారికి ఆ తేడాలన్నీ తెలిసిపోతూనే ఉంటాయి. ఇదంతా గమనించిన తల్లితండ్రులు వాళ్ల సంతోషం కోసం స్వీట్లు, ఏవైనా గిఫ్ట్‌లు తెచ్చారే అనుకోండి. వాటన్నింటికీ పాజిటివ్‌గా స్పందించినట్లే కనిపిస్తారు. కానీ, అదంతా పైపైనే. లోపల ఉండే బాధ లోపల ఉండే ఉంటుంది. ఇలాంటి పిల్లలకు కొంతమంది, కుటిలులు, కపటులు అని పేరు పెట్టేస్తారు.
 
నిజానికి, వీళ్లల్లో సహృదయతకు ఏమీ లోటు ఉండదు. పైగా విషయాలను చాలా లోతుగా పరిశీలించే స్వభావం ఉంటుంది. ప్రవర్తన విషయంలో కూడా గాయం చేసిన ఆ ప్రత్యేక వ్యక్తుల విషయంలో తప్ప మిగతా వారందరితోనూ మామూలుగానే ఉంటారు. చాలా అరుదుగా మాత్రమే కొందరు ఆ వయసున్న వారందరి పట్లా, ఎడమొహంగా ఉండిపోతారు. ఈ పరిణామాల ఫలితంగా, ఇలాంటి కొంతమంది పిల్లల్లో చిన్న వయసులోనే పెద్దవాళ్లంటేనే ద్వేషం, ఒక రకమైన ఏవగింపు ఏర్పడతాయి. వీళ్లు ఒకరకమైన డిప్రెషన్‌లో ఉండిపోతారు.
 
ఈ స్వభావం వల్ల ఇంటికి వచ్చిన బంధువులకు కూడా దూరదూరంగానే ఉంటారు. కొంత పెడసరంగానే వ్యవహరిస్తారు. వచ్చిన వాళ్లు దగ్గరగా తీసుకుంటే, ఎప్పుడు పక్కకు తప్పుకుందామా అనిచూస్తుంటారు. వాళ్లు ప్రేమతో ఏదైనా ఇవ్వబోతే, వద్దనే చెబుతుంటారు. ఒకవేళ తల్లితండ్రులో, ఇతరులో ఒత్తిడి చేస్తే అయిష్టంగానే తీసుకుని ఆ తర్వాత పక్కన పడేస్తారు. ఈ తరహా మానసిక స్థితి నుంచి వారిని పూర్తిస్థాయిలో బయటికి తీసుకురావడం చాలా కష్టం. ఇలాంటివాళ్ల విషయంలో ఉన్న పరిష్కారమల్లా తల్లితండ్రులు వారి సున్నితత్వాన్ని పసితనంలోనే గుర్తించడం. ఏదైనా తప్పు చేసినా, అందరు పిల్లల్లోలా వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడం, తిట్టడం, కొట్టడం అసలు చేయకూడదు.
 
సున్నితంగా మందలిస్తే చాలు ఆ తప్పు మరొకసారి చేయనంతగా సర్దుకుంటారు. అయితే, ఇలాంటి చాలామంది పిల్లల్లో గొప్ప సృజనాత్మక శక్తి ఉంటుంది. కళాత్మక రంగాల్లో వీళ్లు అద్భుతాలు చేయగలుగుతారు. ఆ విషయాల్ని దృష్టిలో ఉంచుకుని, వాళ్ల పెంపకం విషయలో అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.