ఈ సమస్యను సరిదిద్దొచ్చా?

23-07-2018: డాక్టర్‌! మా అబ్బాయికి ఏడో నెల. పుట్టినప్పటి నుంచీ ఒక వృషణం కలిగి ఉన్నాడు. డాక్టర్లు... ఐదేళ్ల వయసొచ్చేలోపు సర్జరీ చేసి పొత్తి కడుపులో ఉండిపోయిన వృషణాన్ని బయటకు తీయొచ్చు అంటున్నారు. ఇంతకాలం ఆగవచ్చా? ఇలా ఉంటే భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులుంటాయా?
- ఓ సోదరి, నెల్లూరు.
 
కొందరు పిల్లలకు పుట్టుకతోనే ఒక వృషణం పొత్తి కడుపులో ఇరుక్కుని ఉంటుంది. ఇలాంటప్పుడు పెరిగేకొద్దీ అదే కిందకి జారుతుందిలే! అని కొందరు సలహాలిస్తూ ఉంటారు. కానీ ఇది కరెక్టు కాదు. అలాగే సర్జరీ చేసి వృషణాన్ని సరి చేయడానికి ఐదేళ్లపాటు ఆగాలనేది కూడా పాత పద్ధతే! తాజా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం బాబుకు సంవత్సరం నిండేలోపే సర్జరీ చేసి వృషణాన్ని బయటకు తెప్పించాలి. ఈ విషయంలో ఆలస్యం పనికి రాదు. దాన్ని అలాగే వదిలేస్తే కేన్సర్‌గా మారే అవకాశాలు 5 % వరకూ ఉన్నాయి.
 
కాబట్టి వైద్యులను సంప్రదించి సర్జరీ చేయించండి. కొందరు పిల్లలు ఒకే వృషణంత పుడుతూ ఉంటారు. వీరికి రెండవ వృషణం పొత్తి కడుపులో కూడా ఉండకపోవచ్చు. అయినా కంగారు పడవలసిన అవసరం లేదు. ఇలాంటి పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యా ఉండదు. పిల్లలు కలగడానికి కూడా ఎటువంటి అడ్డంకీ ఉండదు. కాబట్టి పిల్లవాడికి వృషణం పొత్తి కడుపులో ఉండిపోయి కిందకు రాకుండా ఉందా? లేక రెండవ వృషణమే లేదా? అనే విషయం గమనించాలి. ఏ మాత్రం అనుమానం ఉన్నా పిల్లల డాక్టురు, లేదా యూరాలజి్‌స్టని సంప్రతించాలి.
 
-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,
ఆండ్రాలజిస్ట్‌, ఆండ్రోకేర్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.