చలికాలంలో చిన్నారుల ఆరోగ్యం జాగ్రత్త..

రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ

31-10-2017: ఇటీవల కొన్ని రోజులుగా వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శీతాకాలం సమీపిస్తుండడంతో చలిగాలులు వీస్తున్నాయి.. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలకు శ్వాసకోశ సమస్య చిన్నగా మొదలై ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం పొంచి ఉంటుంది. తల్లిదండ్రులు వ్యాధి లక్షణాలను వెంటనే గుర్తించి పిల్లల వైద్య నిపుణులను సంప్రదించాలి. వారు సూచించిన మందులు వాడుతూ తగు జాగ్రత్తలు  పాటిస్తూ ఉంటే పిల్లలను రక్షించుకోవచ్చు. 

ప్రస్తుతం రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతుం డడం, చలిగాలులతో పాటు వాతావరణ కాలుష్యం కారణంగా చిన్నారులు శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. చలికాలంలో ఆస్పత్రులకు వస్తున్న ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఇద్దరు బ్రాంకైటిస్‌ న్యూమోనియాతో ఇబ్బంది పడే వారే ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అయితే చిన్నపాటి జాగ్రత్తలతో పిల్లల్లో శ్వాసకు సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించ వచ్చునని వారు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్ల లోపు చిన్నారులు 16శాతం మంది ఈ వ్యాధితో ఇబ్బంది పడుతుండగా పట్టణంలో 22శాతం వరకు బాధపడుతున్నారని   పేర్కొంటున్నారు. చలికాలంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 50 శాతం మందికిపైగా ఈ సమస్యతో వస్తుంటారని, ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో శ్వాసనాళాలు ముడుచుకుని వాటిలో కఫం చేరడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఫలితంగా న్యూమోనియాకు దారి తీయడంతో పాటు ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చని వివరిస్తున్నారు.
వ్యాధిని గుర్తించడం ఇలా...
బ్రాంకోలైటిస్‌ వైరస్‌ వల్ల న్యూమెనియా వ్యాధి సంక్రమిస్తుంది. అయితే పీసీడీ వాక్సిన్‌ను ముందస్తుగా వేసుకుంటే ఈ వ్యాధి దరి చేరకుండా కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. తరుచూ దగ్గు, జలుబు, దగ్గుతో కఫం కక్కడం, పిల్లికూతలు, వర్షాకాలంలో ఎక్కువగా సమస్య ఉండడం, చంటి పిల్లలు పాలు తాగడానికి ఇబ్బంది పడడం వంటి లక్షణాలు ఈ వ్యాధి వచ్చిన వారిలో కనిపిస్తాయి. సంవత్సరంలోపు వయస్సు పిల్లల్లో దగ్గు, కఫం, వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా బ్రాంకైటీస్‌ రావచ్చు. ముఖ్యంగా రాత్రివేళల్లో దగ్గు బాగా వస్తుండ డం. ఎక్కువసేపు ఆడినా, పరిగెత్తినా దగ్గు, ఆయాసం రావడం బ్రాంకైటిస్‌ న్యూమోనియా యొక్క లక్షణాలు.
ఆహారంలో జాగ్రత్తలు...
ఐస్‌క్రీం, కూల్‌డ్రింక్స్‌ తీసుకునే పిల్లల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బత్తాయి వంటి పండ్లు, కొన్నిరకాల ప్యాకెట్‌ ఫుడ్స్‌, కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్‌  గా ఉన్న ఆహార పదార్ధాలు శ్వాసకోశ వ్యాధులకు ముఖ్య కారణాలు. పిల్లలకు ఏ రకమైన ఆహార పదార్ధాలు సరిపడవో గుర్తించి వాటిని అస్సలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
నివారణ చర్యలు ఇలా...
బ్రాంకోలైటిస్‌ను ప్రేరేపించే కారకాలను గుర్తించి
వాటికి దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించచ్చని 
వైద్యులు చెబుతున్నారు. 
తల్లిపాలు తాగిన పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత 
వ్యాధులు తక్కువ. మొదటి ఆరు నెలలు లేదా 
సంవత్సరం దాకా తప్పనిసరిగా ఇవ్వాలి. 
పిల్లలు పెరిగే పరిసరాలు దుమ్ము, దూళి 
లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
ఇంట్లో నేలను ముఖ్యంగా పిల్లలు ఉన్నచోట 
క్రమం తప్పకుండా తడిగుడ్డతో శుభ్రం చేయాలి.
కట్టెల పొయ్యి పొగలు, దోమల నివారణ కాయిల్స్‌, సాంబ్రాణి, దూపాలు వంటివి వీరికి అస్సలు పడవు. సిగరెట్‌, చుట్ట పొగలు అతి ప్రమాదకరం. 
పెంపుడు జంతువులు ఇంట్లో ఉంచకూడదు. బొచ్చు బొమ్మలు ఉపయోగించవద్దు. 
పిల్లలకు వాడే దుప్పట్లు, దిండు కవర్లు తరుచూ మారుస్తూ ఉతికి శుభ్రం చేసి ఎండలో ఆరవేయాలి.
పిల్లలు ఇంట్లో లేనప్పుడు మాత్రమే బూజు దులపడం వంటి పనులు చేయాలి
బొద్దింకలు, ఎలుకలు వంటివి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి.