బాబుకి రొమ్ములెందుకు?

ఆంధ్రజ్యోతి, 10-07-2018: మా బాబు వయసు పదేళ్లు! ఈ మధ్య బాబుకు రొమ్ములు పెరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? వయసు పెరిగేకొద్దీ తగ్గిపోతాయా? లేక ఇలాగే ఉండిపోతాయా?   

- ఓ సోదరి, గుంటూరు
 
రొమ్ము కణజాలం పెరగడాన్ని ‘గైనకోమాస్టియా’ అంటారు. టెస్టోస్టిరాన్‌, ఈస్ట్రోజెన్‌ హార్మోన్లలో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. మరీ ముఖ్యంగా పురుష హోర్మోన్‌ టెస్టోస్టిరాన్‌ తగ్గడంతో ఈ లక్షణం మొదలవుతుంది. గైనకోమాస్టియా ఒకటి లేదా రెండు రొమ్ముల్లోనూ కనిపించవచ్చు. ఇది పిల్లల్లో, కౌమార వయసు బాలల్లో, పెద్దల్లో కూడా కనిపించవచ్చు. సాధారణంగా బాల్యంలో కనిపించే ఈ లక్షణం పెరిగేకొద్దీ దానంతటదే సర్దుకుంటుంది. అలా కాకుండా రొమ్ముల్లో సలపరం ఉన్నా, వాపు కనిపించినా, స్రావం కారుతున్నా ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రతించాలి. మగపిల్లల్లో రొమ్ములు పెరగడాన్ని మందులతో కూడా నియంత్రించే వీలుంది. కాబట్టి బాబులో కనిపించే లక్షణాలను జాగ్రత్తగా గమనిస్తూ, అవసరమైతే వైద్యుల్ని సంప్రతించండి.
 
 డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,
ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.