అమ్మ పాలే అమృతం

30-07-2018: బాల్యంలో కృత్రిమ పోషకాలు ఎన్ని ఇచ్చినా అవి తల్లిపాలకు ఎప్పుడూ సరిపోలేవనేది పరమ వాస్తవం. తల్లి పాలంటే కేవలం ఆకలి తీర్చడానికే అని కాదు. అవి శరీరాన్ని రోగగ్రస్థం చేసే అనేక రుగ్మతలకు అడ్డుకట్ట వేస్తాయి. నిజానికి, తల్లి పాలు తాగిన శిశువుకు కలిగే ప్రయోజనాలు అనేకం. వాటిల్లో ప్రధానంగా....
 తల్లిపాల వల్ల శరీరం అస్వస్థతకు గురయ్యే అవకాశం తగ్గడంతో పాటు ఎలర్జీలకు తావు లేకుండా పోతుంది.
బాల్యంలోనే స్థూలకాయం వచ్చే ప్రమాదం తప్పుతుంది. దాని వల్ల మునుముందు టైప్‌ -1, టైప్‌ -2 మధుమేహం బారిన పడే సమస్య తప్పుతుంది.
చెవి ఇన్‌ఫెక్షన్లకు వీలుండదు. ఉదర సంబంధమైన వ్యాధులు దూరమవుతాయి.
మెదడు గరిష్ఠంగా వృద్ధి చెందడానికి తల్లిపాలు గొప్ప ఔషధంలా పనిచేస్తాయి.
పాలలోని పోషకాలు, శరీరాన్ని శక్తివంతంగా మార్చడంతో పాటు, మరే మార్గంలోనూ సాధ్యం కానంతగా వ్యాధినిరోధక శ క్తి పెరుగుతుంది.
పోలియో, టె టానస్‌, డిప్తీరియా, హీమోఫిలస్‌ ఇన్‌ఫ్లూయెంజా వంటి టీకాలు ఇచ్చినప్పుడు శరీరం వేగంగా స్పందిచేలా చేస్తాయి.
దవడ భాగాల కదలికలు బావుండటంతో పాటు మునుముందు దంతక్షయం జరిగే అవకాశం లేకుండా పోతుంది.
శ్వాసకోశాలు ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడటంలో తల్లిపాలు శక్తిమంతంగా పనిచేస్తాయి.
పిల్లలు న్యుమోనియా, బ్రాంకైటిస్‌ వంటి జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి.
గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి పెరగడానికి తల్లి పాలు బాగా తోడ్పడతాయి.
అందుకే ఏ పాలైనా ఒకటేనని, డబ్బా పాలతో సరిపెడదాం అని చూస్తే, అది పిల్లలను చేజేతులా జబ్బుల పాలు చేయడమేనని నిపుణులు చెబుతున్నారు.