పిల్లలకు పాలు జీర్ణం కావడం లేదా..

మా అబ్బాయి పాలు సరిగా జీర్ణం చేసుకోలేడు. అందుకని సజ్జలు, జొన్నలు, కొర్రలు, బాదం, పిస్తా కలిపి చేసిన రవ్వ లాంటిది వండి పెడుతుంటాను. బాబుకి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు. మంచి సలహా ఇవ్వండి? 

- పద్మప్రియ, వరంగల్‌
మీ బాబుకు రెండున్నరేళ్లు కాబట్టి పూర్తిగా రవ్వమీదే ఆధారపడాల్సిన పని లేదు. సాధారణంగా పిల్లలకు ఏడాదిన్నర నుండి రెండేళ్లలోపు ఇంట్లో తీసుకునే ఆహారం అలవాటు చెయ్యాలి. ఇలా రవ్వలా చేసి పెట్టడం మూలాన పోషకాలు కొంత వరకు అందినా కొరకడం, నమలడం వంటి ముఖ్యమైన పనులను చేయడంలో వెనకబడతారు. రోజులో ఓసారి రవ్వని ఆహారంగా ఇచ్చి మిగతా వేళల్లో మీరు వండుకునే పదార్థాలనే మెత్తగా కలిపి పెట్టండి. పిల్లలకు మనతో పాటుగా తినడం అలవాటు చేయాలి. దీని వల్ల వారికి మంచి ఆహారపు అలవాట్లు అలవడతాయి. మీరు తీసుకునే అన్నం, కూరలు, పప్పు, పెరుగు... అన్నీ నిశ్చింతగా పెట్టండి. కావాలంటే ఓ రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసి పెడితే ఇష్టంగా తింటారు. అలాగే ఆకుకూరలు కూడా. మాంసాహారం తినేవారైతే చికెన్‌, చేప లాంటివి, కోడిగుడ్డు కొంచెం మెత్తగా నలిపి అన్నంతో కలిపి పెట్టవచ్చు. వీటన్నిటి నుంచీ వచ్చే పోషకాలు రవ్వలో రావు. కొరికి తినగలిగే పండ్లు కూడా రోజుకు ఒకటి రెండు సార్లు ఇవ్వొచ్చు. ఈ ఘనాహారం వల్ల కడుపు నిండుతుంది కూడా.