కేన్సర్‌ చికిత్సలో బంగారం సాయం!

లండన్‌, వాషింగ్టన్‌, ఆగస్టు 7: కేన్సర్‌ చికిత్సలో బంగారం చూర(సూక్ష్మ అణువులు) సహాయపడుతుందని యూకేలోని ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఊపిరితిత్తుల కేన్సర్‌కు వాడే ఔషధాల పనితీరును, ప్రభావాన్ని పెంచుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని తెలిపారు. బంగారం చూర కలిగిన ఒక రసాయన పరికరాన్ని రూపొందించిన పరిశోధకులు.. కీమోథెరపీ దుష్ప్రభావాల్ని తగ్గించడంలో, ఆరోగ్యకర కణజాలానికి ఇబ్బంది కలగకుండా దెబ్బతిన్న కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చికిత్స చేయడంలో పరికరం ఉపయోగపడుతుందని వివరించారు. మరోవైపు ఒక్కొక్క జీవించి ఉన్న కణాన్ని సంగ్రహించి, మోసుకొని పోయే పాక్‌-మాన్‌ లాంటి మైక్రోబాట్‌ను అమెరికాలోని నార్త్‌ కరోలినా స్టేట్‌ వర్సిటీ, డ్యూక్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఔషధాలకు కేన్సర్‌ కణాలు ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకునేందుకు ఇది సహాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.