ప్రాణాంతక వ్యాధులు ‘క్లారిటీ’గా నిర్ధారణ!

సులువుగా, తక్కువ ఖర్చులో అయిపోయే టెస్ట్‌

15-08-2017: అభివృద్ధికి ఆమడ దూరంలోని పేద దేశాలు, ఇప్పుడిప్పుడే అభివృద్ధిబాట పడుతున్న దేశాల్లో ప్రాణాంతక వ్యాధులను గుర్తించే సౌకర్యాలు అరకొరగా ఉంటున్నాయి. అత్యంత ఖరీదైన పరికరాలతో ఖరీదైన పరీక్షలు చేసే వసతులు ఆయా దేశాల్లో చాలా తక్కువ. మరీ, ముఖ్యంగా కేన్సర్‌ లాంటి మహమ్మారులను తక్కువ ఖర్చులో గుర్తించే పరీక్షలు అందుబాటులో ఉండడం చాలా తక్కువ. అలాంటి దేశాల్లో మెరుగైన వ్యాధి నిర్ధారణ పద్ధతులను కనుగొనడంలో అమెరికా యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ఏంజిలిస్‌ పరిశోధకులు ముందడుగు వేశారు. భారత సంతతికి చెం దిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాజన్‌ కులకర్ణి సహా పలువురు పరిశోధకులు ఈ సులువైన, తక్కువ ఖర్చులో అయిపోయే వ్యాధి నిర్ధారణ పద్ధతిని కనుగొన్నారు. ‘క్లారిటీ’ అనే టెక్నిక్‌ ద్వారా కణజాల శాంపిళ్లను పరిశోధకులు తయారుచేశారు. ఈ పద్ధతిలో కణజాలం పారదర్శకంగా కనిపించడమే కాకుండా కణజాలంలోని కొవ్వు వేరైపోయి పరీక్షకు అవసరమయ్యే డీఎన్‌ఏ, ప్రొటీన్లు మాత్రమే మిగులుతాయన్నారు. హాలోగ్రాఫిక్‌ లెన్స్‌ఫ్రీ త్రీడీ మైక్రోస్కోపును అభివృద్ధి చేశామన్నారు.