సోయాతో రొమ్ము కేన్సర్‌కు చెక్‌

ఆస్పిరిన్‌తో జీర్ణకోశ కేన్సర్‌కు చెక్‌

01-11-2017: రొమ్ము కేన్సర్‌ వృద్ధిని అడ్డుకునే ఓ సమ్మేళనాన్ని సోయా ఆహార ఉత్పత్తుల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సోయాలో ఉండే జెన్‌స్టెయిన్‌ అనే సమ్మేళనం, కేన్సర్‌ కణతుల ఎదుగుదలను నిరోధించే బీఆర్‌సీఏ1 జన్యువును రక్షిస్తోందని అమెరికాలోని అరిజోన వర్సిటీ పరిశోధకులు విశ్లేషించారు. బీఆర్‌సీఏ1 జన్యువు సహజరీతిలో పనిచేసినప్పుడు కేన్సర్‌ వంటి జన్యు సంబంధిత వ్యాధులపై పోరాటం చేస్తుంది. అది అసహజరీతిలోకి మారినప్పుడు రొమ్ము కేన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేసే రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతోందని పరిశోధకులు తెలిపారు. బీఆర్‌సీఏ1 జన్యువును అసహజరీతిలోకి మార్చే ఏహెచ్‌ఆర్‌(ఆరోమేటిక్‌ హైడ్రోకార్బన్‌ రిసెప్టర్‌) అనే రసాయన గ్రాహకాన్ని జెన్‌స్టెయిన్‌ సమ్మేళనం టార్గెట్‌ చేస్తోన్నట్లు వారు తెలిపారు.

 
దీంతో, రొమ్ము కేన్సర్‌ను నిరోధించే అధునాతన చికిత్సల వృద్ధికి మార్గం ఏర్పడిందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆస్పిరిన్‌ మందును దీర్ఘకాలికంగా వాడే వారిలో జీర్ణకోశ కేన్సర్‌ వచ్చే ప్రమాదం తగ్గుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు చైనీస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ చేసిన పరిశోధనలో ఆస్పిరిన్‌ వాడని వారికంటే, దీర్ఘకాలికంగా (కనీసం 6 నెలలు) వాడే వారిలో వివిధ కేన్సర్లు వచ్చే ప్రమాదం 24-47శాతం వరకు తగ్గుతోందని విశ్లేషించారు.