పిల్స్‌తో క్యాన్సర్‌

18-12-2017: క్రమం తప్పక గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ‘న్యూ ఇంగ్లండ్‌ జోర్సల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రచురితమైన ఓ పరిశోధన తెలియజేస్తోంది. తాజా పరిశోధన కోసం 15 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న 1.8 మిలియన్‌ మహిళలను ఎంచుకుని, హార్మోన్లు లేని కండోమ్స్‌, కాపర్‌ ఐయుడి వాడిన మహిళలను, గర్భ నిరోధక మాత్రలు వాడిన మహిళలతో పోల్చి చూశారు. 

ఈ ప్రయోగంలో హార్మోన్‌ మాత్రలు వాడిన మహిళల్లో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 20 శాతం పెరిగినట్టు రుజువైంది. గర్భనిరోధక మాత్రలు ఎంత ఎక్కువ కాలం వాడితే క్యాన్సర్‌ రిస్క్‌ అంత ఎక్కువగా పెరుగుతున్నట్టు కూడా పరిశోధకులు గుర్తించారు. అయితే రొమ్ము క్యాన్సర్‌కు గర్భనిరోధక మాత్రల వాడకం ఒక్కటే కారణం కాదు. వంశపారంపర్యంగా, జన్యుపరమైన లోపాల మూలంగా, దురలవాట్ల వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలుంటాయి. అలాంటివాళ్లు అదనంగా గర్భ నిరోధక మాత్రలు వాడితే ప్రమాదం రెట్టింపుగా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటున్నారు పరిశోధకులు.