ఈ చేపలు తింటే కేన్సరే

(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి, 04-09-2017): వంటికి చేపలు ఎంతో ఆరోగ్యం. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండవు.. డాక్టర్లు తరచూ ఇచ్చే సలహా ఇది. మటన్‌, చికెన్‌ పక్కనపెట్టండి. తింటే అనేక రోగాలు అంటూ వార్నింగ్‌లు ఇస్తుంటారు. కాని ఇంత మంచి ఆహారాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చైనా నుంచి ఆరంభమైంది. ఇప్పటికే కల్తీ సరుకులతో ప్రాణాల మీదకు వస్తున్న తరుణంలో ఏకంగా కల్తీ డ్రగ్స్‌, నిషేధిత డ్రగ్స్‌ను మార్కెట్‌లో అడ్డంగా చొప్పిస్తున్నారు. ఎంతలా అంటే కొన్ని రాష్ట్రాలు కేంద్రం గా తయారవుతున్న యాంటిబయోటిక్స్‌ను చేపల చెరువులకు మళ్లిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా మం దులు నిషేధిత జాబితాలో ఉన్నాయి. కాని మాయ మాటలతో వ్యాపారం చేస్తున్నారు. ఈ డ్రగ్స్‌ వాడి న చెరువుల్లో పెరిగే చేపలు తింటే.. కేన్సర్‌ ముంచుకొస్తుంది. రక్తహీనత దెబ్బ తీస్తుం ది. రోగ నిరోధక శక్తిని అమాంతం  పడేస్తుంది. మనిషి చిక్కి శల్యమైపోతాడు. తిరుగుతా ఉండే మనిషే ఏకంగా ఒకేసారి కుప్పకూలిపోతాడు. 

అలాంటి యాంటి బయోటిక్స్‌ ఇది. ఏనాడో మన దేశంలో నిషేధించిన డ్రగ్స్‌ ఇది. ఇప్పుడు ఎక్కడ వాడకంలో ఉన్నాయో నిగ్గు తేల్చేందుకు ఔషధశాఖ రంగంలోకి దిగింది. వీటిని నిగ్గు తేల్చే ప్రయత్నం చేస్తోంది. మన జిల్లా చేపల పెంపకానికి పెట్టింది పేరు. రాను రాను విస్తీర్ణం పెరిగింది. పెంపకం అదే రీతిలో పెరిగింది. ఇంత వరకు బాగానే ఉంది. చేపల పెంపకంలో వాడకూడని నిషేధిత డ్రగ్స్‌ను ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించింది. కాని చైనా వీటిని అడ్డదారిన భారత్‌లోకి పంపింది. ఎంతెలా అంటే.. మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో కొన్ని కంపెనీలకు చేరవేస్తుంది. బల్క్‌ డ్రగ్‌ వ్యాపారానికి తెరలేపింది. మూడో కంటికి తెలియకుండా వీటిని సాధారణ మార్కెట్‌లోకి చేర్చింది. పేరెన్నికగన్న డ్రగ్స్‌ ఇవి. వీటిని చేపల పెంపకానికి వాడితే పెట్టుబడికి నాలుగింతలు వస్తుందంటూ ప్రచారం. కాని ఈ తరహా మందులు చేసే కీడు అంతా ఇంతా కాదు. ఈ మధ్యన ఏలూరు సమీపాన శనివారపుపేటలో ఒక ఇంటిపై దాడి చేసినప్పుడు నిషేధిత డ్రగ్స్‌ బయటపడ్డాయి. తనిఖీలకు వెళ్ళిన అధికారులు విస్తుపోయారు. రంగంలోకి దిగారు. విజిలెన్స్‌ అధికారులను నలుమూలలకు పంపారు. అప్పుడుగాని వీటి వెనుక ఉన్న అసలు కఽథ బయటపడలేదు. ఆరంభంలోనే ఆక్వా నిషేధిత డ్రగ్స్‌ తయారీ వాడకం బయటపడింది. 
 
మానవాళి మనుగడకే ముప్పు
ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆక్వా రంగంపై డ్రాగన్‌ పంజా విసిరింది. చైనా నుంచి నిషేధిత సరుకు బల్క్‌ రూపంలో మహారాష్ట్ర, గుజరాత్‌లో గుట్టుచప్పుడు కాకుండా నడుపుతున్న కంపెనీల చేతికి చేరింది. అంతే తయారీ ప్రారంభమైంది. వీటిలో మానవ మనుగడను దెబ్బతీసే యాంటి బయోటెక్స్‌ ఉన్నాయి. శారీరకంగా ఉన్నపళాన తల్లకిందులు చేసే ఔషధాలు దీనిలో చేరుస్తున్నారు. ఈ నిషేధిత డ్రగ్‌ చేపల పెంపకంలో వాడితే వీటిని తినే వారికి అనారోగ్యం ఖాయం. ఎంతెలా అంటే కేన్సర్‌ దగ్గర నుంచి మొదలు. తెలిసీ తెలియక కొత్తగా వచ్చే రైతులు తక్కువ ధరకు వస్తున్నాయని వీటిని చెరువులో వాడితే ఆ తరువాత దుష్ఫలితాలన్నీ ఈ చేపలు తిన్న వారికే. నియోమైసిన్‌, ఫ్యూరోజోలిడన్‌, మెట్రోనిడాజోల్‌ వంటి పలు రకాల మందులను ఇంతకు ముందే నిషేధిత జాబితాలోకి చేర్చారు. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేసి చాన్నాళ్ళైంది. ఇలాంటి డ్రగ్స్‌ చైనా నుంచి దిగుమతి అవుతుంది. అంతేకాదు ఏకంగా పశు దాణాలోనూ వీటిలో కొన్నింటిని ఉపయోగిస్తారు. నిషేధపు డ్రగ్స్‌లో గుజరాత్‌లో మూడు రకాలు, మహారాష్ట్రలో ఐదు రకాలు తయారవుతున్నాయి. 
 
గుట్టురట్టు చేసిందిలా..
శనివారపుపేటలో ఒక వ్యక్తి ఇంటిలో నకిలీ కల్తీ మందులు తయారీ అవుతున్నాయని ఔషధ అధికారులకు వర్తమానం అందింది. రెండు రోజుల క్రితం మెరుపుదాడి చేశారు. సుమారు 28 లక్షలు విలువైన యాంటిబయోటిక్స్‌ మందులు లైసెన్స్‌ లేకుండా నిల్వ ఉంచి అమ్ముతున్నారని గుర్తించారు. తీగలాగారు. తన కుమారుడికి చెందిన ఫ్యాక్టరీ హైదరాబాదు శివారులోని కుకట్‌పల్లిలో ఉందని, అక్కడి నుంచి వీటిని రప్పించినట్టు రామస్వామి వెల్లడించారు. అంతే విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఉభయ రాష్ట్రాల అధికారులు తనిఖీలు చేశారు. శనివారపుపేటలో దొరికిన మందులను తానే అమ్మినట్టు రెడ్డి శ్రీనివాస్‌ అంగీకరించినట్టు సమాచారం. 
 
ఇప్పుడేం చేయబోతున్నారు
ఆక్వా విస్తరించిన ప్రాంతాల్లో ఈ నిషేధిత డ్రగ్స్‌ ఏ ప్రాంతానికి ఎంత చేరిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. చెరువుల్లో నుంచి శాంపిల్స్‌ తీసి పరీక్షలకు పంపుతారు. ఒకవేళ ఈ డ్రగ్స్‌ను చేపల పెంపకానికి వాడినట్టు నిర్ధారణ అయితే తక్షణం ఆ చెరువులో పండిన చేపలన్నింటిని నిషేధిస్తారు. బహిరంగంగా అమ్మకానికి వీలు లేకుండా తక్షణచర్యలు తీసుకుంటారు. ప్రాణాంతకమైన ఈ మందుల విషయంలో తక్షణ విచారణ చేపట్టారు. వాస్తవానికి మన జిల్లాలో పెద్దగా ఇలాంటి పరిస్థితులు లేవు. మారుమూలల్లో చేపల పెంపకాలు చేస్తున్న కొత్తవారికి మాత్రమే వీటిని అంటకట్టినట్టు చెబుతున్నారు.