క్షణాల్లో కేన్సర్‌ను గుర్తించే పెన్ను

10 సెకన్లలోనే 96% కచ్చితత్వంతో ఫలితాలు..

సాధారణ పరికరాల కంటే 150 రెట్లు వేగం

హౌస్టన్‌, సెప్టెంబరు 7: కేన్సర్‌.. ఇప్పటిదాకా ఈ మహమ్మారి కచ్చితత్వాన్ని గుర్తించే పరికరాలు ఉన్నా వ్యాధి కణాలను గుర్తించేందుకు కనీసం 30 నిమిషాలు పడుతుంది. కేవలం 10 సెకన్లలో కేన్సర్‌ కణాలను గుర్తించే పెన్ను లాంటి పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అది శస్త్రచికిత్స సమయంలో 96శాతం కచ్చితత్వంతో కణాలను గుర్తించి ఫలితాలను ఇస్తుందట.
 
‘మాస్‌ స్పెక్‌’ అనే ఈ డిస్పోజబుల్‌ పరికరం సాయంతో ఏ కణజాలాన్ని తొలగించాలి, దేన్ని కాపాడాలన్న స్పష్టమైన సమాచారం వైద్యులు తెలుసుకోవచ్చట. కేన్సర్‌ కణాల వ్యాప్తిని నిరోధించి వ్యాధిని పునరావృతం కాకుండా చేయటంలో ఈ పెన్ను దోహదం చేస్తుందని, సాధారణ పరికరాల కంటే 150 రెట్లు వేగంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పరికరాన్ని రోగి కణజాలంపై ఉంచినపుడు కణాల్లో కేన్సర్‌కు ప్రభావితమైన కణాలను ఇట్టే గుర్తింస్తుందని వెల్లడించారు. 253 మంది కణజాలాల నమూనాలను సేకరించి ఫలితాలను రాబట్టినట్లు వివరించారు.