శ్వాసతో ఊపిరితిత్తుల కేన్సర్‌ గుర్తింపు

ప్రాణాంతక ఊపిరితిత్తుల కేన్సర్‌ను తొలినాళ్లలోనే పసిగట్టేందుకు సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. లంగ్‌ కేన్సర్‌ ఇండికేటర్‌ డిటెక్షన్‌ (లూసిడ్‌)గా వ్యవహరిస్తున్న ఈ పరికరం.. శ్వాసను పరీక్షించడం ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్‌ జాడలను ఇట్టే పసిగడుతుందని అన్నారు. కేంబ్రిడ్జికి చెందిన ఓవల్‌స్టోన్‌ నానోటెక్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. 

లంగ్‌ కేన్సర్‌ సోకిన తర్వాత బాధితుల జీవితకాలం ఐదేళ్లకు పడిపోతుంది. ఈ క్రమంలో దీన్ని ముందుగా గుర్తించడం వల్ల బాధితులను రక్షించేందుకు అవకాశం లభిస్తుందని ఓవల్‌స్టోన్‌ సహ వ్యవస్థాపకుడు బిల్లీ బోయలే తెలిపారు. ప్రస్తుతం తుది పరిశీలన దశలో ఉన్న లుసిడ్‌ను వచ్చే ఏడాది తొలినాళ్లలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ పరికరంతో లంగ్‌ కేన్సర్‌ను ఖచ్చితంగా నిర్ధారించవచ్చని వివరించారు.