అవగాహన లేమి వల్లే రొమ్ము కేన్సర్‌!

భారత్‌లో విజృంభిస్తోందని పరిశోధనలో వెల్లడి

16-08-2017: అవగాహనారాహిత్యం వల్లే భారత్‌లో రొమ్ము కేన్సర్‌ విజృంభిస్తోందని తాజా పరిశోధనలో బయటపడింది. రొమ్ము కేన్సర్‌ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే సమస్య చాలావరకు పరిష్కారమవుతుందని, ఈ విషయంలో స్త్రీలతోపాటు పురుషులకు కూడా అవగాహన కలిగించాలని ఇంగ్లండ్‌లోని పార్ట్స్‌మౌత్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. సంస్కృతి, సాంప్రదాయాలను ఎక్కువగా గౌరవించే భారత స్త్రీలు మగ డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకునేందుకు వెనుకాడుతున్నారని వారు వెల్లడించారు. అలాగే ఆర్థికంగా పురుషుడి మీద ఆధారపడుతున్న మహిళలు రొమ్ము కేన్సర్‌ విషయంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇక, చదువుకుని ఉద్యోగం చేస్తున్న స్త్రీలు సైతం తమ శారీరక అంగాల గురించి భర్తలతో, సోదరులతో, తండ్రులతో చర్చించేందుకు సిద్ధపడరని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కమ్యూనిటీ హెల్త్‌ నర్సు (ఏఎన్‌ఎమ్‌)ల ద్వారా అవగాహన కల్పిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.