మూడు కప్పుల టీతో మతిమరుపు మాయం?

ఆంధ్రజ్యోతి,28-3-2017: టీ కాఫీల సేవనం మీద రోజుకొక కొత్త పరిశోధన వెలుగు చూస్తూనే ఉంది. టీ సేవించడం వలన కలిగే లాభాల మీద తాజాగా మరో పరిశోధన ఫలితం తెలియ వచ్చింది. ప్రతిరోజూ మూడు కప్పుల టీ తాగితే మతిమరుపును అధిగమించవచ్చన్నది ఆ పరిశోధనా సారాంశం. టీ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్‌, థియోప్లోవిన్స్‌ పోషకాల వలన మెదడులో వాస్క్యులార్‌ డ్యామేజ్‌, న్యూరోడీజనరేషన్‌ తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఏ రకం టీ తాగినా 50 శాతం డెమెన్షియా వచ్చే అవకాశాలు తగ్గుతాయన్న విషయం వీరి పరిశోధనలో వెల్లడైంది. అయితే మూడు కప్పుల టీకి మించకూడదని వీరు చెబుతున్నారు. అంతకు మించి తాగితే మంచి కన్నా చెడు జరిగే అవకాశం లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు.